టెన్త్ విద్యార్థి ఆత్మహత్య
Published Mon, Aug 26 2013 5:10 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
వడ్లమూడి(చేబ్రోలు), న్యూస్‌లైన్ : పదో తరగతి విద్యార్థి రైలు కిందపడి మరణించిన సంఘటన చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వడ్లమూడి గ్రామానికి చెందిన పఠాన్ మస్తాన్, మోతీల ఏకైక కుమారుడు షారుక్ ఖాన్ అడ్డరోడ్డులోని చాణక్య పబ్లిక్ స్కూల్లో పదో తరగతి విద్యార్థి. స్కూల్లో ఆదివారం స్టడీ అవర్స్ నిర్వహిస్తుండటంతో పదో తరగతి విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు షారుక్ ఖాన్, మరో ఇద్దరు విద్యార్థులు బహిర్భూమికి ఉపాధ్యాయుల అనుమతితో వెళ్లారు. కొద్ది సేపటికి ఇద్దరు తిరిగి వచ్చేశారు.
షారుక్‌ఖాన్ మాత్రం తిరిగి రాలేదు. గుంటూరు-రేపల్లె ప్యాసింజర్ రైలు సంగం జాగర్లమూడి దాటి తెనాలి వైపు వెళ్తున్న సమయంలో చెట్లు పొదల నుంచి ఓ విద్యార్థి అకస్మాత్తుగా వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే అధికారులకు ట్రైన్ డ్రైవర్ సమాచారం అందించినట్లు తెలిసింది. విద్యార్థి యూనిఫాం ఆధారంగా పోలీసులు చాణక్య పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి విషయాన్ని తెలియజేయడంతో వారు వచ్చి పరిశీలించి షారుక్‌ఖాన్‌గా గుర్తించారు. ప్రిన్సిపాల్ శివరామకృష్ణ విషయాన్ని షారుక్‌ఖాన్ తల్లిదండ్రులకు తెలిపారు.
మృతుడి తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున పాఠశాల వద్దకు చేరుకుని పాఠశాలలో ఒత్తిడే ఆత్మహత్యకు కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను ఘోరావ్ చేశారు. స్కూల్ యాజమాన్య వైఖరిని నిరసిస్తూ తెనాలి రహదారిపై బైఠాయించడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. చేబ్రోలు ఎస్‌ఐ డి.వినోద్‌కుమార్ ఆందోళనకారులతో మాట్లాడి శాంత పరిచారు. ప్రిన్సిపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మిన్నంటిన రోదనలు..ఒక్కగానొక్క కుమారుడు మరణించటంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలియగానే మృతుడి తల్లి సొమ్మసిల్లి పడిపోయింది. తల్లిదండ్రులు తాపీ పని చేస్తూ షారుక్‌ఖాన్‌ను చదివించేవారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Advertisement
Advertisement