కాలుష్యాన్ని వెదజల్లే గనులు వద్దు
- అభిప్రాయ సేకరణలో వ్యతిరేకించిన ప్రజలు
- డీఆర్‌వో, ఆర్డీవో నిలదీత
- ప్రభుత్వానికి నివేదిస్తామని అధికారుల హామీ
మునగపాక: కాలుష్యానికి కారణమయ్యే గనుల తవ్వకాన్ని సహించేది లేదంటూ మండలంలోని టి.సిరసపల్లి, వెంకటాపురం, రామారాయుడుపేట తదితర గ్రామాల ప్రజలు బుధవారం ఆందోళనకు దిగారు. పోలీసుల సమక్షంలో గనుల తవ్వకానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన డీఆర్‌వో నాగేశ్వరరావు, ఆర్డీవో పద్మావతి వద్ద ఆయా గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్తతకు దారితీసింది.
కాలుష్యం వెదజల్లే గనుల తవ్వకాలకు సంబంధించి ప్రజలనుంచి వస్తున్న వ్యతిరేకతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువస్తామని రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. మండలంలోని టి.సిరసపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 138, 139లో ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూముల్లో వెంకటాపురం, సిరసపల్లి, రామారాయుడుపేట, పరవాడ మండలం తానాం గ్రామానికి చెందిన రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయా సర్వేలలోని 125 ఎకరాల్లో ప్రభుత్వం పరిశ్రమల పార్కుకు అనుమతిచ్చింది.
మరో 125 ఎకరాలకు సంబందించి అశ్విని క్లేమైన్ సంస్థ గనుల తవ్వకానికి అనుమతి కోరుతూ గతంలో దరఖాస్తు చేసుకుంది. వీటిపై ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు నిర్ణయించడంతో ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సేకరణకు సంబంధించిన స్థలానికి అధికారులు రాకుండా ఆడ్డుకున్నారు. ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రజలతో మాట్లాడేందుకు డీఆర్‌వో, ఆర్డీవో సంఘటన స్థలానికి చేరుకోగా ఆందోళనకారులు ఒక్కసారిగా వారిపై మండిపడ్డారు. కాలుష్యం వెదజల్లే గనుల తవ్వకాలను తాము ఒప్పుకోమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరిశ్రమల పార్కుకు తాము వ్యతిరేకం కాదని కాలుష్యం వచ్చే తవ్వకాలు మాత్రం వద్దంటూ సిరసపల్లి , వెంకటాపురం సర్పంచ్‌లు మద్దాల ధనలక్ష్మి, సుందరపు వెంకట కనకప్పారావు, సీఐటీయూ డివిజన్ నాయకుడు గనిశెట్టి సత్యనారాయణ, సిరసపల్లి ఎంపీటీసీ యల్లపు జగదీశ్వరి నాగేశ్వరరావు, పొలమరశెట్టి నాయుడు అప్పలనాయుడు, తెలుగు మహిళ జిల్లా నాయకురాలు కడియం అనురాధ తదితరులు అభ్యంతరం వ్యక్తంచేశారు.
ఈ దశలో అధికారులకు, ఆందోళనకారులకు మధ్య వివాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న అనకాపల్లి రూరల్ సీఐ ప్రసాద్ వచ్చి ఆందోళన కారులతో చర్చించి సంబందిత స్థలానికి అధికారుల బృందాన్ని తీసుకువెళ్లారు. అనంతరం డీఆర్‌వో, ఆర్డీవో ప్రజలతో మాట్లాడుతూ తాము ప్రజాభిప్రాయసేకరణ వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు.