మరో రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
విశాఖ: గత కొన్ని రోజుల నుంచి భానుడి భగభగలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఊరట లభించనుంది. మరో రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నట్లు విశాఖ వాతావరణం కేంద్రం తెలిపింది. చత్తీస్ గఢ్ నుంచి కోస్తాంధ్రా మీదుగా తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా మంగళవారం గుంటూరు జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.గుంటూరు పట్టణంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవగా, రేపల్లెలో వడగాళ్ల వాన పడింది. దీంతో అనేక చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.