తెనాలిలో ఒకరి దారుణహత్య
Published Mon, Sep 23 2013 12:54 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
తెనాలి రూరల్, న్యూస్‌లైన్ :తెనాలి బస్టాండ్ ఆవరణలోని షాపింగ్ కాంప్లెక్సులో ఓ వ్యక్తిని దారుణంగా శనివారం అర్ధరాత్రి దాటాక హతమార్చారు. ముగ్గురు వ్యక్తులు నిందితులుగా భావిస్తుండగా, వీరిలో ఒకయువకుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బేతాళ కాంతసునీల హత్యకేసులోనూ నిందితుడు. పాతకక్షల నేపథ్యంలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ ఐతానగర్‌కు చెందిన బొనిగల ఆనంద్‌కు అదేప్రాంతానికి చెందిన సముద్రాల మహంకాళి, సముద్రాల రాజేష్, సముద్రాల పవన్‌కుమార్, వారి వర్గీయులతో ఆధిపత్య పోరుతో గతంలోనే వివాదాలు జరిగేవి. ఇటీవలి కాలంలో ఆనంద్‌తో ఐతానగర్‌కే చెందిన కొండేపూడి చినవెంకటస్వామి అలియాస్ బాలశౌరి(38) సన్నిహితంగా మెలుగుతున్నాడు. మహంకాళి వర్గీయులతో ఆనంద్‌కు ఘర్షణ జరిగినప్పుడు బాలశౌరి ఆనంద్‌కు మద్దతుగా మాట్లాడుతుండేవాడు. రెండువర్గాలు మీ అంతు చూస్తామంటే మీ అంతు చూస్తామంటూ హెచ్చరించుకుంటుండే వారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఆనంద్, బాలశౌరి ప్రకాశంరోడ్డులోని ఓ బార్‌లో మద్యం తాగారు.
అదే బార్‌లో మద్యం తాగుతున్న సముద్రాల రాజేష్‌తో ఘర్షణ పడ్డారు. బార్ నిర్వాహకులు వీరికి సర్దిచెప్పి పంపించేశారు. ఈ విషయాన్ని రాజేష్.. మహంకాళి, పవన్‌కుమార్‌లకు చెప్పాడు. రాత్రికి బాలశౌరి బస్టాండ్ ఆవరణలో మూసి ఉన్న కూల్‌డ్రింక్ షాపు ఎదుట ఉన్న అరుగుపై కూర్చుని మద్యం తాగుతున్నాడు. సమాచారం అందుకున్న మహంకాళి, పవన్‌కుమార్ అక్కడికి వెళ్లి బాలశౌరిపై ఇనుపరాడ్లతో దాడిచేశారు. తలకు తీవ్ర గాయాలవడంతో అతను అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరూ పరారయ్యారు. విషయం తెలుసుకున్న టూ టౌన్ సీఐ ఎస్.ఆంథోనిరాజ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. తల పైభాగం పగిలి మెదడు బయటకు రావడంతో బాలశౌరి మృతిచెందాడని గుర్తించారు. మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సునీల కేసులోనూ నిందితుడు..
పోలీసులు పేర్కొంటున్న నిందితుల్లో ఒకరైన సముద్రాల పవన్‌కుమార్ బేతాళ కాంతసునీల హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. సునీల హత్యోదంతం జరిగినప్పుడు మొత్త ఎనిమిది మందిని పోలీసులు అరెస్టుచేయగా వారిలో పవన్‌కుమార్ ఒకడు. రాజేష్ ఐతానగర్ బీఎస్‌ఏ సెంటరులో ైఎలక్ట్రికల్ లెటింగ్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. పవన్‌కుమార్‌కు మహంకాళి, రాజేష్ బాబాయిలు.
Advertisement
Advertisement