ప్రచండ భానుడు
భానుడు ప్రచండ రూపం దాల్చడంతో జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మూడు రోజులుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిదంటే ఉష్ణోగ్రతల తీవ్రత ఎలా ఉందో అర్థమవుతుంది. ఎండల కారణంగా బయటకు వచ్చేందుకు జిల్లా వాసులు బెంబేలెత్తుతున్నారు.
నెల్లూరు (అర్బన్) : మూడు రోజుల జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు చూస్తే సోమవారం 41 డిగ్రీలు, మంగళవారం 43 డిగ్రీలు బుధవారం 44 డిగ్రీలు నమోదయింది. గతంలో ఎన్నడూ ఈ స్థాయి ఉష్ణోగ్రతలు చూడలేదని జిల్లా వాసులు చెబుతున్నారు. బైక్‌పై వెళ్తుంటే ముఖానికి, కాళ్లకు ఎండ సెగ బలంగా తాకుతోంది. దీంతో చాలా మంది వాహనచోదకులు ముఖాలకు కర్చీఫులు, స్కార్ఫ్‌లు అడ్డం కట్టుకుంటున్నారు. ఎండ ధాటికి చిన్నారులు, వృద్ధులే కాకుండా యువత కూడా బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. చాలా మంది సినిమా హాళ్లకు వెళ్లి సేద తీరుతున్నారు. ఐస్‌క్రీం, కూల్‌డ్రింగ్స్ షాపులు రద్దీగా ఉంటున్నాయి. మరికొద్ది రోజులు ఉష్ణోగ్రత్తలు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండటంతో ప్రజలు భయపడుతున్నారు.
16 మంది మృతి
వడదెబ్బ కారణంగా జిల్లాలో 16 మంది మృతి చెందారు. గత నెలన్నరలో సుమారు 27 మంది చనిపోగా గురువారం ఒక్కరోజే 16 మంది మృతిచెందారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో వడదెబ్బ మృతులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ వడదెబ్బపై ప్రజల్లో అవగాహన తేవడంలో విఫలమైందనే ఆరోపణలున్నాయి. మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా ప్రజల్లో అవగాహన నిర్వహించడం లాంటి కార్యక్రమాలపై దృష్టి పెట్టలేదు.
మరికొద్ది రోజులు ఎండలు ఇలానే ఉంటాయని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా వైద్య, ఆరోగ్య శాఖ వడదెబ్బ మృతులు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కాగా వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఎండ ఎక్కువగా ఉండే సమయంలో సాధ్యమైనంత వరకు బయట తిరగొద్దని చెబుతున్నారు.