రోహిణి కార్తె ఎండలతో ఉక్కిరిబిక్కిరి
కర్నూలు(అగ్రికల్చర్) : రోహిణి కార్తె కావడంతో భానుడు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. కొద్ది రోజులుగా ఎండల తీవ్రత కొంత మేర తగ్గినా మంగళవారం తీవ్రత భారీగా పెరిగింది. రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగులుతాయన్న తరహాలోనే భానుడు భగభగ మండుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ఎండల ధాటికి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సాయంత్రం 6 గంటలు దాటినా వడగాలులు తగ్గకపోవడంతో జనం ఉక్కపోతతో బయటకు రాలేకపోతున్నారు. ఈనెల 16న 34.2 డిగ్రీలు, 17న 38 డిగ్రీలు, 18న 39.9 డిగ్రీలు చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది. 18వ తేదీతో పోలిస్తే 19న ఉష్ణోగ్రత 2 డిగ్రీలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
ఉపాధి పనులకు వెళ్లిన కూలీలు ఎండల ధాటికి ఉదయం 10 గంటలకే వెనుదిరుగుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉపాధి పనులకు 1.50 లక్షల మంది హాజరవుతున్నారు. నిబంధనల మేరకు పనిచేసే చోట నీడ కల్పించాల్సి ఉంది. అయితే ఎక్కడా ఆ దాఖలాల్లేవు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 15 మంది కూలీలు వడదెబ్బ బారిన పడి మృతి చెందారు. రోహిణికార్తెలో ఎండల తీవ్రత పెరగడంతో పట్టణాల్లో ఉదయం 10 గంటలకే రోడ్లు ఖాళీ అవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటోంది. వాహనాల కాలుష్యం కారణంగా ఉష్ణోగ్రత పెరుగుతోంది.
భానుడు @41.9
Published Wed, May 20 2015 3:58 AM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM
Advertisement