vc akbar ali khan
-
వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న విద్యార్థులు
సిరికొండ, న్యూస్‌లైన్ : తెలంగాణ యూనివర్సి టీలో సెమిస్టర్ పరీక్షల విషయం లో కొంత మంది విద్యార్థులు కొద్ది రోజులుగా చేస్తున్న ప్రకటనలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని వీసీ అక్బర్ అలీ ఖాన్ అన్నారు. విద్యార్థులు చేస్తున్న వివాదం యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చాలా మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నా కొంత మంది విద్యార్థులు వారిని అడ్డుకోవడం బాధాకరమన్నారు. సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. గతంలో డిసెంబర్ 3 నుంచి నిర్వహించాల్సిన పరీక్షలను 9వ తేదీకి వాయిదా వేసిన విషయాన్ని గుర్తు చేశారు. పరీక్షలకు సన్నద్ధం కావడానికి కావాల్సిన సమయం ఇచ్చామని తెలిపారు. ఇది వరకే ఒకసారి వాయిదా వేసిన పరీక్షలను మరో మారు వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేశారు. ఎందరో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే తాను ఆ నిర్ణయం తీసుకున్నానని,విద్యార్థులు సంయమనంతో వ్యవహరించాలని కోరారు. ఇప్పటి వరకు పరీక్షలు రాయని వారు ఇక మీదట పరీక్షలకు హాజరైతే, ఇది వరకు రాయని పరీక్షలను తిరిగి నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ విద్యార్థుల నుంచి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థుల అర్ధ నగ్న ప్రదర్శన సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు సోమవారం మరో మారు ఆందోళనకు దిగారు. పరీక్షలు వాయిదా వేయడంలో వీసీ అక్బర్ అలీ ఖాన్ తీరును నిరసిస్తూ విద్యార్థులు అర్ధ నగ్న ప్రదర్శన చేపట్టారు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీసీ ఒంటెత్తు పోకడలను వారు తీవ్రంగా ఖండించారు. పరీక్ష ఫీజు గడువు పెంపు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని 2013-14 సంవత్సరానికి డిగ్రీ అన్ని విభాగాల పరీక్షల ఫీజు గడువును పొడగించినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ నసీం తెలిపారు. బీఏ,బీకాం,బీఎస్సీ కోర్సుల మొదటి,ద్వితీయ,తృతీయ సంవత్సరాల పరీక్షల ఫీజులను ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 20వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. వంద రూపాయల ఆలస్య రుసుంతో ఈ నెల 24 వరకు చెల్లించవచ్చని తెలిపారు. సెమిస్టర్ పరీక్షలకు 162 మంది హాజరు తెయూ పరిధిలోని నాలుగు పరీక్ష కేంద్రాల్లో సెమిస్టర్ పరీక్షలకు సోమవారం 162 మంది హాజరయ్యారని రిజిస్ట్రార్ ఆర్.లింబాద్రి తెలిపారు. తెయూ క్యాంపస్‌లో 34 మంది,గిరిరాజ్లో 20,ఆర్మూర్‌లో 107 మంది,బోధన్‌లో ఒకరు పరీక్షలకు హాజరైనట్లు పేర్కొన్నారు. తెయూలో పరీక్షలకు ఇబ్బందులు తలెత్తకుం డా డిచ్పల్లి పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
తెయూ వీసీపై విద్యార్థుల నిరసనాగ్రహం
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్: సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని ఆందోళనలు చేస్తుంటే, ఏ మాత్రం పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్న తెలంగాణ యూనివర్సిటీ వీసీ అక్బర్‌అలీఖాన్‌పై గురువారం విద్యార్థులు నిరసనాగ్రహం ప్రదర్శించారు. డిచ్పల్లిలోని తెయూ బాలుర వసతి గృహ ం ఎదుట విద్యార్థులు వీసీకి పిండ ప్రదానం చే సి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వారం రోజులుగా విద్యార్థులు చేస్తున్న నిరసనను పట్టించుకోకుండా వీసీ ఏకపక్షంగా సెమిస్టర్ పరీక్షలను నిర్వహించడం తగదన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. డిచ్పల్లిలోని వర్సిటీ మెయిన్ క్యాంపస్, భిక్కనూరులోని సౌత్ క్యాంపస్‌తో పాటు వర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో కనీసం 3 శాతం విద్యార్థులు కూడా పరీక్షలు రాయడం లేదన్నారు. మెజార్టీ విద్యార్థులు పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నా, వీసీ తన మొండి వైఖరికి పోవడం తగదన్నారు. వెంటనే పరీక్షల రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డిలో చెట్టుకు ఉరి కామారెడ్డి : పీజీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని టీజీవీపి ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు తెయూ వీసీ అక్బర్ అలీఖాన్ దిష్టిబొమ్మను చెట్టుకు ఉరితీశారు. అనంతరం కళాశాల ఎదుట దహనం చేశారు. కార్యక్రమంలో టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు నవీన్, నాయకులు లక్ష్మణ్, వేణు, కిరణ్, తిరుపతి, హజాం, విద్యార్థులు పాల్గొన్నారు. సౌత్ క్యాంపస్‌లో పరీక్షల బహిష్కరణ భిక్కనూరు : తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌క్యాంపస్‌లో పీజీ ద్వితీయ సంవత్సరం సెమిస్టర్ పరీక్షలను గురువారం విద్యార్థులు బహిష్కరించారు. పరీక్షలకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ సుధాకర్‌గౌడ్ విద్యార్థులను కోరగా, విద్యార్థులు నిరాకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ఈ నెలలో నెట్ పరీక్షలు ఉన్నందునే సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని వీసీని కోరినా పట్టించుకోవడం లేదని. గత్యంతరం లేక పరీక్షలను బహిష్కరిస్తున్నామని చెప్పారు. పరీక్షలను తిరిగి పది రోజుల తర్వాత నిర్వహించేందుకు రీ నోటిఫికేషన్ వేయాలని విద్యార్థులు కోరారు. దీంతో ప్రిన్సిపాల్ సుధాకర్‌గౌడ్ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తానని విదార్థులకు తెలిపారు.