Temperature rise
-
నాలుగు రోజుల పాటు మండనున్న ఎండలు
-
నాలుగు రెట్లు పెరగనున్న భూతాపం
సాక్షి, న్యూఢిల్లీ : 1901 నుంచి 1918 మధ్య భారత్‌లో వాతావరణ ఉష్ణోగ్రత 0.7 డిగ్రీల సెల్సియస్ పెరగ్గా, 2,100 సంవత్సరాంతానికి దేశంలో ఉష్ణోగ్రత 4.4 డిగ్రీల సెల్సియస్, అంటే ఇప్పటి కంటే నాలుగింతలు పెరగుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. 1976 నుంచి 2005 వరకు 30 ఏళ్ల కాలంలో పెరిగిన సగటు ఉష్ణోగ్రతకు ఈ పెరగనున్న ఉష్ణోగ్రత సమానమని, కర్బణ ఉద్ఘారాల కారణంగానే ఉష్ణోగ్రత పెరుగుతోందని ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. ‘అసిస్మెంట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఒవరి ది ఇండియన్ రీజియన్’ పేరిట కేంద్ర ప్రభుత్వం వాతావరణ మార్పులపై నివేదికను విడుదల చేసింది. దేశ ఉష్ణోగ్రత దాదాపు నాలుగు డిగ్రీలు పెరగడమంటే వడగాలులు కూడా నాలుగింతలు పెరగడమే. ఇది పర్యావరణ సమతౌల్యంపైనే కాకుండా వ్యవసాయం, నీటి వనరులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నీటి వనరులు బాగా తరగిపోతాయి. వ్యవసాయ ఉత్పత్తులు బాగా పడిపోతాయి. పర్యవసానంగా జీవ వైవిధ్యంపై ప్రభావంతోపాటు ఆహారం కొరత ఏర్పడుతుంది. తద్వారా ప్రజారోగ్యం దెబ్బతింటుంది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో కొన్ని రకాల మొక్కలు, జంతువులు నశించి పోతున్నాయని, నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఇవి మరింత వేగంగా నశించిపోయే ఆస్కారం ఉందని నివేదికలో ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచం మొత్తం మీద భూ ఉష్ణోగ్రత సరాసరి మూడు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ పెరగవచ్చని నివేదిక అంచనా వేసింది. భూ ఉష్ణోగ్రత పెరుగుదలను రెండు డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలని 2015లో పారిస్‌లో కుదర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లెక్కన ఆ లక్ష్య సాధనలో ప్రపంచ దేశాలు విఫలమైనట్లే. -
రాష్ట్రవ్యాప్తంగా భానుడి భగభగ
-
నిప్పుల వాన
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ‘అగ్గి’రాజుకుంది! ప్రచండ భానుడి ఉగ్రరూపానికి తెలంగాణ విలవిల్లాడింది. ఎండ వేడికితోడు ఉత్తరాది నుంచి వీస్తున్న వడగాడ్పులతో వివిధ జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా జైనద్‌లో 46.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా మంచిర్యాల, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లోనూ 46 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత రికార్డయింది. ఉదయం 9 గంటల నుంచే ఎండ వేడి, ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. రాత్రిపూట కూడా ఆ వేడి తగ్గలేదు. ఎండ తీవ్రతకు ఉపాధి హామీ కూలీలు, చిరు వ్యాపారులు అల్లాడిపోయారు. రోహిణి కార్తె కావడంతో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని, 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత దాటితే ఆయా ప్రాంతాల్లో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు అధికమవుతున్నందున వడగాల్పుల తీవ్రత సైతం పెరగనున్నట్లు తెలిపింది. ఉత్తర భారతం నుంచి రాష్ట్రంపైకి వేడిగాలులు, పొడిగాలులు వస్తున్నాయని, ముఖ్యంగా రాజస్తాన్ నుంచి ఈ గాలులు వస్తుండటంతో తెలంగాణలో తీవ్రమైన ఎండలు, వడగాడ్పులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. అలాగే ఉంపన్ తుపాను వెళ్లిపోవడంతో తేమ కూడా దాంతోపాటు వెళ్లిపోయిందని, ఫలితంగా రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ రెండు కారణాలతో రాష్ట్రంలో వడగాడ్పులు వీస్తున్నాయన్నారు. అయితే గతేడాది కంటే ఈసారి వడగాడ్పులు నమోదైన రోజులు తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఈసారి ఇప్పటివరకు మూడు రోజులే వడగాడ్పులు నమోదయ్యాయని వివరించారు. సాధారణ ఉష్ణోగ్రత కంటే 4.5 డిగ్రీల నుంచి 6.4 డిగ్రీలు అధికంగా నమోదు కావడం లేదా 45–46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైతే వడగాడ్పులుగా లెక్కిస్తామన్నారు. 47 డిగ్రీలు, ఆపైన ఉష్ణోగ్రతలు నమోదైతే తీవ్ర వడగాడ్పులుగా లెక్కిస్తామని పేర్కొన్నారు. నేడు, రేపు తీవ్ర వడగాడ్పులు... రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు పలుచోట్ల వడగాడ్పుల తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని వెల్లడించింది. మరోవైపు ఛత్తీస్‌గఢ్ నుంచి తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగనున్నట్లు పేర్కొంది. ఆ ద్రోణి వస్తే తేమ గాలులు వస్తాయని, అప్పుడు కాస్తంత వేడి తగ్గుతుందని తెలిపింది. కేటీపీపీలో 51 డిగ్రీలు? గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ఆదివారం 51 డిగ్రీల సెల్సియస్ రికార్డు ఉష్ణోగ్రత నమోదైనట్లు కేటీపీపీలోని ఉష్ణోగ్రత పట్టిక చూపింది. కానీ ఈ వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ధ్రువీకరించలేదు. -
రాష్ట్రంలో మండుతున్న ఎండలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. మెదక్‌లో ఆదివారం పగటి ఉష్ణోగ్రత ఏకంగా 39 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, రామగుండంలలో 38 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత రికార్డు అయింది. భద్రాచలం, హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండల్లో 37 డిగ్రీల చొప్పున నమోదైంది. మరోవైపు ఇంటీరియర్ ఒడిశా నుంచి తూర్పు, మధ్య అరేబియా సముద్రం వరకు దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సహా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
వడదెబ్బతో 13 మంది మృతి
ఉదయం ఏడు దాటుతుండగానే నడినెత్తిపైకి వస్తున్న సూర్యుడు, మండుతున్న ఎండలు.. ఫలితంగా వడగాలులు తీవ్రమవుతున్నాయి. దీంతో వేడి గాలులు తట్టుకోలేక మృతి చెందుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ మేరకు సోమవారం వడదెబ్బ కారణంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 13 మంది మృతి చెందారు. మడికొండ : గ్రేటర్ వరంగల్ 34వ డివిజన్లోని బాలజీనగర్కు చెందిన దేవర మణేమ్మ (60) ఆదివారం పని కి వెళ్లింది. సోమవారం ఉదయం తర్వాత వడదెబ్బ కారణంగా ఆమె మృతి చెందింది. మృతురాలికి భర్త, కుమార్తె ఉన్నట్లు తెలిపారు. కాజీపేట : కాజీపేటలో వడదెబ్బ కారణంగా ఇద్దరు మహిళలు మృతి చెందారు. వడదెబ్బతో అస్వస్థతకు గురై తిలక్‌నగర్‌కు చెందిన గొర్రె దర్గమ్మ(52), బాలాజీనగర్ చెందిన దేవర మీనమ్మ(65) మరణించారు. కరీమాబాద్ : వరంగల్ కరీమాబాద్ ప్రాంతానికి చెందిన వృద్ధురాలు పిట్ట పుల్లమ్మ(80) వడదెబ్బతో తీవ్ర అస్వస్తతకు గురై సోమవారం మధ్యాహ్నం మృతి చెందింది. కేసముద్రం : ఇనుగుర్తికి చెందిన లింగాడపు వెంకన్న(35) కొద్దిరోజులుగా రేకుల షెడ్డులో ఉంటున్నాడు. ఎండతీవ్రత ఎక్కువ కావడంతో వడదెబ్బకు గురయ్యాడు. ఆదివారం రాత్రి ఇంటి వద్ద మృతి చెందాడు. చేర్యాల : వేచరేణికి చెందిన మాదాసు చంద్రమ్మ(60) రోజు వారిలాగే వ్యవసాయ కూలీగా వెళ్తున్న క్రమంలో వడదెబ్బ తగిలింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన చంద్రమ్మ మృతి చెందింది. నాగిరెడ్డిపల్లి(బచ్చన్నపేట) : మండలంలోని నాగిరెడ్డిపల్లిలో దేవరాయ కనుకయ్య(35) ఆదివారం వ్యవసాయ బావి వద్దకు పనుల నిమిత్తం వెళ్లాడు. రాత్రి వేళ ఇంటికి వచ్చి అనారోగ్యంగా ఉందని అన్నం తినకుండానే పడుకున్నాడు. ఉదయం ఆటోలో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యలో మృతి చెందాడు. నర్సింహులపేట: మండలంలోని బీరిశెట్టిగూడెంలో సూరబోయిన కిష్టయ్య(65) వడదెబ్బకు మృతి చెందాడు. ఎండ వేడిమి తీవ్ర అస్వస్తతకు గురైన కిష్టయ్య స్థానికంగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహబూబాబాద్ : మానుకోట పట్టణంలోని కంకరబోడ్డు ప్రాంతానికి చెందిన రిటైర్డ్ సీఐ శేర్ వెంగళయ్య(85) వడదెబ్బతో సోమవారం మృతి చెందాడు. దేశాయిపల్లి(దుగ్గొండి) : మండలంలోని దేశాయిపల్లికి చెందిన కానుగుల అయిలయ్య(65) ఇంటి వద్ద రేకులషెడ్డులో నివసిస్తున్నాడు. ఇదే క్రమంలో ఆదివారం అనారోగ్యానికి గురయ్యాడు. రాత్రంతా ఇంటి వద్ద చికిత్స అనంతరం ఉదయం వరంగల్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు. జనగామ రూరల్ : జనగామ మండలంలోని ఎల్లంల గ్రామానికి చెందిన బక్క భాస్కర్(30) జనగామలో ట్రాక్టర్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం వడదెబ్బకు గురయ్యాడు. ఇంటి వద్ద వైద్య చికిత్సలు చేయించుకున్నప్పటికీ పరిస్థితి తగ్గుముఖం పట్టలేదు. సోమవారం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి గత ఏడాదే వివాహమైంది. స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : మండల కేంద్రానికి చెందిన గట్టు మైసయ్య(65) స్థానికంగా హమాలీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రోజూ మాదిరిగానే ఆదివారం పనికి వెళ్లిన అతడు రాత్రి ఇంటికి వచ్చి దాహంగా ఉందని నీరు తాగి ఒక్కసారిగా కుర్చీలో కుప్పకూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. ఏటూరునాగారం : మండలంలోని ముల్లకట్టకు చెందిన గడిగ సమ్మక్క (75) పొలం పనుల కోసం ఎండలో తిరగడంతో ఆదివారం రాత్రి వడదెబ్బ తాకింది. ఆమె అపస్మార్థక స్థితికి చేరుకొని సోమవారం వేకువజామున మృతి చెందింది -
ప్రచండ భానుడు
భానుడు ప్రచండ రూపం దాల్చడంతో జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మూడు రోజులుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిదంటే ఉష్ణోగ్రతల తీవ్రత ఎలా ఉందో అర్థమవుతుంది. ఎండల కారణంగా బయటకు వచ్చేందుకు జిల్లా వాసులు బెంబేలెత్తుతున్నారు. నెల్లూరు (అర్బన్) : మూడు రోజుల జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు చూస్తే సోమవారం 41 డిగ్రీలు, మంగళవారం 43 డిగ్రీలు బుధవారం 44 డిగ్రీలు నమోదయింది. గతంలో ఎన్నడూ ఈ స్థాయి ఉష్ణోగ్రతలు చూడలేదని జిల్లా వాసులు చెబుతున్నారు. బైక్‌పై వెళ్తుంటే ముఖానికి, కాళ్లకు ఎండ సెగ బలంగా తాకుతోంది. దీంతో చాలా మంది వాహనచోదకులు ముఖాలకు కర్చీఫులు, స్కార్ఫ్‌లు అడ్డం కట్టుకుంటున్నారు. ఎండ ధాటికి చిన్నారులు, వృద్ధులే కాకుండా యువత కూడా బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. చాలా మంది సినిమా హాళ్లకు వెళ్లి సేద తీరుతున్నారు. ఐస్‌క్రీం, కూల్‌డ్రింగ్స్ షాపులు రద్దీగా ఉంటున్నాయి. మరికొద్ది రోజులు ఉష్ణోగ్రత్తలు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండటంతో ప్రజలు భయపడుతున్నారు. 16 మంది మృతి వడదెబ్బ కారణంగా జిల్లాలో 16 మంది మృతి చెందారు. గత నెలన్నరలో సుమారు 27 మంది చనిపోగా గురువారం ఒక్కరోజే 16 మంది మృతిచెందారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో వడదెబ్బ మృతులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ వడదెబ్బపై ప్రజల్లో అవగాహన తేవడంలో విఫలమైందనే ఆరోపణలున్నాయి. మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా ప్రజల్లో అవగాహన నిర్వహించడం లాంటి కార్యక్రమాలపై దృష్టి పెట్టలేదు. మరికొద్ది రోజులు ఎండలు ఇలానే ఉంటాయని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా వైద్య, ఆరోగ్య శాఖ వడదెబ్బ మృతులు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కాగా వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఎండ ఎక్కువగా ఉండే సమయంలో సాధ్యమైనంత వరకు బయట తిరగొద్దని చెబుతున్నారు. -
భానుడు @41.9
రోహిణి కార్తె ఎండలతో ఉక్కిరిబిక్కిరి కర్నూలు(అగ్రికల్చర్) : రోహిణి కార్తె కావడంతో భానుడు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. కొద్ది రోజులుగా ఎండల తీవ్రత కొంత మేర తగ్గినా మంగళవారం తీవ్రత భారీగా పెరిగింది. రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగులుతాయన్న తరహాలోనే భానుడు భగభగ మండుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ఎండల ధాటికి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సాయంత్రం 6 గంటలు దాటినా వడగాలులు తగ్గకపోవడంతో జనం ఉక్కపోతతో బయటకు రాలేకపోతున్నారు. ఈనెల 16న 34.2 డిగ్రీలు, 17న 38 డిగ్రీలు, 18న 39.9 డిగ్రీలు చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది. 18వ తేదీతో పోలిస్తే 19న ఉష్ణోగ్రత 2 డిగ్రీలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉపాధి పనులకు వెళ్లిన కూలీలు ఎండల ధాటికి ఉదయం 10 గంటలకే వెనుదిరుగుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉపాధి పనులకు 1.50 లక్షల మంది హాజరవుతున్నారు. నిబంధనల మేరకు పనిచేసే చోట నీడ కల్పించాల్సి ఉంది. అయితే ఎక్కడా ఆ దాఖలాల్లేవు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 15 మంది కూలీలు వడదెబ్బ బారిన పడి మృతి చెందారు. రోహిణికార్తెలో ఎండల తీవ్రత పెరగడంతో పట్టణాల్లో ఉదయం 10 గంటలకే రోడ్లు ఖాళీ అవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటోంది. వాహనాల కాలుష్యం కారణంగా ఉష్ణోగ్రత పెరుగుతోంది.