తీవ్రవాదుల ఇల్లు సోదా
Published Mon, Oct 7 2013 3:27 AM | Last Updated on Sat, Aug 11 2018 8:11 PM
పుత్తూరు, న్యూస్‌లైన్: పట్టణంలోని మేదరవీధిలో నివాసం ఉన్న తీవ్రవాదులు బిలాల్, ఇస్మాయిల్ ఇంటిని ఆదివారం ఉదయం పుత్తూరు డీఎస్పీ ఆరీఫుల్లా, సీఐ చంద్రశేఖర్‌ల బృందం సోదా చేశారు. పుత్తూరులో శనివారం ఆంధ్ర, తమిళనాడు పోలీసులు జరిపిన ఆపరేషన్‌లో తీవ్రవాదులు పట్టుబడిన విషయం తెలిసిందే. వీరిని పట్టుకోవడానికి తమిళనాడు పోలీసులు ఆంధ్ర పోలీసుల సాయం తీసుకున్నారు. అనంతరం తీవ్రవాదులను చెన్నైకి తరలించారు. కాగా తీవ్రవాదుల్లో ప్రధాన సూత్రదారి ఫక్రుద్దీన్ మేదరవీధికి పక్కవీధిలో మేడపై నివాసం ఉండేవాడు. ఆ ఇంటిని శనివారం సాయంత్రం ఆంధ్రపోలీసులు తనిఖీ చేసి అక్కడున్న పేలుడు పదార్థాల విడిభాగాలు, ఇతర వస్తు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో మేదరవీధిలో నివాసముండిన బిలాల్ ఇంటిని డీఎస్పీ ఆరీఫుల్లా తనిఖీ చేశారు. వంటగదిని, హాల్‌ను, పడకగదిని సోదా చేశారు. అక్కడున్న గ్యాస్ సిలిండర్, వివిధ వస్తువులు, టీవీ, తమిళంలో ఉన్న ఖురాన్(పుస్తకం) స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులను పట్టుకోవడానికి వచ్చిన తమిళనాడు సీఐ లక్ష్మణ్‌పై దాడి జరిగిన ముఖద్వారం వద్ద పరిశీలించారు. సీఐపై దాడికి ఉపయోగించిన రాడ్డు, ఇనుప కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఇంటికి సంబంధించి నమూనా రూపొందించి ఉగ్రవాదులు ఆ ఇంటిలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టారన్న అంశాలపై ఆరాతీశారు. ఆ ఇంటిలో చిందరవందరగా పడవేసిన దుస్తులు, తమిళ దినపత్రికలు, మిగిలిన వస్తువులను అక్కడే ఉంచి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తీవ్రవాదులతో సంబంధాలు ఉన్న ఎవరైనా ఆ ప్రదేశంలో అనుమానంగా సంచరిస్తున్నట్లయితే అదుపులోకి తీసుకోవాల్సిందిగా డీఎస్పీ పోలీసులను ఆదేశించారు.
Advertisement
Advertisement