Tenth student killed
-
మద్యం మత్తులో కారుతో ఢీకొట్టి.. ఇనుపరాడ్డుతో దాడి
ప్రత్తిపాడు: చికెన్ పకోడి బడ్డీ వద్ద జరిగిన స్వల్ప వివాదం ఓ బాలుడి మృతికి కారణమైంది. వివరాలివి..తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వీరవరంలోని జెడ్పీ స్కూల్ సమీపంలో సింగం ఏసు చికెన్ పకోడి బడ్డీ పెట్టుకుని బతుకుతున్నాడు. ఇతడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పదో తరగతి చదివే కుమారుడు శివ (15) రోజూ తండ్రి బడ్డీ వద్ద చేదోడు వాదోడుగా ఉంటుంటాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి అదే గ్రామానికి చెందిన కొవ్వూరి వీరబాబు మద్యం మత్తులో బడ్డీ వద్దకు వచ్చాడు. చిన్న విషయంలో ఏసుతో తగవు పడ్డాడు. కోపోద్రిక్తుడైన వీరబాబు తన కారుతో బడ్డీని ఢీకొట్టాడు. అక్కడితో ఆగకుండా ఇనుపరాడ్డుతో ఏసు..అతని కుమారుడిపై దాడి చేసి గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన శివను కాకినాడ తరలించగా అర్ధరాత్రి మృతి చెందాడు. పోలీసులు వీరవరంలో పికెట్ ఏర్పాటు చేశారు. పెద్దాపురం డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు గ్రామంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. కిర్లంపూడి ఎస్ఐ ఎస్.అప్పలరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని అరెస్టు చేయాల్సి ఉంది. -
కర్నూలు లైంగికదాడి కేసు సీబీఐకి..
కర్నూలు: కర్నూలు శివారులోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో 2017లో జరిగిన పదోతరగతి విద్యార్థిని లైంగికదాడి, హత్య అభియోగాలు ఉన్న కేసును సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేసినట్లు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థిని తల్లిదండ్రులు రాష్ట్ర హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ను కలిసి న్యాయం చేయాల్సిందిగా గత ఏడాది ఆగస్టులో వినతిపత్రం సమర్పించారన్నారు. ఈ నేపథ్యంలో అదే ఏడాది అక్టోబర్ 21వ తేదీన కేసు తదుపరి దర్యాప్తునకు ఆదేశాలు వచ్చాయన్నారు. అప్పటికే కేసు ట్రయల్‌లో ఉన్నప్పటికీ కోర్టులో జడ్జి అనుమతి తీసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. నిజాలను వెలికి తీయాలనే ఉద్దేశంతో అడిషనల్ ఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అత్యాధునిక సాంకేతిక సహాయంతో దర్యాప్తు చేపట్టిందన్నారు. అయితే కేసును సీబీఐకి అప్పగించాలన్న బాధితురాలి కుటుంబీకులు, దళిత సంఘాల డిమాండ్‌తో డీజీపీ సానుకూలంగా స్పందించి తగిన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను సీబీఐ దర్యాప్తునకు అప్పగించాల్సిందిగా సిఫారసు చేస్తూ డీజీపీకి నివేదించగా తదుపరి చర్యల నిమిత్తం వాటిని హోం సెక్రటరీకి పంపినట్లు ఎస్పీ వెల్లడించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ కరస్పాండెంట్ వల్లపురెడ్డి జనార్దన్‌రెడ్డి, ఆయన కుమారులు హర్షవర్ధన్‌రెడ్డి, దివాకర్‌రెడ్డిలపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు ఐపీసీ 302, 201 సెక్షన్ల కింద అప్పట్లో కేసు నమోదు చేశారు. -
జీవితంలో ఓడి..‘పరీక్ష’లో పాసై..!
♦ ఫలితాల ముందు రోజే ప్రమాదంలో టెన్త్ విద్యార్థి దుర్మరణం ♦ 8.3 జీపీఏ సాధించిన విద్యార్థి ధరూరు: జీవితంలో ఓడిపోయిన ఓ విద్యార్థి పదో తరగతి పరీక్షలో మాత్రం పాసయ్యాడు. 8.3 జీపీఏ సాధిం చిన అతడు ఫలితాలకు ఒక రోజు ముందు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. బుధవారం ఫలితాలను చూసుకుని కుటుంబమంతా మురిసిపోయి సంబురం చేసుకోవాల్సిన సమయంలో తీవ్ర విషాదం నెలకొంది. మహబూబ్‌నగర్ జిల్లా ధరూరు రంగాపురం గ్రామానికి బి.ఆంజనేయులు ధరూరు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివాడు. మార్చిలో పరీక్షలు రాశాడు. మంగళవారం మహబూబ్‌నగర్‌లో టీఎస్ ఆర్జేసీ ప్రవేశ పరీక్ష రాసేందుకు బైక్‌పై వెళ్తూ మార్గమధ్యలో ధరూ రు శివారులో రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అయితే బుధవారం వెలువడిన ఫలితాల్లో ఆంజనేయులు 8.3 జీపీఏ సాధించాడు. తమ కుమారుడు పాసయ్యాడన్న విషయాన్ని తెలుసుకుని కుటుంబసభ్యులు గండెలవిసేలా రోదించారు. -
రోడ్డు ప్రమాదంలో టెన్త్ విద్యార్థి మృతి
జానీబాషాపురంలో విషాధ ఛాయలు రాజంపేట టౌన్: కడపలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టెన్త్ విద్యార్థి షేక్ అన్వర్ బాషా (16) మృతి చెందాడు. రాజంపేట పట్టణం జానీబాషాపురంకు చెందిన అన్వర్‌బాషా ప్రభుత్వ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం కడపలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతదేహాన్ని బంధువులు బుధవారం జానీబాషాపురంకు తీసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆ గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. మృతదేహం స్వగృహానికి చేరగానే తల్లిదండ్రులు, సోదరులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాధ్రెడ్డి, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు పోలా వెంకటరమణారెడ్డిలు మృతదేహాన్ని సంద ర్శించి తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే ప్రభుత్వ హైస్కూల్ హెచ్ఎం ఏ.శంకర్రాజు, ఫిజికల్ డెరైక్టర్ ఎస్.షామీర్‌బాషా, ఉపాధ్యాయ బృందం అన్వర్ మృతదేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. ఫిజికల్ డెరైక్టర్ ఎస్.షామీర్‌బాషాకు అన్వర్ ప్రియ శిష్యుడు కావడంతో మృతదేహాన్ని చూసి ఆయన తట్టుకోలేక పోయారు. ఇటీవల చెన్నైలో జరిగిన బాల్‌బ్యాడ్మింటన్ జాతీయ స్థాయి పోటీల్లో అన్వర్ బంగారు పతకాన్ని సాధించాడని, మంచి క్రీడాకారుడిని కోల్పోయామని షామీర్‌బాషా కన్నీరు, మున్నీరయ్యారు. అన్వర్ మృతికి సంతాప సూచికంగా ప్రభుత్వ హైస్కూల్‌కు సెలవు ప్రకటించారు. అన్వర్ మృతదేహానికి నివాళులు అర్పించిన వారిలో వైఎస్సార్ సీపీ నాయకులు ఎస్ఆర్ .యూసఫ్, ఎస్.జాకీర్‌హుస్సేన్, దండు గోపీ, జీ.హుస్సేన్‌లు ఉన్నారు. ఇదిలావుండగా ఇటీవల ప్రభుత్వ జూని యర్ కళాశాలలో జరిగిన ఓ సంఘటనకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.రమణరాజు అన్వర్‌పై కేసు నమోదు చేయించడంతో ప్రభుత్వ హైస్కూల్ ఉపాధ్యాయులు మృతదేహం వద్దకు వచ్చిన సమయంలో బంధువులు రమణరాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.