జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పదిమంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. పార్వతీపురం కొత్తవలసకు చెందిన కత్తిరి శ్రీనును స్థానిక రైల్వేగేట్ వద్ద పాలకొండ
పార్వతీపురం టౌన్ : జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పదిమంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. పార్వతీపురం కొత్తవలసకు చెందిన కత్తిరి శ్రీనును స్థానిక రైల్వేగేట్ వద్ద పాలకొండ నుంచి పార్వతీపురం వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీను ఎడమ కాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రుడ్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఔట్‌పోస్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
– బైక్ బోల్తా..
విజినిగిరి (జామి) : మండలంలోని విజినిగిరి వద్ద బైక్ బోల్తాపడిన సంఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నానికి చెందిన ఎస్‌కే అబ్దుల్ (35) విజినిగిరిలోని తన బంధువుల ఇంటికి వచ్చి, తిరుగు ప్రయాణంలో విజినిగిరి యోగాశ్రమం వద్ద బైక్ బోల్తా పడడంతో అబ్దుల్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు అతడ్ని 108 వాహనంలో విజనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
– ట్రాక్టర్ ఢీకొని ఒకరు..
బొబ్బిలి : ట్రాక్టర్ ఢీ కొనడంతో ఉపాధ్యాయ సంఘ నాయకుడు గాయపడిన సంఘటన బొబ్బిలిలో చోటుచేసుకుంది. కురమాన జోగారావు ద్విచక్ర వాహనంపై పారాది నుంచి బొబ్బిలి వస్తుండగా స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో వెనుకనుంచి వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో జోగారావు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రడ్ని బొబ్బిలి ఆస్పత్రికి తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించారు. ఏఎస్సై సీహెచ్ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ కెల్ల వెంకటరమణను అరెస్ట చేశారు.
ద్విచక్రవాహనం నుంచి జారిపడి
పార్వతీపురం టౌన్ : ద్విచక్ర వాహనం నుంచి జారిపడి ఒకరు గాయపడ్డారు. గరుగుబిల్లి మండలం గొట్టివలస గ్రామానికి చెందిన బోను తాతబాబు గుమ్మలక్ష్మీపురం మండలం నుంచి గొట్టివలస వస్తుండగా రేగిడి గ్రామం వద్ద బైక్ అదుపు తప్పి పడిపోయింది. దీంతో గాయాలపాలైన తాతబాబును స్థానికులు పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.