పబ్లిక్ పరీక్ష రద్దు?
టెన్‌త విద్యార్థులకు
ఇక త్రైమాసిక పరీక్షలు
వచ్చే ఏడాది నుంచి అమలు
చెన్నై, సాక్షి ప్రతినిధి:
తొమ్మిదో తరగతి వరకే ఉన్న త్రైమాసిక పరీక్షల విధానాన్ని పదోతరగతికి సైతం విస్తరిస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. వచ్చే విద్యాసంవత్స రం నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. దీంతో పబ్లిక్ పరీక్షలు రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆరో తరగతి వరకు త్రైమాసిక పరీక్షల విధానాన్ని గతంలో 8వ తరగతికి, ఆ మరుసటి ఏడాది తొమ్మిదో తరగతికి విస్తరించారు. త్రైమాసిక విధానాన్ని దశలవారీగా ఇతర తరగతులకు అమలు చేస్తామని గతంలోనే ప్రకటించి ఉన్న ప్రభుత్వం తాజాగా పదో తరగతిని కూడా త్రైమాసిక విధానంలోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇంజనీరింగ్ కాలేజీల్లో సెమిస్టిర్ విధానంలా సెప్టెంబరు, జనవరి, ఏప్రిల్ నెలలకు సిలబస్‌ను విభజించి ఆయా విద్యా సంవత్సరాల్లో మూడునెలల, ఆరునెలల, సంవత్సర పరీక్షలను నిర్వహిస్తారు. ఇందుకోసం మెట్రిక్, ఆంగ్లో ఇండియన్, స్టేట్ సిలబస్‌ను క్రోఢీకరించి ఒకే సిలబస్‌గా గతంలో తయారు చేశారు. ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలు అనే తేడా లేకుండా అన్ని విద్యాసంస్థలు ఈ కొత్త విధానాన్ని అమలుచేయాల్సి ఉంటుంది. రానున్న విద్యాసంవత్సరం నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తున్నందున ఇందుకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలు ముద్రణాలయాల్లో ముద్రణ దశలో ఉన్నారుు. అయితే త్రైమాసిక విధానాన్ని అమలుచేస్తున్న తరుణంలో వచ్చే ఏడాది పదోతరగతికి పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలా వద్దా అని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
త్రైమాసికంతోపాటూ పబ్లిక్ పరీక్షలు కూడా నిర్వహించిన పక్షంలో సుమారు 10 లక్షల మంది విద్యార్థుల జవాబు పత్రాలను మూడుసార్లు దిద్దడం కష్టతరమైన వ్యవహారంగా ఉపాధ్యాయులు భావిస్తున్నారు. పబ్లిక్ పరీక్షలు నిర్వహించిన పక్షంలో త్రైమాసికంలో వచ్చిన మార్కులు ఎక్కడ, ఎలా కలపాలనే అనుమానాన్ని ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతి నుంచి త్రైమాసిక పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున వచ్చే విద్యాసంవత్సరంలో పబ్లిక్ పరీక్షలు ఉండవని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం పైకి ప్రకటించకున్నా కేవలం విద్యార్థుల హాజరీపైనే ఆధారపడి పైక్లాసుకు ప్రమోట్‌చేసేందుకు సిద్ధమైపోయింది. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు పరిమితమై ఉన్న త్రైమాసిక పరీక్షల విధానం పదోతరగతికి చేరుకున్నట్లుగానే వచ్చే ఏడాదికి పదకొండో తరగతికి కూడా విస్తరించే అవకాశం లేకపోలేదని ఒక ప్రధానోపాధ్యాయుడు చెప్పారు.