జానీబాషాపురంలో విషాధ ఛాయలు
రాజంపేట టౌన్: కడపలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టెన్త్ విద్యార్థి షేక్ అన్వర్ బాషా (16) మృతి చెందాడు. రాజంపేట పట్టణం జానీబాషాపురంకు చెందిన అన్వర్‌బాషా ప్రభుత్వ హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం కడపలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతదేహాన్ని బంధువులు బుధవారం జానీబాషాపురంకు తీసుకొచ్చారు.
దీంతో ఒక్కసారిగా ఆ గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. మృతదేహం స్వగృహానికి చేరగానే తల్లిదండ్రులు, సోదరులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాధ్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు పోలా వెంకటరమణారెడ్డిలు మృతదేహాన్ని సంద ర్శించి తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
అలాగే ప్రభుత్వ హైస్కూల్ హెచ్‌ఎం ఏ.శంకర్‌రాజు, ఫిజికల్ డెరైక్టర్ ఎస్.షామీర్‌బాషా, ఉపాధ్యాయ బృందం అన్వర్ మృతదేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. ఫిజికల్ డెరైక్టర్ ఎస్.షామీర్‌బాషాకు అన్వర్ ప్రియ శిష్యుడు కావడంతో మృతదేహాన్ని చూసి ఆయన తట్టుకోలేక పోయారు. ఇటీవల చెన్నైలో జరిగిన బాల్‌బ్యాడ్మింటన్ జాతీయ స్థాయి పోటీల్లో అన్వర్ బంగారు పతకాన్ని సాధించాడని, మంచి క్రీడాకారుడిని కోల్పోయామని షామీర్‌బాషా కన్నీరు, మున్నీరయ్యారు.
అన్వర్ మృతికి సంతాప సూచికంగా ప్రభుత్వ హైస్కూల్‌కు సెలవు ప్రకటించారు. అన్వర్ మృతదేహానికి నివాళులు అర్పించిన వారిలో వైఎస్సార్ సీపీ నాయకులు ఎస్‌ఆర్ .యూసఫ్, ఎస్.జాకీర్‌హుస్సేన్, దండు గోపీ, జీ.హుస్సేన్‌లు ఉన్నారు. ఇదిలావుండగా ఇటీవల ప్రభుత్వ జూని యర్ కళాశాలలో జరిగిన ఓ సంఘటనకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.రమణరాజు అన్వర్‌పై కేసు నమోదు చేయించడంతో ప్రభుత్వ హైస్కూల్ ఉపాధ్యాయులు మృతదేహం వద్దకు వచ్చిన సమయంలో బంధువులు రమణరాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.