జమ్మలమడుగు: ‘వ్యవసాయంతో పాటు బంగారంపై బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను చెల్లించవద్దు... చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతోటే తొలి సంతకం రుణమాఫీపైనే పెడతారు...మొత్తం బ కాయిలన్నీ రద్దవుతాయి.. అసలుగానీ ఒక్క పైసా వడ్డీగానీ కట్టవద్దంటూ’ టీడీపీ నాయకులు ఇటీవలి ఎన్నికలలో విసృ్తత ప్రచారం చేశారు.. గోడలపై రాతలు రాశారు.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేయకపోగా కమిటీని ఏర్పాటు చేశారు. 45రోజుల్లో నివేదిక వచ్చిన తర్వాత రుణమాఫీపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.
అయితే తాము ఇచ్చిన డబ్బులను వడ్డీతో సహా చెల్లించకుంటే మీ బంగారం మొత్తం వేలం వేస్తామంటూ బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరు గ్రామానికి చెందిన రాయలసీమ రైతు సేవా సహకారం సంఘం అధికారులు 103మంది రైతులకు నోటీసులు పంపారు. తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాలని అనేకసార్లు కోరినా కట్టకపోవడంతో వేలం నోటీసులు జారీ చేస్తున్నామంటూ వివరించారు. ఈనెల 11వ తేదీ లోపు డబ్బులు చెల్లించాలని లేనిపక్షంలో 21వతేదీ ఉదయం 11గంటలకు వేలం పాట వేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. అధికారులిచ్చిన గడువు ముగియడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఇంతవరకు రుణ మాఫీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.
పంటలు లేవు..
నాకున్న పది ఎకరాల పొలంలో మూడు ఎకరాలు ముంపునకు గురయ్యాయి. మిగిలిన ఏడు ఎకరాలలో సపోట చెట్లను నాటాను. వాటికి ఏడాది వయసు కూడా రాలేదు. అంతర్‌పంటగా కంది వేశాను. సక్రమంగా పంటలేదు. 2012లో వ్యవసాయం కోసం బంగారం తాకట్టు పెట్టి రూ. 2లక్షలు అప్పు తెచ్చుకున్నాను. ప్రస్తుతం అసలు వడ్డీకలిసి 2లక్షల 72 వేల 990 రూపాయలు అయింది. మొత్తం కట్టాలని నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం మాత్రం రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినా బ్యాంకు అధికారులు వేలం వేస్తామని నోటీసులు జారీ చేస్తున్నారు.
- బోరు నారాయణరెడ్డి, రైతు,తాళ్లప్రొద్దుటూరు
వేలం వేస్తాం..!
Published Mon, Jul 14 2014 2:07 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement