వాస్తవాలు చెప్పండి
సత్ఫలితాలు సాధిద్దాం
ప్రజావాణిలో మార్పులు చేస్తా
జిల్లాను స్మార్ట్‌గా మారుద్దాం
బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ బాబు.ఎ
మచిలీపట్నం : అధికారులు వాస్తవ పరిస్థితులు చెబితే దానికి అనుగుణంగా చర్యలు తీసుకుని ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని, సత్ఫలితాలు సాధించవచ్చని నూతన కలెక్టర్ బాబు.ఎ అన్నారు. జిల్లా కలెక్టర్‌గా బాబు.ఎ సోమవారం 10.45 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆర్ అండ్ బీ అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు డీఆర్వో ప్రభావతి, బందరు ఆర్డీవో సాయిబాబు, తహశీల్దార్ నారదముని, కలెక్టరేట్ ఏవో సీతారామయ్య స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నేరుగా కలెక్టర్ చాంబర్‌లోకి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ను జిల్లా అధికారులు మర్యాదపూ ర్వకంగా కలిశారు. చాంబర్ నుంచి బయలుదేరిన కలెక్టర్ తొలుత ప్రజావాణి జరిగే కలెక్టరేట్‌లోని సమావేశపు హాలుకు చేరుకున్నారు. అక్కడ అధికారులు ఎవ్వరూ లేకపోవటంతో ప్రజావాణి అర్జీలు స్వీకరించే విభాగం వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితులను సమీక్షించారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం ప్రజావాణికి ప్రజావాణి జరిగే సమావేశపు హాలుకు వచ్చిన కలెక్టర్ బాబు.ఎ జిల్లాకు చెందిన అధికారులను ఒక్కక్కరినీ పరిచయం చేసుకున్నారు. వారి పేరు, హోదా, కార్యాలయం ఎక్కడ ఉంది.. తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు వస్తున్నారని, ఇకనుంచి మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లోనూ సమర్థంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. మండల కేంద్రాలు, మున్సిపాల్టీల్లో ప్రజావాణి నిర్వహించేలా ప్రత్యేక ఉత్తర్వుల జారీచేయాలని డీఆర్వో ఎ.ప్రభావతిని ఆదేశించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రజావాణిలో కొద్దిపాటి మార్పులు చేయనున్నట్లు ప్రకటించారు. కలెక్టరేట్‌లోనే ఆయా విభాగాలకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేస్తామని సంబంధిత అధికారి పేరును తెలుగులోనే ఈ కౌంటర్‌లో ఉంచుతామని, అర్జీలు ప్రజలు అక్కడే ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అర్జీల పరిష్కారం విషయంలో ఒక ప్రొఫార్మాను తయారుచేశానని, ఆ ప్రొఫార్మాలో ప్రతి శాఖ జిల్లా అధికారులు తమ పరిధిలోని అర్జీల పరిష్కారం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. ఇక్కడ దరఖాస్తులు ఇచ్చిన అనంతరం సమస్య పరిష్కారం కాకపోతే నేరుగా తనకు దరఖాస్తులు ఇచ్చేలా చర్యలు చేపడతామని కలెక్టర్ వివరించారు. ప్రజావాణికి కొన్ని శాఖల వారు సిబ్బందిని పంపి చేతులు దులిపేసుకుంటున్నారని, ఈ పద్ధతిని విడనాడాలని హెచ్చరించారు. బాధ్యత గల అధికారులను ప్రజావాణికి పంపి ప్రజాసమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని చెప్పారు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి ముందు అధికారుల హాజరుపట్టీ పరిశీలిస్తానని, గత ప్రజావాణిలో వచ్చిన అర్జీలు, వాటిలో పరిష్కారమైన సమస్యలు, మిగిలిన వాటిపై సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. ఏదైనా కార్యాలయం పనిచేయాలంటే అక్కడ పనిచేసే సిబ్బందికి సత్ప్రవర్తన, సింప్లిసిటీ, టూల్స్ అవసరమని, వీటన్నింటిని సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
స్మార్ట్ జిల్లాగా రూపొందిద్దాం : కృష్ణాజిల్లా రాజధాని జిల్లాగా పిలువబడుతోందన్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలను సత్వరమే పాటిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని చెప్పారు. స్మార్ట్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా పనిచేద్దామని ఆయన అధికారులను కోరారు. పరిపాలనాపరంగా ఇబ్బందులుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
కృష్ణా టీమ్ సమర్థంగా పనిచేస్తోందనే పేరు తెచ్చుకోవాలని అధికారులతో అన్నారు. తాను కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించే ముందు ముఖ్యమంత్రిని కలిశానని, ఆయన సూచనల మేరకు జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు అందరం కృషిచేద్దామని చెప్పారు.