జర్మనీలో తెలుగు విద్యార్థుల మృతి
జర్మనీలో తెలుగు విద్యార్థుల మృతి
Published Tue, Jul 11 2017 2:45 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
- బీచ్‌లో ఈత కొడుతుండగా ఇద్దరికి ప్రమాదం
- మృతులు ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లా వాసులు
నల్లజర్ల (పశ్చిమగోదావరి)/కొండపి: ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లిన ఇద్దరు ఆంధ్రా యువకులు ఆదివారం బీచ్‌లో ఈత కొడుతూ మునిగి చనిపోయారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అచ్చన్నపాలెం విద్యార్థి దండమూడి ఉదయ నాగమణిశంకర్ (22), ప్రకాశం జిల్లా కొండపి మండలం కట్టావారిపాలెంకు చెందిన మల్లికార్జున (21) ఈ ప్రమాదంలో మృతి చెందారు. తోటి స్నేహితులు నలుగురితో కలసి వీరిద్దరూ ఆదివారం సిల్బర్‌సీటూ హెల్టర్‌నామ్‌సీ ప్రాంతంలో బీచ్‌కు వెళ్లారు. అందులో ఇద్దరు ఒడ్డున స్నాక్స్ తింటుండగా మరో ఇద్దరు నీళ్లలోకి కొద్ది దూరం వెళ్లి భయంతో ఆగిపోయారు. నాగమణిశంకర్, కట్టా మల్లిఖార్జున మరికొంచెం లోపలకు వెళ్లి ఈత కొడుతుండగా అలల తాకిడికి మునిగిపోయినట్టు తోటి స్నేహితులు ఇక్కడి కి సమాచారం అందించారు.
ఒక్కగానొక్క కుమారుడు..
వెంటరత్నం, లక్ష్మీకుమారి దంపతుల కుమారుడు నాగమణిశంకర్ ఏప్రిల్ నెలాఖరులో ఎంఎస్ చదవడానికి జర్మనీ వెళ్లాడు. ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న ఒక్కగానొక్క కొడుకు ఇలా ప్రమాదంలో అసువులుబాయటంతో ఆ దంపతులు శోకసముద్రంలో మునిగిపోయారు. జర్మనీ వెళ్లినప్పటి నుంచి స్నేహంగా ఉంటున్న మల్లికార్జున, నాగమణిశంకర్ చావులోనూ వెన్నంటే ఉన్నారు.
Advertisement