
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఘనవిజయం సాధించి శనివారం నాటికి ఏడాది పూర్తవుతుందని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి గుర్తు చేశారు. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఏడాదిలోనే సీఎం జగన్ ఇచ్చిన హామీలలో 90 శాతం అమలు చేశారని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలకు సీఎం జగన్ తండ్రిలా సేవ చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మంచి నాయకుడు దొరికాడని, జగన్‌పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని కితాబిచ్చారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జగన్ పాలన చూసి పొగుడుతున్నారన్నారు. పార్టీలకు అతీతంగా జగన్ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. ('సొంత పార్టీకి చెందినవాడే దొంగదీక్ష అన్నాడు')
ఇంకా ఆమె మాట్లాడుతూ... రాష్ట్రానికి చంద్రబాబు సేవలు అవసరం లేదని, చంద్రబాబును ప్రజలు ఎప్పుడో మర్చిపోయారన్నారు. చంద్రబాబు, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 25ఏళ్లు గడిచాయన్నారు. చంద్రబాబు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని, ఆయనకు వయసు పెరిగిన బుద్ది పెరగలేదన్నారు. చంద్రబాబు తన పాలనలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదని, ఆయన జూమ్ నాయుడుగా మారిపోయాడన్నారు. చంద్రబాబు రాజకీయానికి రంగనాయకమ్మ, డాక్టర్ సుధాకర్ బలయ్యారన్నారు. డాక్టర్ సుధాకర్ టీడీపీ సానుభూతి పరుడని, టీడీపీ ఎమ్మెల్యే సీటు కోసమే ఉద్యోగానికి రాజీనామా చేశారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. రంగనాయకమ్మ టీడీపీ సానభూతి పరురాలని, టీడీపీకి అనుకూలంగా సోషల్‌మీడియాలో ఆమె ప్రచారం చేస్తున్నారన్నారు. టీడీపీ సానుభూతి పరురాలని పట్టుకొని ఎల్లోమీడియా సామాజిక కార్యకర్తని చేసిందని దుయ్యబట్టారు. 66 యేళ్ల మహిళపై కేసు పెట్టారంటూ గగ్గోలు పెట్టారని, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెట్టరా? అని ప్రశ్నించారు. 60 యేళ్ల మహిళ అయిన తనపై టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేశారని, ఎన్టీఆర్ భార్యగా తనని ఘోరంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. కోటి అనే వ్యక్తికి 25 లక్షలు ఇచ్చి తనపై టీవీ5 ఛానెల్‌లో డిబేట్ పెట్టినప్పుడు మహిళ సంఘాల నేతలు ఏమయ్యాని ప్రశ్నించారు. అప్పుడు ఎవరు నోరు మెదపలేదని, ఇప్పుడు మాత్రం టీడీపీ నేతలు కుక్కల్లాగా మొరుగుతున్నారన్నారు. 70 యేళ్ల వయసులో చంద్రబాబు రాజకీయాలు మానుకొని రామా-కృష్ణా అంటూ రామాయణం, భారతం చదువుకోవాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment