ఏపీలో టెన్త్‌ పరీక్షలు రద్దు | Tenth exams canceled in AP | Sakshi
Sakshi News home page

టెన్త్‌ పరీక్షలు రద్దు

Published Sun, Jun 21 2020 3:50 AM | Last Updated on Sun, Jun 21 2020 10:19 AM

Tenth exams canceled in AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జూలై 10 నుంచి 17 వరకు జరగాల్సిన 2019–20 పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను కోవిడ్‌–19 నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. దీంతో పాటు జూలై 11 నుంచి జరగాల్సిన ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. శనివారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఈ విషయాలు వెల్లడించారు. పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు, ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ, ఎస్సెస్సీ బోర్డు డైరక్టర్‌ ఎ.సుబ్బారెడ్డి తదితరులతో కలసి ఆయన ప్రభుత్వ ప్రకటన విడుదల చేశారు. ఎస్సెస్సీలో పరీక్షలు రాయాల్సిన 6,39,022 మంది విద్యార్థులు, ఇంటర్మీడియెట్‌ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సిన విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యారని స్పష్టం చేశారు. మంత్రి విడుదల చేసిన ప్రకటనలోని అంశాలు ఇలా ఉన్నాయి.

గట్టి చర్యలు తీసుకున్నా..
పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం రెండు నెలల నుంచి లాక్‌డౌన్‌ రోజుల్లో సప్తగిరి చానెల్‌ ద్వారా ‘విద్యామృతం’, ఆకాశవాణి ద్వారా ‘విద్యాకలశం’ అనే పేర్లతో పాఠ్యాంశాలను బోధిస్తూ పరీక్షలకు సన్నద్ధం చేయించింది. ఊ 11 పేపర్లను 6 పేపర్లకు తగ్గించింది. 2,923 సెంటర్లను 4వేలకు పైగా పెంచి అదనపు సిబ్బందిని నియమించింది. భౌతిక దూరానికి వీలుగా ఏర్పాట్లు, శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజ్‌లు, థర్మల్‌ స్క్రీనింగ్‌ వంటి అనేక చర్యలు చేపట్టింది.
► అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు, ఇతర పరిస్థితుల నేపథ్యంలో జూన్‌ 15న విద్యా శాఖ మంత్రి జిల్లా అధికారులు, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేసినప్పటికీ, ఇంటి నుంచి వెళ్లి వచ్చే సమయంలో కరోనా వైరస్‌ సోకే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమైంది. 

అన్ని అంశాలను బేరీజు వేసి..
► జూలై నాటికి కరోనా కేసులు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని వివిధ సర్వేలు సూచిస్తున్నందున కంటైన్మెంట్‌ జోన్లు పెరిగితే పరీక్షల నిర్వహణ మరింత కష్టతరంగా ఉంటుందని, చాలా జిల్లాల్లో పూర్తి స్థాయిలో రవాణా సౌకర్యాలు పునరుద్ధరించలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. 
► ఈ అంశాలన్నింటినీ ఈ నెల 18న మంత్రి, అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ నేపథ్యంలో పిల్లల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని  పరీక్షలకు హాల్‌ టికెట్లు పొందిన విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రకటించాలని సీఎం పాఠశాల విద్యా శాఖను ఆదేశించారు.  

గ్రేడ్లు ప్రకటించడానికి కసరత్తు
► తమ పిల్లలు బాగా చదివారని, వారికి మంచి గ్రేడ్‌లు వస్తాయని భావించామని.. ఇప్పుడు అందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రకటించడం ద్వారా పిల్లలందరి ప్రతిభను ఒకే రీతిన పరిగణిస్తారేమోనని పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. 
► ఈ దృష్ట్యా ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించాల్సి ఉంటుంది. వివిధ కోర్సుల్లో చేరడానికి మార్కులు, గ్రేడింగ్‌ అవసరమవుతాయి. ఇందుకోసం విద్యార్థులకు గ్రేడింగ్‌ ఇవ్వనున్నాం. తగిన విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించాం.

ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు ఉండవు
► ఇంటర్‌ ఫస్టియర్, సెకండియర్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూలై 11 నుంచి జరగాల్సిన అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను కూడా రద్దు చేసి వారందరినీ ఉత్తీర్ణులైనట్లు ప్రకటిస్తున్నాం.  
► ఇంటర్‌ ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు కూడా ఉండవు. సప్లిమెంటరీ పరీక్షల ఫీజు కట్టిన వారికి బోర్డు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుంది. ఇంటర్‌ రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ ప్రక్రియ యథాతథంగా కొనసాగుతుంది. 
► ఎంసెట్‌ వంటి ఇతర పరీక్షలకు సంబంధించి కూడా షెడ్యూళ్లు ఇచ్చాం. ప్రస్తుతానికి అవన్నీ యధాతథంగా అవే షెడ్యూళ్లలో ఉంటాయి. 
► పరీక్షల రద్దు పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement