People concerned
-
మాయ మాటలతో లిఫ్ట్.. ఆపై చోరీ
- వరుస ఘటనలు - ఆందోళనలో ప్రజలు - అపరిచితులతో జాగ్రత్త: పోలీసులు - 100కు ఫోన్ చేయాలని సూచన నర్సాపూర్: బస్టాండ్‌లో బస్సు కోసం వేచి ఉన్నారా..? గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి మీకు లిఫ్టు ఇస్తానంటే సరేనంటూ వెళ్లబోతున్నారా..? మీరు రోడ్డుపై నడుస్తోంటే గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని ఆగితే గుడ్డిగా నమ్మి బయలుదేరబోతున్నారా..? అలాగైతే మీరు మోసపోవడానికి ఓ అడుగు ముందుకు వేసినట్టే.. ఎవరైనా లిఫ్టు ఇస్తామని మిమ్మల్ని పిలిచినా, బైక్‌పై సర్రున దూసుకొచ్చి మీ పక్కన ఆపి పద వెళదాం అన్నా .. మీరు చేయాల్సింది ఒక్కటే.. అదే 100 నెంబర్‌కి ఫోన్ చేయడం.. లిఫ్ట్ ఇస్తామంటూ, ఇచ్చి మోసం చేస్తున్న మాయగాళ్లు మీ చుట్టూనే తిరుగుతున్నారనే విషయం గుర్తుంచుకోండి. సరిగ్గా ఇలాంటి ఘటనలు గత నెల 26న నర్సాపూర్ పోలీస్ సర్కిల్ పరిధిలో జరిగాయి. నర్సాపూర్‌లో జరుగుతున్న సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని కలిసేందుకు చండూరుకు చెందిన మోహన్‌రెడ్డి స్థానిక బస్టాండులో బస్సు దిగాడు. అతను నడుస్తూ వస్తుండగానే వెనక నుంచి బైక్‌పై ఓ యువకుడొచ్చాడు. నేను సదస్సుకే వెళుతున్నానని చెప్పి అతన్ని బైక్‌పై ఎక్కించుకొని బయలుదేరాడు. హన్మంతాపూర్ గ్రామ శివారుకు చేరుకోగానే అక్కడికి మరికొందరు యువకులు వచ్చారు. వారంతా కలిసి మోహన్ రెడ్డిపై చేయి చేసుకుఇని అతడి వద్ద ఉన్న బంగారు ఉంగరం తీసుకుపోయారు. ఇదిలా ఉంటే.. అదే రోజు మరో ఘటన జరిగింది. నర్సాపూర్‌కు చెందిన వ్యాపారి నర్సింలు తన పనులు ముగించుకుని ఇంటికి వచ్చేందుకు కౌడిపల్లి మండలం వెంకట్రావ్పేట బస్టాండులో బస్సు కోసం వేచి చూస్తున్నాడు. ఒక అపరిచిత వ్యక్తి బైక్‌పై వచ్చి తాను నర్సాపూర్ వెళ్తున్నానని, లిఫ్టు ఇస్తానని చెప్పడంతో విఠనర్సింలు బైక్ ఎక్కాడు. అక్కడ్నించి నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లి సమీపంలోకి రాగానే సదరు అపరిచిత వ్యక్తి బైక్ ఆపాడు. తనకు పొలాలు ఉన్నాయని, వాటిని చూసి వద్దామని చెప్పడంతో అతనితో పాటు నర్సింలు వెళ్లాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న మరో ఇద్దరు వ్యక్తులు నర్సింలు నుంచి బంగా రు గొలుసు, తొమ్మిదిన్నర వేల రూపాయలు తీసుకుని పరారయ్యారు. కాగా వృద్ధులను టార్గెట్ చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఆ రెండు ముఠాల పనేనా..! ఇటీవల జరిగిన రెండు ఘటనలు జిల్లాకు చెందిన సిద్దిపేట, హైదరాబాద్‌లోని మోతీనగర్లకు చెందిన రెండు ముఠాల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ఘటనల్లో మోసాలు చేసింది ఆ రెండు ముఠాల్లో ఏదో ఒక వర్గం పనేనని అనుమానిస్తున్నారు. అందులో భాగంగా బాధితుల నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. అంతేగాక ఈ ముఠాల ఆచూకీకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిసింది. అపరిచితులతో జాగ్రత్త: నర్సాపూర్ ఎస్ఐ గోపీనాథ్ అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని స్థానిక ఎస్ఐ గోపీనాథ్ సూచించారు. మోసాలకు పాల్పడుతున్న వారిని పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎప్పుడైనా అపరిచితులను అంత సులభంగా నమ్మవద్దని, వారు ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోవద్దని, ఉచితంగా లిఫ్టు ఇస్తామని చెప్పినా అంగీకరించవద్దని చెప్పారు. అలాంటి వ్యక్తుల వాహనాల నెంబర్లు గుర్తుంచుకోవాలన్నారు. తాము మోసపోయామని భావిస్తే వెంటనే 100 నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు. కాగా తాము పోలీసులమని ఎవరైనా చెప్పినా నమ్మవద్దని, పోలీసులు ఎప్పుడైనా వాహనాలను జన సమర్థమైన ప్రదేశాల్లోనే తనిఖీలు చేస్తారని, నిర్జన ప్రదేశాల్లో తనిఖీలు చేయరని స్పష్టం చేశారు. అలా తనిఖీలు చేయాల్సి వస్తే యూనిఫాంలో ఉంటారని ఆయన చెప్పారు. -
కాలుష్యాన్ని వెదజల్లే గనులు వద్దు
- అభిప్రాయ సేకరణలో వ్యతిరేకించిన ప్రజలు - డీఆర్వో, ఆర్డీవో నిలదీత - ప్రభుత్వానికి నివేదిస్తామని అధికారుల హామీ మునగపాక: కాలుష్యానికి కారణమయ్యే గనుల తవ్వకాన్ని సహించేది లేదంటూ మండలంలోని టి.సిరసపల్లి, వెంకటాపురం, రామారాయుడుపేట తదితర గ్రామాల ప్రజలు బుధవారం ఆందోళనకు దిగారు. పోలీసుల సమక్షంలో గనుల తవ్వకానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన డీఆర్వో నాగేశ్వరరావు, ఆర్డీవో పద్మావతి వద్ద ఆయా గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్తతకు దారితీసింది. కాలుష్యం వెదజల్లే గనుల తవ్వకాలకు సంబంధించి ప్రజలనుంచి వస్తున్న వ్యతిరేకతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువస్తామని రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. మండలంలోని టి.సిరసపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 138, 139లో ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూముల్లో వెంకటాపురం, సిరసపల్లి, రామారాయుడుపేట, పరవాడ మండలం తానాం గ్రామానికి చెందిన రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయా సర్వేలలోని 125 ఎకరాల్లో ప్రభుత్వం పరిశ్రమల పార్కుకు అనుమతిచ్చింది. మరో 125 ఎకరాలకు సంబందించి అశ్విని క్లేమైన్ సంస్థ గనుల తవ్వకానికి అనుమతి కోరుతూ గతంలో దరఖాస్తు చేసుకుంది. వీటిపై ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు నిర్ణయించడంతో ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సేకరణకు సంబంధించిన స్థలానికి అధికారులు రాకుండా ఆడ్డుకున్నారు. ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రజలతో మాట్లాడేందుకు డీఆర్వో, ఆర్డీవో సంఘటన స్థలానికి చేరుకోగా ఆందోళనకారులు ఒక్కసారిగా వారిపై మండిపడ్డారు. కాలుష్యం వెదజల్లే గనుల తవ్వకాలను తాము ఒప్పుకోమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమల పార్కుకు తాము వ్యతిరేకం కాదని కాలుష్యం వచ్చే తవ్వకాలు మాత్రం వద్దంటూ సిరసపల్లి , వెంకటాపురం సర్పంచ్‌లు మద్దాల ధనలక్ష్మి, సుందరపు వెంకట కనకప్పారావు, సీఐటీయూ డివిజన్ నాయకుడు గనిశెట్టి సత్యనారాయణ, సిరసపల్లి ఎంపీటీసీ యల్లపు జగదీశ్వరి నాగేశ్వరరావు, పొలమరశెట్టి నాయుడు అప్పలనాయుడు, తెలుగు మహిళ జిల్లా నాయకురాలు కడియం అనురాధ తదితరులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ దశలో అధికారులకు, ఆందోళనకారులకు మధ్య వివాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న అనకాపల్లి రూరల్ సీఐ ప్రసాద్ వచ్చి ఆందోళన కారులతో చర్చించి సంబందిత స్థలానికి అధికారుల బృందాన్ని తీసుకువెళ్లారు. అనంతరం డీఆర్వో, ఆర్డీవో ప్రజలతో మాట్లాడుతూ తాము ప్రజాభిప్రాయసేకరణ వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. -
భానుడు @41.9
రోహిణి కార్తె ఎండలతో ఉక్కిరిబిక్కిరి కర్నూలు(అగ్రికల్చర్) : రోహిణి కార్తె కావడంతో భానుడు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. కొద్ది రోజులుగా ఎండల తీవ్రత కొంత మేర తగ్గినా మంగళవారం తీవ్రత భారీగా పెరిగింది. రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగులుతాయన్న తరహాలోనే భానుడు భగభగ మండుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ఎండల ధాటికి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సాయంత్రం 6 గంటలు దాటినా వడగాలులు తగ్గకపోవడంతో జనం ఉక్కపోతతో బయటకు రాలేకపోతున్నారు. ఈనెల 16న 34.2 డిగ్రీలు, 17న 38 డిగ్రీలు, 18న 39.9 డిగ్రీలు చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది. 18వ తేదీతో పోలిస్తే 19న ఉష్ణోగ్రత 2 డిగ్రీలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉపాధి పనులకు వెళ్లిన కూలీలు ఎండల ధాటికి ఉదయం 10 గంటలకే వెనుదిరుగుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉపాధి పనులకు 1.50 లక్షల మంది హాజరవుతున్నారు. నిబంధనల మేరకు పనిచేసే చోట నీడ కల్పించాల్సి ఉంది. అయితే ఎక్కడా ఆ దాఖలాల్లేవు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 15 మంది కూలీలు వడదెబ్బ బారిన పడి మృతి చెందారు. రోహిణికార్తెలో ఎండల తీవ్రత పెరగడంతో పట్టణాల్లో ఉదయం 10 గంటలకే రోడ్లు ఖాళీ అవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటోంది. వాహనాల కాలుష్యం కారణంగా ఉష్ణోగ్రత పెరుగుతోంది.