
పదో తరగతి విద్యార్థి దారుణ హత్య
పండగ వేళ ఆ ఇంటిని విషాదం ఆవరించింది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుదామని సెలవులకు ఇంటికి వచ్చిన ఆ విద్యార్థి పినతండ్రి చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో చెలరేగిన బాబాయి బాణాలతో విచక్షణా రహితంగా పొడవడంతో ఈ ఘటన జరిగింది. ఫలితంగా గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.
చింతకర్రపాలెం(వై.రామవరం) : వై.రామవరం మండలం చింతకర్రపాలెం గ్రామంలో శుక్రవారం రాత్రి పదో తరగతి విద్యార్థి పల్లాల సంజీవరెడ్డి (15) దారుణ హత్యకు గురయ్యాడు. సొంత పిన తండ్రి పల్లాల అబ్బా యిరెడ్డి అలుగులు(బాణాలు)తో ఛాతీపై పొడవడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలొదిలాడు. ఫలితంగా పండగ వేళ ఆ కుటుంబంలోనూ, గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో షల్లాల అబ్బయిరెడ్డి తప్ప తాగి అతని భార్య సరస్వతిని చితక బాదుతున్నాడు. అప్పుడు అక్కడే ఉన్న అన్నకొడుకు సంజీవరెడ్డి, మరికొంత మంది కుటుంబ సభ్యులు అడ్డు వెళ్లారు. ఆమెను కొట్టవద్దని నచ్చజెప్పారు. దీంతో మద్యం మత్తులో ఆగ్రహోద్రోగుడైన అబ్బాయిరెడ్డి రెచ్చిపోయాడు.
తన ఇంటిలోంచి అలుగులు(బాణాలు) తీసుకొచ్చి సంజీవరెడ్డి ఛాతీపై విచక్షణా రహితంగా రెండు పోట్లు పొడిచాడు. దీంతో అతను కుప్పకూలి మృతిచెందాడు. మృతుడు వై.రామవరం మండలం పనసలపాలెం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చాడు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఘటనపై శనివారం ఉదయం గ్రామస్తులు వై.రామవరం పోలీసు లకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ ముక్తేశ్వరరావు పర్యవేక్షణలో ఎసై్సలు లక్ష్మణరావు, అప్పన్న సిబ్భందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీఆర్వో బత్తుల ముణీంద్రం సమక్షంలో వాంగ్మూలాలు రికార్డుచేశారు. నిందితునిపై కేసు నమోదు చేశారు.
అనంతరం సీఐ సాక్షితో మాట్లాడుతూ నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలో అరెస్టు చేస్తామని వెల్లడించారు. గతంలో మండలంలోని మడుగు కోట గ్రామానికి చెందిన కిలో ఆనందరావును రాళ్లతో కొట్టి, హత్యా యత్నానికి పాల్పడిన మరో కేసులోనూ నిందితుడు సెంట్రల్ జైలులో రిమాండ్‌కు వెళ్లివచ్చాడని వివరించారు. ఇదిలా ఉండగా, అలాంటి వ్యక్తిని వదలవద్దని గ్రాముస్తలు సీఐకి విన్నవించారు. ఎదిగొచ్చిన కొడుకును దారుణంగా హతమార్చాడని సంజీవరెడ్డి తల్లిదండ్రులు సోమిరెడ్డి, బంగారమ్మ కన్నీరుమున్నీరయ్యారు. నిందితుని కఠినంగా శిక్షించాలని కోరారు. వృద్ధాప్యంలో తమకు తోడుగా ఉంటాడనుకున్న కొడుకును కడతేర్చాడని రోదిస్తున్నారు.