జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు (ఫైల్)
గుంటూరు ఎడ్యుకేషన్ : ‘వేసవి సెలవుల్లో జూనియర్ కళాశాలల విద్యార్థులకు తరగతులు నిర్వహించరాదు. మే నెలాఖరులో ఇంటర్లో ప్రవేశాలకు బోర్డు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాతే జూన్‌లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలి. విద్యార్థులకు సెలవులు ఇవ్వకుండా తరగతులు నిర్వహించిన ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల గుర్తింపు రద్దు చేస్తాం’ ఇవి ఇంటర్మీడియెట్ బోర్డు విడుదల చేసిన నిబంధనల సారాంశం. కానీ జిల్లాలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు అప్పడే ఇంటర్æ తరగతులను ప్రారంభించేశాయి. వేసవి సెలవుల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహించరాదన్న బోర్డు ఉత్తర్వులను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
పరీక్షల హడావుడితో అలసినవిద్యార్థులు సేద తీరేదెన్నడు ?
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకూ నిర్వహించిన ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు జిల్లాలో 93,932 మంది విద్యార్థులు హాజరయ్యారు. అదే విధంగా మార్చి 18 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకూ నిర్వహించిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు 59 వేల మంది హాజరయ్యారు. ఏడాది పొడవునా తరగతి గదులకు పరిమితమై పరీక్షల హడావుడి, ఆందోళనతో అలసిపోయి సెలవులతో సేద తీరాల్సిన సమయంలో ఊపిరి తీసుకునే సమయం లేకుండా ఇంటర్ తరగతులు ప్రారంభించడంతో విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు డే స్కాలర్‌తో పాటు హాస్టల్ క్యాంపస్‌లలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నాయి. గుంటూరు నగరంతో పాటు నగర శివారు గోరంట్ల, రెడ్డిపాలెం, పెద పలకలూరులో ఉన్న హాస్టళ్లలో యథేచ్ఛగా తరగతులు జరుగుతున్నాయి. విద్యార్థులకు జూన్ నెలలో ప్రవేశాలు కల్పించి తరగతులు ప్రారంభించాలని ఇంటర్‌బోర్డు అకడమిక్ కేలండర్‌లో పొందుపర్చగా, కాలేజీల యాజమాన్యాలు ఇందుకు కొత్త భాష్యాన్ని చెబుతున్నాయి. జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాల్సిన దృష్ట్యా వేసవి సెలవులను ఎంజాయ్ చేయడం వల్ల విద్యార్థులు వెనుకబడి పోతారని తల్లిదండ్రులకు నమ్మబలికి, వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి.
ప్రథమ సంవత్సర పరీక్షలు రాసినవిద్యార్థులకు సైతం...
సీనియర్ ఇంటర్ విద్యార్థులను జేఈఈ–అడ్వాన్స్‌డ్, నీట్ శిక్షణ పేరుతో క్యాంపస్‌లలో పెట్టి రుద్దుతున్న కాలేజీల యాజమాన్యాలు ప్రథమ సంవత్సర విద్యార్థులను సైతం వదలడం లేదు. టెన్త్ విద్యార్థులతో పాటు ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థులకు సైతం కళాశాలలు ద్వితీయ సంవత్సర తరగతులను ప్రారంభించాయి. దీనికి బ్రిడ్జి కోర్సు, ఐఐటీ కోచింగ్ అంటూ రకరకాల పేర్లు పెట్టారు. జిల్లాలో ఈ విధంగా టెన్త్ పూర్తి చేసిన, ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు రాసిన దాదాపు 30 వేల మంది విద్యార్థులకు నిబంధనలకు విరుద్ధంగా తరగతులు జరుగుతున్నా ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదు. వేసవి సెలవుల్లో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఇంటర్ తరగతులను రద్దు చేయాలని పలు విద్యార్థి సంఘాలు ఇంటర్‌బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
కళాశాలలపై చర్యలు తీసుకోవాలి
గుంటూరు ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా వేసవి సెలవుల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్ కళాశాలలపై కఠిన చర్యలు చేపట్టాలని ఆర్‌ఐవో జెడ్.ఎస్ రామచంద్రరావుకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.భగవాన్‌దాస్, జిల్లా అధ్యక్షుడు పి.మనోజ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం సాంబశివపేటలోని ఆర్‌ఐవో కార్యాలయంలో రామచంద్రరావును కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ ఇంటర్‌బోర్డు మార్చి 29 నుంచి మే 31 వరకూ వేసవి సెలవులు ప్రకటించినప్పటికీ, గుంటూరు నగరంతో పాటు జిల్లా వివిధ కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. టెన్త్ విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సుల పేరుతో అడ్మిషన్లు ప్రారంభించి రెగ్యులర్ తరగతులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇంటర్‌బోర్డు నిబంధనలకువిరుద్ధంగా వ్యవహరిస్తున్న కళాశాలలపైకఠిన చర్యలు చేపట్టని పక్షంలో ఎస్‌ఎఫ్‌ఐఆధ్వర్యంలో కళాశాలల వద్ద ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. ఆర్‌ఐవోను కలిసిన వారిలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు ఎం.కిరణ్, రాజేష్ తదితరులున్నారు.
తరగతులు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం
వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం. మే నెలాఖరులో అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాతే ప్రవేశాలు కల్పించాలి. విద్యార్థులకు ఆటవిడుపు లేకుండా తరగతుల నిర్వహణపై విద్యార్థి సంఘాల నుంచి ఫిర్యాదులు అందాయి. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న కళాశాలలపై దాడులు నిర్వహించి క్రమశిక్షణ చర్యలు చేపడతాం.– జెడ్.ఎస్ రామచంద్రరావు,ఇంటర్‌బోర్డు ఆర్‌ఐవో
Comments
Please login to add a commentAdd a comment