విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న హైటెక్ బస్సులో పది కిలోల బంగారం చోరీకి గురైంది. విజయవాడలో బంగారం వ్యాపారం చేస్తున్న వ్యాపారులు కొంతమంది మిగిలిన బంగారాన్ని విజయవాడ నుంచి హైదరాబాద్ తీసుకొస్తుండగా సూర్యాపేట బస్టాండులో ఈ బంగారం పోయిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. తొలుత పది కిలోల బంగారం పోయిందని ఫిర్యాదు చేసినా, తర్వాత విచారణలో మాత్రం అది మూడు కిలోలేనని చెప్పడంతో దీనిపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
విజయవాడలో అమ్మకాలు చేయగా మిగిలిన బంగారాన్ని కొంతమంది గుమాస్తాలు తీసుకొస్తున్నారు. వీరు తొలుత ఒకసారి కోదాడలో బస్సు దిగారు. తర్వాత సూర్యాపేటలో గుమాస్తాలు కిందకు దిగగా, బస్సు కండక్టర్ టీ తాగేందుకు వెళ్లారు. కానీ తిరిగి వచ్చేసరికి బస్సులో ఉండాల్సిన బంగారం లేదని వాళ్లు గగ్గోలు పెట్టారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా పది కిలోల బంగారం అయ్యేసరికి ఈ విషయం కాస్తా దావానలంలా వ్యాపించింది.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దీనిపై విచారణ జరిపారు. అయితే విచారణలో మాత్రం గుమాస్తాలు తమ వద్ద ఉండాల్సినది మూడు కిలోల బంగారమేనని చెప్పారు. దీంతో పాటు, బస్సులోంచి వేరే ప్రయాణికులు ఎవ్వరూ కిందకి దిగకపోవడంతో పోలీసులకు అనుమానాలు తలెత్తాయి. బస్టాండులో, అదీ పాయింటులో పెట్టిన హైటెక్ బస్సులోంచి అంత బంగారాన్ని చోరీ చేయడం సాధ్యం కాదని, అందువల్ల గుమాస్తాలే ఏమైనా మోసానికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులను కూడా పోలీసులు విచారించారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
బస్సులో పది కిలోల బంగారం చోరీ?
Published Sat, Nov 23 2013 8:19 AM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM
Advertisement
Advertisement