మాయ మాటలతో లిఫ్ట్.. ఆపై చోరీ
- వరుస ఘటనలు
- ఆందోళనలో ప్రజలు
- అపరిచితులతో జాగ్రత్త: పోలీసులు
- 100కు ఫోన్ చేయాలని సూచన
నర్సాపూర్: బస్టాండ్‌లో బస్సు కోసం వేచి ఉన్నారా..? గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి మీకు లిఫ్టు ఇస్తానంటే సరేనంటూ వెళ్లబోతున్నారా..? మీరు రోడ్డుపై నడుస్తోంటే గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని ఆగితే గుడ్డిగా నమ్మి బయలుదేరబోతున్నారా..? అలాగైతే మీరు మోసపోవడానికి ఓ అడుగు ముందుకు వేసినట్టే.. ఎవరైనా లిఫ్టు ఇస్తామని మిమ్మల్ని పిలిచినా, బైక్‌పై సర్రున దూసుకొచ్చి మీ పక్కన ఆపి పద వెళదాం అన్నా .. మీరు చేయాల్సింది ఒక్కటే.. అదే 100 నెంబర్‌కి ఫోన్ చేయడం.. లిఫ్ట్ ఇస్తామంటూ, ఇచ్చి మోసం చేస్తున్న మాయగాళ్లు మీ చుట్టూనే తిరుగుతున్నారనే విషయం గుర్తుంచుకోండి.
సరిగ్గా ఇలాంటి ఘటనలు గత నెల 26న నర్సాపూర్ పోలీస్ సర్కిల్ పరిధిలో జరిగాయి. నర్సాపూర్‌లో జరుగుతున్న సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని కలిసేందుకు చండూరుకు చెందిన మోహన్‌రెడ్డి స్థానిక బస్టాండులో బస్సు దిగాడు. అతను నడుస్తూ వస్తుండగానే వెనక నుంచి బైక్‌పై ఓ యువకుడొచ్చాడు. నేను సదస్సుకే వెళుతున్నానని చెప్పి అతన్ని బైక్‌పై ఎక్కించుకొని బయలుదేరాడు. హన్మంతాపూర్ గ్రామ శివారుకు చేరుకోగానే అక్కడికి మరికొందరు యువకులు వచ్చారు. వారంతా కలిసి మోహన్ రెడ్డిపై చేయి చేసుకుఇని అతడి వద్ద ఉన్న బంగారు ఉంగరం తీసుకుపోయారు.
ఇదిలా ఉంటే.. అదే రోజు మరో ఘటన జరిగింది. నర్సాపూర్‌కు చెందిన వ్యాపారి నర్సింలు తన పనులు ముగించుకుని ఇంటికి వచ్చేందుకు కౌడిపల్లి మండలం వెంకట్రావ్‌పేట బస్టాండులో బస్సు కోసం వేచి చూస్తున్నాడు. ఒక అపరిచిత వ్యక్తి బైక్‌పై వచ్చి తాను నర్సాపూర్ వెళ్తున్నానని, లిఫ్టు ఇస్తానని చెప్పడంతో విఠనర్సింలు బైక్ ఎక్కాడు. అక్కడ్నించి నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లి సమీపంలోకి రాగానే సదరు అపరిచిత వ్యక్తి బైక్ ఆపాడు. తనకు పొలాలు ఉన్నాయని, వాటిని చూసి వద్దామని చెప్పడంతో అతనితో పాటు నర్సింలు వెళ్లాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న మరో ఇద్దరు వ్యక్తులు నర్సింలు నుంచి బంగా రు గొలుసు, తొమ్మిదిన్నర వేల రూపాయలు తీసుకుని పరారయ్యారు. కాగా వృద్ధులను టార్గెట్ చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు.
ఆ రెండు ముఠాల పనేనా..!
ఇటీవల జరిగిన రెండు ఘటనలు జిల్లాకు చెందిన సిద్దిపేట, హైదరాబాద్‌లోని మోతీనగర్‌లకు చెందిన రెండు ముఠాల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ఘటనల్లో మోసాలు చేసింది ఆ రెండు ముఠాల్లో ఏదో ఒక వర్గం పనేనని అనుమానిస్తున్నారు. అందులో భాగంగా బాధితుల నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. అంతేగాక ఈ ముఠాల ఆచూకీకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిసింది.
అపరిచితులతో జాగ్రత్త: నర్సాపూర్ ఎస్‌ఐ గోపీనాథ్
అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని స్థానిక ఎస్‌ఐ గోపీనాథ్ సూచించారు. మోసాలకు పాల్పడుతున్న వారిని పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎప్పుడైనా అపరిచితులను అంత సులభంగా నమ్మవద్దని, వారు ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోవద్దని, ఉచితంగా లిఫ్టు ఇస్తామని చెప్పినా అంగీకరించవద్దని చెప్పారు. అలాంటి వ్యక్తుల వాహనాల నెంబర్లు గుర్తుంచుకోవాలన్నారు. తాము మోసపోయామని భావిస్తే వెంటనే 100 నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు. కాగా తాము పోలీసులమని ఎవరైనా చెప్పినా నమ్మవద్దని, పోలీసులు ఎప్పుడైనా వాహనాలను జన సమర్థమైన ప్రదేశాల్లోనే తనిఖీలు చేస్తారని, నిర్జన ప్రదేశాల్లో తనిఖీలు చేయరని స్పష్టం చేశారు. అలా తనిఖీలు చేయాల్సి వస్తే యూనిఫాంలో ఉంటారని ఆయన చెప్పారు.