విజయవాడ : మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు దుర్గగుడి ఘాట్‌రోడ్డుపై గురువారం బీభత్సం సృష్టించాడు. అమ్మవారి దర్శనం చేసుకునేందుకు తనను అనుమతించలేదంటూ ఘాట్‌రోడ్డులోని మొదటి మలుపు వద్ద కొండ శిఖరానికి ఎక్కి దూకేస్తానంటూ బెదిరించాడు. అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని కిందకు దింపడంతో పరిస్థితి సద్దుమణిగింది. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా పార్వతీపురం సమీపంలోని కొమరాడకు చెందిన అంపిరి గౌరీశంకర్ (26) గురువారం దుర్గమ్మ దర్శనానికి వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న గౌరీశంకర్‌ను సెక్యూరిటీ సిబ్బంది క్యూలైన్‌లోకి అనుమతించలేదు.
దీంతో గౌరీశంకర్ ఘాట్‌రోడ్డులోని మొదటి మలుపు వద్ద నుంచి కొండ శిఖరానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి కేకలు వేయడంతో భక్తులు గమనించి ఆలయ ప్రాంగణంలోని పోలీస్ అవుట్‌పోస్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపకశాఖ అధికారి బి.శ్రీనివాసరావు నేతృత్వంలోని సిబ్బంది వి.శివనాగిరెడ్డి, వి.శ్రీనివాసరావు, పి.శివకృష్ణ కొండ ఎక్కి గౌరీశంకర్‌కు కిందకు దింపే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన గౌరీశంకర్ తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగగా, బుజ్జగించి కిందకు దింపారు. అయితే, గౌరీశంకర్ మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం అతడిని వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇంద్రకీలాద్రిపై టెన్షన్ టెన్షన్
Published Fri, Jun 19 2015 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 3:57 AM
Advertisement