టీవీ నటుడి భార్య ఆత్మహత్య!
సాక్షి, హైదరాబాద్: అదనపు కట్నం తేవాలంటూ ఓ టీవీ నటుడు తీవ్రంగా వేధిస్తుండడంతో తట్టుకోలేని భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. అయితే తమ కుమార్తెను అల్లుడే హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడంటూ యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కొండాపూర్ చౌరస్తాలో ఉంటున్న సలదాగు బాలాజీ అనే వ్యక్తి తన కుమార్తె జీవిత(24)ను టీవీ ఆర్టిస్టు బొడ్డు ప్రభాకర్‌కిచ్చి 2011, అక్టోబర్ 9న వివాహం జరిపించారు. ఆ సందర్భంగా 14 తులాల బంగారం, 70 వేల నగదు కట్నంగా ఇచ్చారు. ప్రభాకర్ దంపతులు యూసుఫ్‌గూడ సమీపంలోని వెంకటగిరిలో నివసిస్తున్నారు.
పెళ్లయిన మూడునెలల నుంచే ప్రభాకర్ అదనపు కట్నంకోసం భార్యను వేధించసాగాడు. పీకలదాకా మద్యం సేవించి.. ఇంటికొచ్చి భార్యపై చేయి చేసుకునేవాడు. వేధింపులు తట్టుకోలేక బాధితురాలు పలుమార్లు విషయాన్ని పుట్టింటివారికి తెలిపింది. వారు నచ్చజెప్పి పంపించేవారు. అయితే రెండునెలలుగా వేధింపులు తీవ్రమయ్యాయి. టీవీ సీరియల్స్ నిర్మించాలి.. డబ్బులు తీసుకురా అంటూ కొట్టడం ప్రారంభించాడు. దీంతో తట్టుకోలేని జీవిత శుక్రవారం అర్ధరాత్రి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ప్రభాకర్ ఆమెను అపోలో ఆస్పత్రికి తరలించి.. అక్కడినుంచే భార్య తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. కాగా తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అల్లుడే హత్య చేశాడంటూ బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడ్ని అరెస్ట్ చేసినట్టు జూబ్లీహిల్స్ ఎస్‌ఐ రామన్ తెలిపారు. కాగా, జీవిత దంపతులకు ఏడాదిన్నర వయస్సున్న కూతురుంది.