
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న భీమవరంలోని సోమేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ రంగరాజు, ఈఓ కేశవ్‌కుమార్
భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం గునుపూడిలోని పంచారామక్షేత్రం ఉమాసోమేశ్వరస్వామి ఆలయ అర్చకుడు కందుకూరి రామరావు గర్భగుడిలో చనిపోలేదని దేవస్థానం చైర్మన్ వేగేశ్న రంగరాజు తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. అర్చకుడు రామారావు ఈ నెల 11న స్వామి వారికి పూజ చేస్తున్న సమయంలో తూలి పడిపోవడంతో అక్కడే ఉన్న అతని కుమారుడు పైకి లేపాడని చెప్పారు. తర్వాత మళ్లీ జారి పడిపోవడంతో అర్చకుల సహాయంతో ఆయనను బయటకు తీసుకువచ్చి మండపంలో పడుకోబెట్టారన్నారు. ఇంతలో అతని సోదరుడు సోంబాబు వచ్చి నీళ్లు కొట్టగా రామరావు కదలి నీళ్లు కుడా తాగాడని తెలిపారు.
ఆయనకు గుండె పోటు వచ్చిందని గ్రహించి ఆటోలో ఆసుపత్రికి తీసుకెళుతుండగా ఎక్కిళ్లు వచ్చి చనిపోయారని వివరించారు. ఆయన గర్భగుడిలో చనిపోయారని జరుగుతున్న ప్రచారం అవాస్తమన్నారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ను కొందరు ప్రెస్‌కు ఇచ్చి, సోషల్ మీడియాలో పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. రామరావును బయట ఆలయ మండపంలో పడుకోబెట్టినపుడు ఆయన కదలిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయన్నారు. ఎవరైనా తమని కలిస్తే చూపిస్తామని రంగరాజు తెలిపారు.
దేవస్థానంలోని సీసీ కెమెరా ఫుటేజ్ బయటకు ఎవరి ద్వారా వెళ్లింది అనే విషయంపై విచారణ చేస్తున్నామని, దానిని బయటకు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మ వద్దని, తాము ఆలయ పవిత్రతను ఎప్పుడూ కాపాడుతామని చెప్పారు.
దుష్ట శక్తుల పని ఇది : ఈఓ కేశవ్‌కుమార్
అర్చకుడు రామరావు గుడిలో చనిపోయారని కొన్ని దుష్టశక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, దీనిని ఖండిస్తున్నట్టు ఆలయ ఈఓ కాదంబరి కేశవ్‌కుమార్ అన్నారు. ఈ విషయాన్ని దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, ఆర్‌జేసీకి తెలియజేశామన్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ బయటకు ఇచ్చి, ఇటువంటి అపవాదు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రధాన అర్చకులు చేకూరి రామరాకృష్ణ, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment