నార్వే నుంచి పిల్లల చెంతకు..
హైదరాబాద్ చేరుకున్న చంద్రశేఖర్ దంపతులు
సాక్షి, హైదరాబాద్: నార్వే కఠిన చట్టాల కారణంగా జైలుపాలైన తెలుగు దంపతులు వల్లభనేని చంద్రశేఖర్, అనుపమ తిరిగి హైదరాబాద్ వచ్చారు. కన్నబిడ్డను మందలించిన కేసులో ఏడాదికిపైగా శిక్ష అనుభవించిన వీరు ఇటీవల మియాపూర్‌లోని తమ ఇద్దరు పిల్లల చెంతకు చేరుకుని సంతోషంగా ఉన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చంద్రశేఖర్ మూడేళ్ల కిందట భార్య, ఇద్దరు కొడుకులు సాయిశ్రీరామ్(7), అభినవ్(3)లతో నార్వే వెళ్లారు. సాయిశ్రీరామ్ స్కూల్లో అల్లరి చేస్తున్నాడని, ఓసారి నిక్కర్ తడిపేసుకున్నాడని టీచర్లు ఫిర్యాదు చేయడంతో చంద్రశేఖర్ దంపతులు అతణ్ని మందలించి ‘తిరిగి ఇండియాకు పంపేస్తామ’ని బెదిరించారు.
శ్రీరామ్ ఈ సంగతి స్కూల్లో చెప్పడంతో పోలీసులు గత ఏడాది నవంబర్‌లో వారిని అరెస్టు చేశారు. నార్వే చట్టాల ప్రకారం పిల్లలను కొట్టడం, తిట్టడం, బె దిరించడం నేరం కనుక గత ఏడాది డిసెంబర్‌లో ఓస్లో కోర్టు చంద్రశేఖర్‌కు 18 నెలలు, అనుపమకు 15 నెలల శిక్ష జైలు శిక్ష వేసింది. దీనిపై వారు న్యాయపోరాటం చేసినా ఫలితం లేకపోయింది. అయితే కోర్టు చంద్రశేఖర్ శిక్షను ఏడాదికి, అనుపమ శిక్షను 11 నెలలకు తగ్గించింది. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ 22న విడుదలైన అనుపమ అదే నెల హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నెల 2న విడుదలైన చంద్రశేఖర్ 4న వచ్చారు. సాయిశ్రీరామ్, అభినవ్‌లు ఏడాదిగా మియాపూర్‌లోని నానమ్మ, తాతల వద్ద ఉంటున్నారు. చంద్రశేఖర్ దంపతులకు పడ్డ శిక్షను వ్యతిరేకిస్తూ తాము చేపట్టిన పోరాటానికి సాక్షి దినపత్రిక, టీవీ చానల్ మద్దతునిచ్చాయని, అందుకు కృతజ్ఞతలు చెబుతున్నామని చంద్రశేఖర్ బంధువు శైలేంద్ర చెప్పారు.