
పవన్ కల్యాణ్ పార్టీపై కాంగ్రెస్ లో టెన్షన్!
హైదరాబాద్:ప్రముఖ సినీహీరో పవన్ కల్యాణ్ కొత్త పార్టీ ఆరంగేట్రం ఊహాగానాలపై అప్పుడే కాంగ్రెస్ నేతల్లో అలజడి మొదలైంది. పవన్ అన్నయ్య చిరంజీవి ఒక ప్రక్క కాంగ్రెస్ పార్టీలోకీలక పాత్ర పోషిస్తుండగా, ఇప్పుడు అదే కుటుంబం నుంచి కొత్త పార్టీ ఏమిటని కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. పవన్ కొత్త పార్టీ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేతలు మీనమేషాలు లెక్కిస్తున్నారు. పవన్ కల్యాణ్ కొత్త పార్టీ పెడితే కాంగ్రెస్ పరిస్థితి ఏమిటని కొందరు తమకు తామే ప్రశ్నించుకుంటుండగా, మరికొందరిలో మాత్రం పవన్ తమ ప్రక్క చేరితే బాగుంటుందని కూడా భావిస్తున్నారు. ఇప్పటికే పవన్ పార్టీపై కాంగ్రెస్ పెద్దలు తమదైన శైలిలో కూనిరాగాలు తీస్తూ ముందుకు వెళుతున్నారు.
పవన్ పార్టీ పెడితే స్వాగతిస్తామని పైకి చెబుతున్న కాంగ్రెస్ నాయకులు లోలోపల మాత్రం మల్లగుల్లలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఇప్పటికే ఒక అడుగు ముందుకేసి పవన్ పార్టీ పెట్టడాన్ని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. అంతటి ఆగకుండా, పవన్ కల్యాణ్ తమతో జత కట్టిన ఫర్వాలేదంటూ మరోరాగాన్ని ఆలపించారు. దీంతో వారి మనసుల్లో ఏముందో సామాన్య జనానికి ఇట్టే అవగతమవుతుంది.
మరో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మాత్రం పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఆదర్శవంతమైన జీవితం, వ్యక్తిత్వం కల్గిన వారే రాజకీయాలకు అర్హులంటూ తనశైలిని కాస్త రంగరించారు. మహిళలకు అన్యాయం చేసేవారిని ప్రజలు ఛీకొడతారంటూ కొత్తపాట అందుకున్నారు. మూడో పెళ్లి చేసుకున్న పవన్ కల్యాణ్ ముందు నీతి నిజాయితీ నిరూపించుకోవాలని ఎద్దేవా చేశారు. పవన్ పార్టీ పెడతారా?లేదా?అనేది ప్రక్కన పెడితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పార్టీలపై వస్తున్న వార్తలు మాత్రం కాంగ్రెస్ నేతల గుండెల్లో అలజడి సృష్టిస్తున్నాయి. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కల్గిన కాంగ్రెస్ కు భవితవ్యాన్నిమాత్రం కాలమే నిర్ణయించాలి.