సిరికొండ, న్యూస్‌లైన్ :
తెలంగాణ యూనివర్సి టీలో సెమిస్టర్ పరీక్షల విషయం లో కొంత మంది విద్యార్థులు కొద్ది రోజులుగా చేస్తున్న ప్రకటనలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని వీసీ అక్బర్ అలీ ఖాన్ అన్నారు. విద్యార్థులు చేస్తున్న వివాదం యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చాలా మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నా కొంత మంది విద్యార్థులు వారిని అడ్డుకోవడం బాధాకరమన్నారు. సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. గతంలో డిసెంబర్ 3 నుంచి నిర్వహించాల్సిన పరీక్షలను 9వ తేదీకి వాయిదా వేసిన విషయాన్ని గుర్తు చేశారు. పరీక్షలకు సన్నద్ధం కావడానికి కావాల్సిన సమయం ఇచ్చామని తెలిపారు. ఇది వరకే ఒకసారి వాయిదా వేసిన పరీక్షలను మరో మారు వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేశారు. ఎందరో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే తాను ఆ నిర్ణయం తీసుకున్నానని,విద్యార్థులు సంయమనంతో వ్యవహరించాలని కోరారు. ఇప్పటి వరకు పరీక్షలు రాయని వారు ఇక మీదట పరీక్షలకు హాజరైతే, ఇది వరకు రాయని పరీక్షలను తిరిగి నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ విద్యార్థుల నుంచి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు.
విద్యార్థుల అర్ధ నగ్న ప్రదర్శన
సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు సోమవారం మరో మారు ఆందోళనకు దిగారు. పరీక్షలు వాయిదా వేయడంలో వీసీ అక్బర్ అలీ ఖాన్ తీరును నిరసిస్తూ విద్యార్థులు అర్ధ నగ్న ప్రదర్శన చేపట్టారు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీసీ ఒంటెత్తు పోకడలను వారు తీవ్రంగా ఖండించారు.
పరీక్ష ఫీజు గడువు పెంపు
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని 2013-14 సంవత్సరానికి డిగ్రీ అన్ని విభాగాల పరీక్షల ఫీజు గడువును పొడగించినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ నసీం తెలిపారు. బీఏ,బీకాం,బీఎస్సీ కోర్సుల మొదటి,ద్వితీయ,తృతీయ సంవత్సరాల పరీక్షల ఫీజులను ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 20వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. వంద రూపాయల ఆలస్య రుసుంతో ఈ నెల 24 వరకు చెల్లించవచ్చని తెలిపారు.
సెమిస్టర్ పరీక్షలకు 162 మంది హాజరు
తెయూ పరిధిలోని నాలుగు పరీక్ష కేంద్రాల్లో సెమిస్టర్ పరీక్షలకు సోమవారం 162 మంది హాజరయ్యారని రిజిస్ట్రార్ ఆర్.లింబాద్రి తెలిపారు. తెయూ క్యాంపస్‌లో 34 మంది,గిరిరాజ్‌లో 20,ఆర్మూర్‌లో 107 మంది,బోధన్‌లో ఒకరు పరీక్షలకు హాజరైనట్లు పేర్కొన్నారు. తెయూలో పరీక్షలకు ఇబ్బందులు తలెత్తకుం డా డిచ్‌పల్లి పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న విద్యార్థులు
Published Tue, Dec 17 2013 4:39 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 AM
Advertisement