పాపయ్య (ఫైల్), పూజారి పాపయ్య జారి పడిపోయిన గంపమల్లయ్య కొండ ఇదే..
ఆ కొండ ప్రమాదకరంగా ఉంటుంది. అయినా తరతరాలుగా పూజారి పాపయ్య వంశీకులు పూజలు కొనసాగిస్తున్నారు. చాలా ఏళ్ల కిందట జారిపడి వీరి వంశంలో పూజారి మృత్యువాత పడ్డాడు. ఇప్పుడూ అదే ఘోరం జరిగింది. భక్తుల గోవింద నామస్మరణ నడుమ నైవేద్యంతో నడుచుకుంటూ వెళ్తున్న పాపయ్య.. ఒక్కసారిగా కాలుజారింది. 300 అడుగుల పైనుంచి అమాంతం గులకరాయిలాగా కిందపడి దుర్మరణం చెందాడు. భగవంతుడా.. ఎంత పనైంది స్వామీ.. అంటూ భక్తులు కన్నీటిపర్యంతమయ్యారు.
– శింగనమల
ప్రమాదం ఎలా జరిగిందంటే..
అనంతపురం జిల్లా శింగనమల మండలం చిన్నజలాలపురం సమీపంలో ఏడుకొండల మధ్య గంపమల్లయ్య కొండ ఉంది. దీనిపైకి 11 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఏటా శ్రావణమాసంలో నాలుగు శనివారాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కొండపై ఉత్సవ విగ్రహాలకు శనివారం ఆనందరావుపేటకు చెందిన పూజారి అప్పా పాపయ్య (55) శ్రావణమాస పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి 20 అడుగుల కింద గుహలో గంప మల్లయ్య స్వామికి పూజ చేయడానికి సిద్ధమయ్యారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తుండగా.. గుహలోకి వెళ్లడానికి ఐదు అడుగుల వరకు దిగారు. తర్వాత కాలు జారడంతో 300 అడుగుల ఎత్తు పై నుంచి కింద పడి దుర్మరణం చెందారు. పాపయ్యకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.
చమురే ప్రాణం తీసింది..
గంప మల్లయ్య కొండపై పూజ ప్రమాదమని తెలిసినా అప్పా కుటుంబీకులు సాహసం చేస్తున్నారు. భక్తులు తీసుకొచ్చిన చమురును గరుడ స్తంభంలోకి పోస్తారు. దాన్ని తీసుకుని పూజారి కిందకు దిగే క్రమంలో చమురు కారి రాళ్లపై పడుతూ ఉంటుంది. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. అయినప్పటికీ పూజారిని గంప మల్లయ్య స్వామి ఆవహిస్తారన్న నమ్మకంతో దిగుతుంటారు. ఐదు తరాల క్రితం కూడా ఇలాగే జారి పడి పూజారి ఒకరు మృతి చెందినట్లు భక్తులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment