ఖమ్మం, న్యూస్‌లైన్:
తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల కల ఫలించిన వేళ...నాలుగున్నర కోట్ల గొంతులు ఒక్కటైన వేళ...రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదంతో జిల్లాలో సంబరాలు మిన్నంటాయి. లోక్‌సభలో ఆమోదం అనంతరం గురువారం రాజ్యసభలోనూ బిల్లు పాస్ అవడంతో జిల్లా ప్రజలు ధూంధాం చేశారు. లోక్‌సభలో బిల్లు ఆమోదం తర్వాత రాజ్యసభలోనూ ఆమోదం పొందుతుందనే విశ్వాసం ఉన్నప్పటికీ రెండురోజులుగా పెద్దలసభలో చోటుచేసుకున్న పరిణామాలు కొంత ఉత్కంఠ రేపాయి. చివరకు గురువారం రాత్రి రాజ్యసభలోనూ బిల్లు నెగ్గుకురావడంతో ఇక ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. జిల్లాలోని వివిధ రాజకీయ పక్షాలు, తెలంగాణవాదులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి. కేక్‌లు, స్వీట్లు పంచుకున్నారు. టపాసులు పేల్చారు. సహచరులకు ఫోన్‌ల ద్వారా మెసేజ్‌లు పంపించి ఆనందం పంచుకున్నారు. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి చిందులేశారు. ఊరూవాడ ఏకమై తెలంగాణ వేడుకలు చేసుకుని, రంగులు పూసుకున్నారు. ఒకరినొకరు అలాయ్‌బలాయ్ చేసుకున్నారు. యువకులు ద్విచక్రవాహనాలతో ర్యాలీలు నిర్వహించి కేరింతలు కొట్టారు. తెలంగాణ నినాదాలతో జిల్లా మార్మోగింది. ఖమ్మం మయూరిసెంటర్, జడ్పీ సెంటర్, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, తెలంగాణ తల్లి విగ్రహం, ఇల్లెందు క్రాస్‌రోడ్డు కూడళ్లలో బాణసంచా పేల్చి హర్షాతిరేకాలను వెలిబుచ్చారు.
టీఆర్‌ఎస్ కొవ్వొత్తుల ర్యాలీ
ప్రత్యేక రాష్ట్రం కల సాకారమవడంతో గురువారం రాత్రి తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఖమ్మంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి బయలుదేరిన టీఆర్‌ఎస్ నాయకులు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాన్ని చేతిలో పట్టుకుని ప్రధాన కూడళ్ల వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. అమరుల త్యాగాల ఫలమే తెలంగాణ రాష్ట్రమని పేర్కొన్నారు. తెలంగాణ అమరులకు నివాళులు అర్పిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్బారావు, నరేష్, భిక్షం, రయీస్ అన్వర్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
అమరుల త్యాగాలు నెమరువేసుకుంటూ...
పోరాటాల ఖిల్లా... ఖమ్మంజిల్లాలో తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలోని ప్రధాన ఘట్టాలను జిల్లా ప్రజలు నెమరువేసుకున్నారు. తెలంగాణ తొలి అమరవీరులు ప్రకాష్‌జైన్, అన్నాబత్తుల రవీంద్రనాథ్ ఆకాంక్ష నెరవేరిందని కొనియాడారు. సకల జనుల సమ్మెలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఫ్లెక్సీలు, కటౌట్‌లను ఏర్పాటు చేశారు.
ఖమ్మంలో టీ జోష్...
Published Fri, Feb 21 2014 4:38 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM
Advertisement