
తెలుగు తమ్ముళ్ల అతి
- వైఎస్సార్ సీపీపై తప్పుడు ప్రచారంతో వివాదం
- అనకాపల్లి మండలం బీఆర్‌టీ కాలనీ కేంద్రంలో ఘటన
- బ్యాలెట్‌పై సిరా అంటుకోవడంతో దుమారం
- లాఠీచార్జి చేసిన పోలీసులు
- గాయపడిన పదేళ్లబాలుడు, వైఎస్సార్ సీపీ కార్యకర్త
అనకాపల్లి, న్యూస్‌లైన్ నెట్‌వర్క్ : అనకాపల్లి మండలం బీఆర్‌టీ కాలనీ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సందర్భంగా ఆదివారం వివాదం నెలకొంది. పోలింగ్ అధికారులు చేసిన తప్పిదం వల్ల బ్యాలెట్ పత్రంపై సిరా అంటుకోగా, ఇదే అదనుగా టీడీపీ కార్యకర్తలు తప్పుడు ప్రచారానికి దిగడంతో రాజకీయ పార్టీల మధ్య వివాదానికి కారణమై పోలీసుల లాఠీచార్జికి దారితీసింది. ఓటమి భయంతో ఊగిపోతున్న తెలుగు తమ్ముళ్లు చిన్న విషయంపైనా రాద్ధాంతం చేసేశారు.
చివరికి అసలు విషయం కాస్తా వెల్లడి కావడంతో బిక్కమొహం వేశారు. ఈలోగా జరగాల్సిన రాద్ధాంతం, పోలీసుల లాఠీచార్జి, జిల్లా ఎన్నికల పరిశీలకుడు రంగంలోకి దిగడం జరిగిపోయాయి. వివాదాస్పద బ్యాలెట్ పత్రాలను ప్రత్యేక ప్రాతిపదికన పరిశీలించాలని ఎన్నికల అధికారి నిర్ణయించడంతో వివాదం సద్దుమణిగింది. వివరాల్లోకి వెళితే...బీఆర్‌టీ కాలనీ పోలింగ్ కేంద్రంలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రశాంతంగా కొనసాగింది.
ఆ సమయంలో టీడీపీ కార్యకర్త ఒకరు ఓటు వేసేందుకు వెళ్లారు. అతనికి పోలింగ్ సిబ్బంది ఇచ్చిన బ్యాలెట్‌కు సిరా అంటుకోవడంతో సిబ్బందిని ప్రశ్నించాడు. పోలింగ్ స్టేషన్ నంబర్ ముద్ర వేసేటప్పుడు పొరపాటున సిరా అంటుకుందని సర్దిచెప్పి ఆ బుక్‌ను నిలిపివేసి మరో బుక్ నుంచి అతనికి బ్యాలెట్ ఇవ్వగా ఓటేసి వెళ్లిపోయాడు. బయటకు వచ్చిన అతను వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఓటింగ్ జరుగుతోందంటూ ప్రచారం చేయడంతో దానికి తెలుగు తమ్ముళ్లు గొంతుకలిపి గొందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు.
పోలింగ్ సిబ్బంది అనుకోకుండా చేసిన పొరపాటును తమకు అనుకూలంగా మలుచుకునే ఎత్తుగడ వేశారు. స్థానికులను రెచ్చగొట్టడంతో గొడవ ప్రారంభమైంది. టీడీపీ, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పోలింగ్ నిలిపివేయాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి లాఠీచార్జికి దిగారు. ఈ ఘటనలో పదేళ్ల బాలుడు కాండ్రేగుల బన్నీకి, వైఎస్సార్ సీపీ కార్యకర్త మొల్లేటి శ్రీనుకు లాఠీ దెబ్బలు తగిలాయి. దీంతో ఆగ్రహోదగ్రులైన గ్రామస్తులు, మహిళలు దెబ్బలు తిన్న బాలుడితో పాటు వచ్చి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈలోగా పాడేరు ఏఎస్పీ పకీరప్ప ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సమాచారం అందుకున్న జిల్లా ఎన్నికల పరిశీలకుడు టి.కృష్ణబాబు పోలింగ్ కేంద్రానికి వచ్చి బ్యాలెట్ పేపర్లను పరిశీలించారు. మరక అంటుకున్న బ్యాలెట్ పేపర్లను ఎట్టి పరిస్థితిలోనూ వినియోగించరాదని అక్కడ సిబ్బందిని ఆదేశించారు. అలాగే కౌంటింగ్ చేసేటప్పుడు సిరా అంటుకున్న బ్యాలెట్ పేపర్లను జాగ్రత్తగా లెక్కించాలని మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రసాద్‌కు సూచించారు.