తెయూ(డిచ్‌పల్లి), న్యూస్‌లైన్:
సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని ఆందోళనలు చేస్తుంటే, ఏ మాత్రం పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్న తెలంగాణ యూనివర్సిటీ వీసీ అక్బర్‌అలీఖాన్‌పై గురువారం విద్యార్థులు నిరసనాగ్రహం ప్రదర్శించారు. డిచ్‌పల్లిలోని తెయూ బాలుర వసతి గృహ ం ఎదుట విద్యార్థులు వీసీకి పిండ ప్రదానం చే సి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వారం రోజులుగా విద్యార్థులు చేస్తున్న నిరసనను పట్టించుకోకుండా వీసీ ఏకపక్షంగా సెమిస్టర్ పరీక్షలను నిర్వహించడం తగదన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. డిచ్‌పల్లిలోని వర్సిటీ మెయిన్ క్యాంపస్, భిక్కనూరులోని సౌత్ క్యాంపస్‌తో పాటు వర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో కనీసం 3 శాతం విద్యార్థులు కూడా పరీక్షలు రాయడం లేదన్నారు. మెజార్టీ విద్యార్థులు పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నా, వీసీ తన మొండి వైఖరికి పోవడం తగదన్నారు. వెంటనే పరీక్షల రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు.
కామారెడ్డిలో చెట్టుకు ఉరి
కామారెడ్డి : పీజీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని టీజీవీపి ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు తెయూ వీసీ అక్బర్ అలీఖాన్ దిష్టిబొమ్మను చెట్టుకు ఉరితీశారు. అనంతరం కళాశాల ఎదుట దహనం చేశారు. కార్యక్రమంలో టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు నవీన్, నాయకులు లక్ష్మణ్, వేణు, కిరణ్, తిరుపతి, హజాం, విద్యార్థులు పాల్గొన్నారు.
సౌత్ క్యాంపస్‌లో పరీక్షల బహిష్కరణ
భిక్కనూరు : తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌క్యాంపస్‌లో పీజీ ద్వితీయ సంవత్సరం సెమిస్టర్ పరీక్షలను గురువారం విద్యార్థులు బహిష్కరించారు. పరీక్షలకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ సుధాకర్‌గౌడ్ విద్యార్థులను కోరగా, విద్యార్థులు నిరాకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ఈ నెలలో నెట్ పరీక్షలు ఉన్నందునే సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని వీసీని కోరినా పట్టించుకోవడం లేదని. గత్యంతరం లేక పరీక్షలను బహిష్కరిస్తున్నామని చెప్పారు. పరీక్షలను తిరిగి పది రోజుల తర్వాత నిర్వహించేందుకు రీ నోటిఫికేషన్ వేయాలని విద్యార్థులు కోరారు. దీంతో ప్రిన్సిపాల్ సుధాకర్‌గౌడ్ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తానని విదార్థులకు తెలిపారు.
తెయూ వీసీపై విద్యార్థుల నిరసనాగ్రహం
Published Fri, Dec 13 2013 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
Advertisement