192 మంది పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణ
ఆమోదించిన జిల్లా కలెక్టర్
ఉత్తర్వులు సిద్ధం చేస్తున్న అధికారులు
డిగ్రీ విద్యార్హతే ప్రామాణికం
15 వేల నిరుద్యోగ అభ్యర్థులకు మిగిలేవి 6 పోస్టులే !
సాక్షి, సంగారెడ్డి:
కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త. చాలీచాలని వేతనాలతో ఏళ్ల తరబడి ఊడిగం చేస్తున్న ‘కాంట్రాక్టు’ ఉద్యోగులు ఎట్టకేలకు పర్మినెంట్ అయ్యారు. డిగ్రీ విద్యార్హత కలిగిన 192 మంది కాంట్రాక్టు కార్యదర్శులను క్రమబద్దీకరిస్తూ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం అధికారులు ఉద్యోగుల క్రమబద్దీకరణ ఉత్తర్వులు సిద్ధం చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో కాంట్రాక్టు కార్యదర్శుల చేతికి ఈ ఉత్తర్వులు అందనున్నాయి. కాంట్రాక్టు కార్యదర్శుల గత సర్వీసు కాలాన్ని పరిగణలోకి తీసుకోకుండా కొత్తగా ఉద్యోగంలో చేరినట్లు సర్వీసును లెక్కించనున్నారు. క్రమబద్దీకరణ తర్వాత వీరికి రూ.7,520-రూ.22,430 పే స్కేల్ అమలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యూనల్ మధ్యంతర ఉత్తర్వుల ఆధారంగా క్రమబద్దీకరణ తంతు పూర్తి చేసినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం జిల్లాలో 204 మంది కాంట్రాక్టు కార్యదర్శులు పనిచేస్తుండగా వారిలో డిగ్రీ విద్యార్హత కల్గిన వారు 192 మందిని పర్మినెంట్ చేశారు. ఇక ఇంటర్ విద్యార్హత గల మిగిలిన 12 మందిని విధుల తొలగించకుండా కాంట్రాక్టు ప్రాతిపదికన కొనసాగిస్తామని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. భవిష్యత్తులో వారు డిగ్రీ విద్యార్హత సాధిస్తే ఉద్యోగాన్ని క్రమబద్దీకరించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.
మిగిలినవి ఆ..రు
పదిహేను వేల మందికి పైగా అభ్యర్థులు.. పోస్టులేమో ఆరు !. ప్రస్తుతం ఈ విచిత్ర పోటీ పంచాయతీ కార్యదర్శుల భర్తీలో ఏర్పడింది. 210 పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్ 31న జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ జారీ చేయగా, గడువులోగా 15,432 దరఖాస్తులొచ్చిన విషయం తెలిసిందే.
ట్రిబ్యూనల్ మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం..డిగ్రీ అర్హత గల 192 కాంట్రాక్టు కార్యదర్శుల క్రమబద్దీకరించడంతో పాటు ఇంటర్ అర్హత గల 12 మంది కార్యదర్శుల పోస్టులను ఎవరికీ కేటాయించకుండా తుది ఆదేశాలు విడుదలయ్యే వరకు రిజర్వు చేసి పెట్టనున్నారు. ఎంటెక్, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ తదితర ఉన్నత విద్య కోర్సులు చదివిన వేల మంది నిరుద్యోగుల పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్-4) పోస్టుల కోసం అప్పట్లో దరఖాస్తు చేసుకున్నారు. 210 పోస్టుల్లో 204 పోస్టులు కాంట్రాక్టు కార్యదర్శులకు పోగా..ఇక నిరుద్యోగ అభ్యర్థులకు 6 పోస్టులు మాత్రమే మిగిలాయి. మెరిట్ ప్రాతిపదికన ఈ ఆరు పోస్టులను నిరుద్యోగ అభ్యర్థులతో భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు.
ఇక పర్మినెంట్
Published Sat, Feb 1 2014 11:07 PM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
Advertisement
Advertisement