సాక్షి, ఒంగోలు: పార్టీ అధికారంలోకొచ్చిన సంతోషం కన్నా జిల్లాలో సగానికి సగం సీట్లు కోల్పోయామనే బాధ తెలుగుదేశం పార్టీలో నెలకొంది. పార్టీ అధికారంలోకి రాకున్నా.. మొదటి ప్రయత్నమే సగం సీట్లు కైవసం చేసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ దుమ్ము దులిపింది. ఇక్కడ గెలిచిన వారికీ.. ఓడిన వారికీ ఒకే నిరాశ మిగిలింది. ఓట్ల లెక్కింపునకు కొన్ని క్షణాల ముందు వరకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అధికారంలోకి వ స్తోందని కలలు కన్న నేతల ఆశలపై జిల్లా ఓటర్లు నీళ్లు చల్లారు. వైఎస్సార్ సీపీ నుంచి ఆరుగురు అభ్యర్థులు గెలుపొందగా, టీడీపీ నుంచి ఐదుగురు విజయం సాధించారు.
అధికారంలోకి వచ్చేది టీడీపీ కూటమి అంటూ కౌంటింగ్‌నకు నాలుగురోజుల ముందుగానే కొన్ని చానెళ్ల సర్వేలు, ఇతర ఏజెన్సీ సర్వేసంస్థల అంచనాలతో ..జిల్లా టీడీపీ నేతలు తామంతా గెలుస్తామని భావించారు. తీరా పరిస్థితి తిరగబడటంతో వారంతా దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలదీ అదే పరిస్థితిగా చెప్పవచ్చు.
అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేసిన కరణం వెంకటేష్ ఓట్లలెక్కింపునకు ముందు తమ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు తాను వ్యక్తిగతంగా సర్వే చేయించుకున్నానని.. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని.. సీమాంధ్రలో టీడీపీ రూలింగ్ అంటూ చెప్పుకు న్నారు. పరిపాలనాపగ్గాలు చంద్రబాబుకు దక్కినా.. కరణం వెంకటేష్ మాత్రం ఓటమిచెందారు.
తన గెలుపుతో పాటు పార్టీ అధికారంలోకొస్తుందని.. రిజర్వుడు కేటగిరీలో మంత్రిపదవి కూడా దక్కుతుందని సంతనూతలపాడు టీడీపీ అభ్యర్థి బీఎన్ విజయ్‌కుమార్ కేడర్‌లో విస్తృత ప్రచారం చేసుకున్నారు. అయితే, టీడీపీ అధికారంలోకొచ్చినా.. ఆయన మాత్రం ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు.
ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసారి తనతోపాటు సమీప బంధువు వైవీ సుబ్బారెడ్డిని లోక్‌సభ అభ్యర్థిగా గెలిపించడం ఖాయమని పార్టీ అధిష్టానం వద్ద గట్టిగా హామీనిచ్చారు. అయితే, ఎంపీగా వైవీ సుబ్బారెడ్డి గెలిచినా.. ఈసారి బాలినేనికి చుక్కెదురైంది.
మొదటి సారి గెలిచిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆనందంగా ఉండగా.. మార్కాపురం సిట్టింగ్ స్థానం కోల్పోయి కందుల నారాయణరెడ్డి, వై.పాలెం నుంచి అజితారావు ఎన్నికల్లో భారీగా డబ్బుఖర్చు పెట్టి చేతులు కాల్చుకున్నారు.
టీడీపీ అధికారంలోకొస్తే.. తనకు మంత్రి పదవి గ్యారెంటీ అని ముందే చెప్పుకున్న అన్నా రాంబాబుకు గిద్దలూరు నియోజకవర్గ ఓటర్లు ఇచ్చిన ప్రతికూల తీర్పుతో కేడర్ కోలుకోలేదు.
సంతనూతలపాడులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ గెలుపునకు కృషిచేసిన బాపట్ల ఎంపీ అభ్యర్థి డాక్టర్ అమృతపాణి, దర్శి అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి ఇద్దరికీ ఓటమి ఎదురైంది.
ఆదిమూలపు సురేష్‌కు గెలిచాననే ఆనందం మిగిలినా.. పార్టీ అధికారం కోల్పోవడం నిరాశ మిగిల్చింది.
కేడర్ సంగతి తర్వాత అంటూ...
ఊహించని సార్వత్రిక ఫలితాలతో టీడీపీ, వైఎస్సార్ సీపీ కేడర్ కంగుతింది. దీంతో ఎవరికి వారు అంతర్గత సమావేశాలతో ఓట్ల పోలింగ్‌పై కసరత్తు చేస్తూ.. లోపాలపై అంతర్మథనం చెందుతున్నారు. ఈక్రమంలో కేడర్‌లో మరలా కొత్తరక్తాన్ని ఎక్కించి ప్రధాన ప్రతిపక్షంగా ఉద్యమ చైతన్యంతో ముందుకెళ్లాలనే ఆలోచనలో వైఎస్సార్ కాంగ్రెస్ ఉంది. టీడీపీ మాత్రం ఇందుకు భిన్నంగా నడుస్తోంది. డీలాపడ్డ కేడర్ సంగతి తర్వాత చూస్తామంటూ.. ముందు జిల్లాలో ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయా..? అనే కసరత్తులో ఉంది.
టీడీపీ తరఫున పోటీచేసి గెలిచిన ఎమ్మెల్యేల్లో జిల్లా నుంచి పలువురు చంద్రబాబు కేబినెట్‌లో అవకాశం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వీరిలో దర్శి ఎమ్మెల్యే శిద్దా రాఘవరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఉన్నారు. సామాజికవర్గ సమీకరణల్లో కేబినెట్‌లో తనకు గానీ అవకాశం దక్కకుంటే, తన తరఫున కొండపి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన డోలా బాలవీరాంజనేయస్వామికి మంత్రిపదవి ఇవ్వాలని దామచర్ల పావులు కదుపుతున్నారు. కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావుకు ప్రస్తుతం హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణ ఆశీస్సులు మెండుగా ఉన్నందున .. అతనూ అమాత్య రేసులో ముందున్నట్టు తెలిసింది.
టీడీపీ కేడర్‌లో అంతర్మథనం
Published Mon, May 19 2014 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 7:31 AM
Advertisement
Advertisement