
టెట్ అభ్యర్థులంతా బిక్కమొహం వేశారు. తొలిసారిగా ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించడంతో అవగాహన లేనివారంతా ఇబ్బందులు పడ్డారు. చాలా మందికి కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడంతో ఒకరి మొహం మరొకరు చూసుకున్నారు. ఇక హిందూపురం కేంద్రంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో గంటన్నర ఆలస్యంగా పరీక్ష ప్రారంభమైంది.
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) బుధవారం ప్రారంభమైంది. జిల్లాలో ఆరు కేంద్రాలతో పాటు బెంగళూరు నగరంలోని 9 కేంద్రాలను జిల్లా విద్యాశాఖ పర్యవేక్షిస్తోంది. తొలిరోజు 79 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 1,639 మంది అభ్యర్థులకు గాను 1,560 మంది హాజరయ్యారు. వీరిలో అనంతపురం జిల్లాలో 703 మందికి గాను 681 మంది హాజరయ్యారు. 22 మంది గైర్హాజరయ్యారు. అలాగే బెంగళూరులో 936 మందికి గాను 879 మంది హాజరయ్యారు. 57 మంది గైర్హాజరయ్యారు.
హిందూపురంలో గంటన్నర ఆలస్యంగా...
హిందూపురం పట్టణంలోని సప్తగిరి కళాశాల కేంద్రంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో కొందరి విద్యార్థులు గంటన్నర ఆలస్యంగా పరీక్ష మొదలు పెట్టారు. అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. వీరికి గడువు సమయం పొడిగించి రాయించారు. జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దనాచార్యులు, జిల్లా పరిశీలకులు జనార్దన్‌రెడ్డి, కేంద్రాల పర్యవేక్షులు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ వివిధ సెంటర్లను పరిశీలించారు.
రెండు కేంద్రాల్లో అభ్యర్థులు లేరు
జిల్లాలో ఆరు కేంద్రాలుండగా తొలిరోజు రెండు కేంద్రాల్లో అభ్యర్థులనే కేటాయించలేదు. రాప్తాడు మండలం హంపాపురం వద్దనున్న ఎస్వీఐటీ కళాశాల, గుత్తి గేట్స్ కళాశాల కేంద్రాల్లో ఒక్క అభ్యర్థీ పరీక్ష రాయలేదు. షిర్డీసాయి ఇంజినీరింగ్ కళాశాలలోనూ కేవలం 50 మందిని మాత్రమే కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment