‘సాక్షి’ సీనియర్ జర్నలిస్టు సరస్వతి రమకు విశిష్ట మహిళా పురస్కారాన్ని అందజేస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్
సాక్షి, నెట్‌వర్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల్లో పలు కార్యక్రమాలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో స్థానిక మండల ప్రజా పరిషత్, ఉప్పల చారిటబుల్ ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో అమ్మ పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. సృష్టిలో అమ్మను మించిన దైవం లేదని వక్తలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో పలు ప్రాంతాల్లో ఆయా రంగాల్లో విశేష సేవలందించిన మహిళలను సన్మానించారు. దేవరకొండలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. కోదాడలో గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. మహబూబ్‌నగర్ ప్రధాన స్టేడియంలో జరిగిన వేడుకల్లో పలువురు మహిళలను స్ఫూర్తి పురస్కారాలతో సత్కరించారు.
ఖమ్మం టీఆర్‌ఎస్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులు, కార్మికులను సన్మానించారు. హనుమకొండ అంబేద్కర్ భవన్‌లో అంగన్వాడీ కార్యకర్తల నృత్యాలు అలరించాయి. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మహిళా పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగారు. సిరిసిల్లలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞత తెలుపుతూ సాగిన కార్యక్రమంలో 2 వేల మంది మహిళలు ఓ మహిళా చిత్రం రూపంలో నిలబడగా అద్భుత దృశ్యం ఆవిష్క్రతమైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
హనుమకొండలో నృత్యం చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు
రంగారెడ్డి జిల్లా పడకల్‌లో అమ్మ పాదపూజకు హాజరైన మహిళలు
హైదరాబాద్‌లోని విద్య కమిషనరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న మహిళా టీచర్లు
నిర్మల్‌లోని కార్యక్రమంలో కూర్చున్న మహిళలు
చిరంజీవి బ్లడ్ బ్యాంకులో జరిగిన వేడుకల్లో పాల్గొన్న చిరంజీవి, సురేఖ దంపతులు
నిర్మల్‌లో అవమానం...
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా ఉద్యోగులకు అవమానం జరిగింది. వేడుకలు జరుగుతున్న సమావేశ మందిరంలో మహిళా ఉద్యోగులు, అంగన్‌వాడీ టీచర్లకు కనీసం కుర్చీలు వేయలేదు. పైగా వేదికపై మొత్తం పురుషులే కూర్చున్నారు. దీంతో మహిళా ఉద్యోగులు, సిబ్బందిలో కొందరు నిల్చోగా.. మరికొందరు నేలపై కూర్చున్నారు.
గర్భిణుల కోసం త్వరలో కొత్త పథకం
గన్‌ఫౌండ్రీ: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం మహిళల సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ కిట్ తరహాలో గర్భీణీ స్త్రీల కోసం త్వరలో ఓ కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు.
అనంతరం ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ ఆర్.లక్ష్మీరెడ్డి, ఐపీఎస్ అధికారి సుమతి, ‘సాక్షి’సీనియర్ జర్నలిస్టు సరస్వతి రమ, జానపద గాయని కనకవ్వలతో పాటు వివిధ రంగాలలో రాణిస్తున్న 40 మంది మహిళలకు విశిష్ట మహిళా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునితా లక్ష్మారెడ్డి, మహిళా కార్పొరేషన్ ఛైర్మన్ ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు.
నా బలం సురేఖనే: చిరంజీవి
బంజారాహిల్స్: ‘నేను సినిమాలపై పూర్తి దృష్టిపెడితే ఆమె అన్నీ చూసుకునేది. నేను ఇంతవాన్ని కావడానికి కారణం, నా బలం ఆమే’ అని భార్య సురేఖను మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంకులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్‌లకు చెందిన మహిళా కార్మికులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ధైర్యంగా ఫిర్యాదు చేయాలి..
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర మహిళా భద్రతా విభాగం తమ రీడిజైన్డ్ వెబ్‌సైట్ అత్యా«ధునిక హంగులతో అందుబాటులోకి తీసుకొచ్చింది. మంగళవారం వెబ్‌సైట్‌ను మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా, డీఐజీ బి.సుమతి ఆవిష్కరించారు. బాధితులు ధైర్యంగా ఫిర్యాదుచేయాలని.. తమ వెబ్‌సైట్ https:// womensafetywing. telangana. gov. in సంప్రదించగలరని సూచించారు.
317 జీవోపై మహిళా టీచర్ల ఆందోళన..
మహిళాదినోత్సవం రోజున మహిళాటీచర్లు పాఠశాల విద్య కమిషనరేట్ ఎదుట గంటల తరబడి బైఠాయించారు. 13 జిల్లాలకు చెందిన మహిళాటీచర్లు, వారి భర్తలు, పిల్లలుసహా తరలి వచ్చి మంగళవారం ఆందోళనకు పూనుకున్నారు. 317 జీవో కారణంగా తాము పడుతున్న ఇబ్బందుల గురించి అధికారులకు విన్నవించేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు : కవిత
మహిళా దినోత్సవాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తం గా ఉన్న ఆడబిడ్డలందరికీ ఆమె మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియ జేశారు. తన నివాసంలో మంగళవారం జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో అంగన్‌వాడీ ఉద్యోగులతో కలిసి కవిత కేక్ కట్ చేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని కేక్ కట్ చేస్తున్న న్యాయమూర్తులు జస్టిస్ జి.శ్రీదేవి, జస్టిస్ పి.శ్రీసుధ, జస్టిస్ సి.సుమలత, జస్టిస్ జి.రాధాదేవి, జస్టిస్ పి.మాధవీ దేవి తదితరులు.
Comments
Please login to add a commentAdd a comment