సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా శిరీష పేరు దాదాపు ఖరారైపోయింది. ఈ నెల 21న పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రకటించడం కేవలం లాంఛనమేనని తెలుస్తోంది. పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీకి కుమార్తె అయిన ఆమె ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఆమె జిల్లాకు రానున్నారు. గురువారం హైదరాబాద్‌లో సీఎంను కలిసి ఆయన ఆశీస్సులు పొందిన తరువాత జిల్లాకు చేరుకోనున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో తొలిసారి ఓ మహిళకు పార్టీ అధ్యక్షురాలిగా అవకాశం దక్కడం విశేషం. స్వాతంత్య్రసమరయోధుడు గౌతు లచ్చన్నకు మనుమరాలిగా, మొన్నటి ఎన్నికల్లో తండ్రి శివాజీ గెలుపునకు నియోజకవర్గం మొత్తం తిరిగిన వ్యక్తిగా ఆమెకు పేరుంది. జిల్లాలోని మంత్రి, ఎమ్మెల్యేలు సహా రాష్ట్ర పరిశీలకులు, ఇన్‌చార్జి మంత్రి పరిటాల సునీత, పార్టీ అధిష్టానం పంపించిన కీలక నేతలు, విప్, కళా వెంకట్రావు అందరూ ఏకగ్రీవంగా శిరీష పేరును ఖరారు చేయడం, ఇదే విషయాన్ని సీఎంకు తెలియజేయడం తెలిసిందే.
నెగ్గుకొస్తారా?
జిల్లా పార్టీలో కుమ్ములాటలు, వర్గపోరు ఎక్కువగానే ఉంది. పదేళ్ల తరువాత పార్టీ అధికారంలోకి వచ్చినా తమకేమీ ఒరిగేది లేదని, అధికారులు నేతల చెప్పుచేతల్లో ఉంటున్నా కొంతమందికే లబ్ధికలుగుతోందని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితి కొనసాగుతోంది. నర్శింగ్ కళాశాల ఏర్పాటువిషయమై విప్, మంత్రి మధ్య సయోధ్య లేకపోవడం, రాజాంలో మాజీ స్పీకర్ ప్రతిభాభారతి, సీనియర్‌నేత కళావెంకటరావుల మధ్య వర్గపోరువల్ల కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. టెక్కలి నియోజకవర్గానికే మంత్రి అచ్చెన్న పరిమితమైపోయారనీ, ఎంపీ స్థానికంగా అందుబాట్లో ఉండలేకపోతున్నారని దేశం తమ్ముళ్లు శని, ఆదివారాల్లో జరిగిన కార్యక్రమాల్లో గగ్గోలు పెట్టారు. ఈ నేపథ్యంలో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న శిరీష ఎలా నెగ్గుకొస్తారన్నది వేచిచూడాలి. ఈమె వెనుక తండ్రి శివాజీ మార్కు రాజకీయం నడుస్తుందా అన్నది కూడా పార్టీలో చర్చజరుగుతోంది.
రోజుకోపేరుతో సర్వేపై విమర్శలు
శ్రీకాకుళం : ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలో అధ్యక్ష పదవికోసం చర్చలు జరిగి... కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్న ఇన్‌చార్జి మంత్రి పరిటాల సునీత జిల్లా అధ్యక్షుని పేరును ముఖ్యమంత్రి ప్రకటిస్తారని చెప్పి వెళ్లిపోయిన తరువాత పార్టీ అధిష్టానం ఐవీఆర్‌ఎస్ విధానం ద్వారా సర్వేను సోమవారం కూడా కొనసాగించడాన్ని కేడర్ తప్పుపడుతోంది. మూడు రోజుల క్రితం గౌతు శ్యామసుందరశివాజీ, చౌదరి నారాయణమూర్తి, కలిశెట్టి అప్పలనాయుడుల పేర్లతో సర్వే జరిపారని, ఆదివారం ఓ పక్క ఎన్నిక ప్రక్రియ జరుగుతుండగా గౌతు శివాజీ, చౌదరి బాబ్జితో పాటు బగ్గు రమణమూర్తిలలో ఎవరికి అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందని కార్యకర్తల నుంచి సమాచారాన్ని సేకరించారని పలువురు నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు.
ఈ పేర్లలో దేనినీ కాకుండా గౌతు శిరీషను ఎంపిక చేసినట్టు పరోక్షంగా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా టీడీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో శిరీష పేరును ప్రకటిస్తారని భావించగా సోమవారం సర్వేను కొనసాగిస్తూ గౌతు శిరీష, చౌదరి బాబ్జీలలో ఎవరికిస్తే సమంజసంగా ఉంటుందని అడగడం పట్ల టీడీపీ కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. జిల్లా మంత్రి, ప్రభుత్వ విప్‌తో పాటు పార్లమెంట్ సభ్యుడు, జెడ్పీ చైర్మన్, ఐదుగురు శాసనసభ్యులు, మున్సిపల్ చైర్మన్లు నుంచి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఇద్దరు రాష్ట్ర పార్టీ పరిశీలకులు అభిప్రాయాలను సేకరించి ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసిన తరువాత సర్వే కొనసాగిస్తుండడం ఎవరిపై నమ్మకం లేకపోవడానికి కారణమని అధిష్టానాన్ని నిలదీస్తున్నారు.
శిరీషకే జిల్లా దేశం కిరీటం !
Published Tue, May 19 2015 3:20 AM | Last Updated on Mon, Aug 13 2018 3:58 PM
Advertisement
Advertisement