వడదెబ్బతో 13 మంది మృతి
ఉదయం ఏడు దాటుతుండగానే నడినెత్తిపైకి వస్తున్న సూర్యుడు, మండుతున్న ఎండలు.. ఫలితంగా వడగాలులు తీవ్రమవుతున్నాయి. దీంతో వేడి గాలులు తట్టుకోలేక మృతి చెందుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ మేరకు సోమవారం వడదెబ్బ కారణంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 13 మంది మృతి చెందారు.
మడికొండ : గ్రేటర్ వరంగల్ 34వ డివిజన్‌లోని బాలజీనగర్‌కు చెందిన దేవర మణేమ్మ (60) ఆదివారం పని కి వెళ్లింది. సోమవారం ఉదయం తర్వాత వడదెబ్బ కారణంగా ఆమె మృతి చెందింది. మృతురాలికి భర్త, కుమార్తె ఉన్నట్లు తెలిపారు.
కాజీపేట : కాజీపేటలో వడదెబ్బ కారణంగా ఇద్దరు మహిళలు మృతి చెందారు. వడదెబ్బతో అస్వస్థతకు గురై తిలక్‌నగర్‌కు చెందిన గొర్రె దర్గమ్మ(52), బాలాజీనగర్ చెందిన దేవర మీనమ్మ(65) మరణించారు.
కరీమాబాద్ : వరంగల్ కరీమాబాద్ ప్రాంతానికి చెందిన వృద్ధురాలు పిట్ట పుల్లమ్మ(80) వడదెబ్బతో తీవ్ర అస్వస్తతకు గురై సోమవారం మధ్యాహ్నం మృతి చెందింది.
కేసముద్రం : ఇనుగుర్తికి చెందిన లింగాడపు వెంకన్న(35) కొద్దిరోజులుగా రేకుల షెడ్డులో ఉంటున్నాడు. ఎండతీవ్రత ఎక్కువ కావడంతో వడదెబ్బకు గురయ్యాడు. ఆదివారం రాత్రి ఇంటి వద్ద మృతి చెందాడు.
చేర్యాల : వేచరేణికి చెందిన మాదాసు చంద్రమ్మ(60) రోజు వారిలాగే వ్యవసాయ కూలీగా వెళ్తున్న క్రమంలో వడదెబ్బ తగిలింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన చంద్రమ్మ మృతి చెందింది.
నాగిరెడ్డిపల్లి(బచ్చన్నపేట) : మండలంలోని నాగిరెడ్డిపల్లిలో దేవరాయ కనుకయ్య(35) ఆదివారం వ్యవసాయ బావి వద్దకు పనుల నిమిత్తం వెళ్లాడు. రాత్రి వేళ ఇంటికి వచ్చి అనారోగ్యంగా ఉందని అన్నం తినకుండానే పడుకున్నాడు. ఉదయం ఆటోలో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యలో మృతి చెందాడు.
నర్సింహులపేట: మండలంలోని బీరిశెట్టిగూడెంలో సూరబోయిన కిష్టయ్య(65) వడదెబ్బకు మృతి చెందాడు. ఎండ వేడిమి తీవ్ర అస్వస్తతకు గురైన కిష్టయ్య స్థానికంగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మహబూబాబాద్ : మానుకోట పట్టణంలోని కంకరబోడ్డు ప్రాంతానికి చెందిన రిటైర్డ్ సీఐ శేర్ వెంగళయ్య(85) వడదెబ్బతో సోమవారం మృతి చెందాడు.
దేశాయిపల్లి(దుగ్గొండి) : మండలంలోని దేశాయిపల్లికి చెందిన కానుగుల అయిలయ్య(65) ఇంటి వద్ద రేకులషెడ్డులో నివసిస్తున్నాడు. ఇదే క్రమంలో ఆదివారం అనారోగ్యానికి గురయ్యాడు. రాత్రంతా ఇంటి వద్ద చికిత్స అనంతరం ఉదయం వరంగల్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు.
జనగామ రూరల్ : జనగామ మండలంలోని ఎల్లంల గ్రామానికి చెందిన బక్క భాస్కర్(30) జనగామలో ట్రాక్టర్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం వడదెబ్బకు గురయ్యాడు. ఇంటి వద్ద వైద్య చికిత్సలు చేయించుకున్నప్పటికీ పరిస్థితి తగ్గుముఖం పట్టలేదు. సోమవారం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి గత ఏడాదే వివాహమైంది.
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : మండల కేంద్రానికి చెందిన గట్టు మైసయ్య(65) స్థానికంగా హమాలీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రోజూ మాదిరిగానే ఆదివారం పనికి వెళ్లిన అతడు రాత్రి ఇంటికి వచ్చి దాహంగా ఉందని నీరు తాగి ఒక్కసారిగా కుర్చీలో కుప్పకూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు.
ఏటూరునాగారం : మండలంలోని ముల్లకట్టకు చెందిన గడిగ సమ్మక్క (75) పొలం పనుల కోసం ఎండలో తిరగడంతో ఆదివారం రాత్రి వడదెబ్బ తాకింది. ఆమె అపస్మార్థక స్థితికి చేరుకొని సోమవారం వేకువజామున మృతి చెందింది