సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ఏసీబీ వలలో చిక్కిన తర్వాత రాజ్యాంగ పరమైన అనేక అంశాలపై విద్యాశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి వీసీ నియామకం, తొలగింపుపై పూర్తి అధికారాలు గవర్నర్‌కు మాత్రమే ఉంటాయి. నియామకానికి సిఫార్సు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా, తొలగింపు విషయంలో మాత్రం ఏ అధికారం ఉండదని నిబంధనలు పేర్కొంటున్నాయి.
తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి సమావేశంలోనూ వీసీ ఈ అంశాలను అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. కాలేజీ విద్య కమిషనర్‌కు తనను ప్రశ్నించే అధికారమే లేదని ఆయన అన్నట్టు మీడియాలో వచ్చింది. ఆ త ర్వాత కూడా తనను తీసివేసే అధికారం ప్రభుత్వాని కి ఎక్కడుందనే వాదన పరోక్షంగా వీసీ లేవ నెత్తారు.
ఇదే క్రమంలో యూనివర్సిటీ పాలన వ్యవహారాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొనడం, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు చేయడం, తాజాగా ఓ వ్యవహారంలో ఏసీబీ ప్రత్యక్షంగా వీసీని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం ఈ ఎపిసోడ్‌లో కొత్త మలుపు. ఇప్పు డు జరగబోయేదేంటనేది హాట్ టాపిక్‌గా మారింది.
వీసీ నియామకం ఎలా...?
ఏదైనా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌ను నియమించేటప్పుడు ముందుగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది. ఈ ప్రక్రియ కోసం ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇందులో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి ఒకరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరు, వీసీ నియామకం జరిగే విశ్వవిద్యాలయం నుంచి ఒకరిని ఈ కమిటీలో చేరుస్తారు.
యూజీసీ ఎవరినైనా నిపుణుడిని సూచిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున విద్యాశాఖ కార్యదర్శి సభ్యుడిగా ఉంటారు. యూనివర్సిటీ తరపున పదవీ విరమణ చేసిన నిపుణుడైన మాజీ వీసీని సాధారణంగా చేరుస్తారు. నోటిఫికేషన్ తర్వాత వచ్చే దరఖాస్తులను కమిటీ పరిశీలించి, ముగ్గురి పేర్లను గవర్నర్‌కు పంపుతుంది. ఇందులోంచి గవర్నర్ ఒకరిని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత గవర్నర్ నియామకానికి సంబంధించిన నియామకపు ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి ఇస్తారు.
తొలగింపు ఎలా?
గవర్నర్ నియమించిన వైస్ చాన్స్‌లర్ ప్రభుత్వానికి ఇష్టం లేదనుకుంటే రెండింట మూడొంతుల అసెంబ్లీ మెజారిటీ తీసుకుని వీసీ తొలగింపు ఉత్తర్వులు ఇవ్వొచ్చు. ఇక్కడ కూడా అసెంబ్లీ నిర్ణయాన్ని గవర్నర్‌కు పంపాల్సి ఉంటుంది. నేరుగా గవర్నర్‌కు కూడా వీసీని కారణాలు లేకుండా తొలగించే అధికారం ఉండదు. అయితే, తెలంగాణ యూనివర్సిటీ వీసీ వివాదం భిన్నమైంది.
ఇలాంటి సంక్లిష్ట సమస్య గతంలో ఎప్పుడూ ఎదురవ్వలేదు. ఏసీబీ దాడి చేయడంపైనా పలు ప్రశ్నలు తెరమీదకొస్తున్నాయి. ఇలా దాడి చేయాలన్నా, ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోవాలా? అనే విషయమై ఉన్నతాధికారులు ముందుగా న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. వీసీ వేతనం తీసుకుంటున్నాడు కాబట్టి, ప్రజా సేవకుడిగానే చూడాలని నిపుణులు తెలిపారు. కాబట్టి ఏసీబీ చట్టం పరిధిలోకి వస్తారని స్పష్టం చేశారు.
ఏసీబీ దాడి, అరెస్టు జరిగిన తర్వాత వీసీని కూడా సస్పెండ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. విచారణ పూర్తయి నేరం రుజువైతే శాశ్వతంగా తొలగించే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని చెబుతున్నారు. కాకపోతే ప్రతీ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళా్లల్సిన అవసరం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment