బాబు వివరణలతో సంతృప్తి చెందని రాష్ట్ర ఎన్నికల సంఘం
సాక్షి, అమరావతి: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఉల్లంఘించడంపై తదుపరి చర్యలకు సిఫార్సు చేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా బాబు తన ప్రసంగాల్లో నిబంధనలు తుంగలో తొక్కుతూ సీఎం జగన్‌పై అభ్యంతరకర పదజాలంతో దూషిస్తూ, ఉద్వేగాలను రెచ్చగొట్టే విధంగా చేస్తున్న ప్రసంగాలకు సంబంధించి వైఎస్సార్‌సీపీ ఎన్నికల సంఘానికి అనేకమార్లు ఫిర్యాదు చేసింది.
వాటిలో 18 ఫిర్యాదులకు సంబంధించి చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. ఫిర్యాదుల ఆధారంగా వివరణ ఇవ్వాలంటూ బాబుకు నోటీసులు జారీ చేయగా.. కొన్నింటికి సమాధానాలు ఇచ్చిన బాబు మరికొన్నింటికి అసలు స్పందించలేదు. బాబు సమాధానంపై సంతృప్తి చెందని రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత బాబు ప్రసంగాలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉన్నట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చింది.
ఈ 18 ఫిర్యాదులకు సంబంధించిన వీడియో క్లిప్పులను జత చేస్తూ తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ముఖేష్‌కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యకార్యదర్శి అవినాష్ కుమార్‌కు లేఖ రాశారు.
తాజాగా మరో ఫిర్యాదు
ఎన్నికల ప్రచార సభల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనాకు వైఎస్సార్‌సీపీ మంగళవారం ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, పార్టీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నారాయణమూర్తి, న్యాయవాది కె.శ్రీనివాసరెడ్డి వెలగపూడి సచివాలయంలో సీఈవోకు ఫిర్యాదు అందించారు.
ఈ నెల 22న జగ్గంపేట బహిరంగ సభలో బాబు ప్రసంగిస్తూ.. సీఎం జగన్, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు విరుద్ధం కాబట్టి బాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. జగ్గంపేట సభతోపాటు నర్సంపేట, ఎస్.కోట సభల్లో కూడా చంద్రబాబు పరుష పదజాలం వాడారని, సీఎం వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.
ఇలాంటి దుర్మార్గమైన చర్యను చంద్రబాబు పదే పదే కొనసాగిస్తున్నారని, పచ్చమీడియాను అడ్డం పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని వివరించారు. మెగా డీఎస్సీపైనే తొలి సంతకం అంటూ నిరుద్యోగులకు మళ్లీ దగా చేయాలని చూస్తున్నారని, వీటిని నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు.
Comments
Please login to add a commentAdd a comment