
కేసీఆర్ విజయవాడ వస్తే.. తాటతీస్తాం: టీజీ వెంకటేశ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ వస్తే ఆయన తాట తీస్తామని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు టీజీ వెంకటేశ్ అన్నారు. విజయవాడలో సభ నిర్వహించి.. చంద్రబాబు రైతులను మోసగిస్తున్న వైనాన్ని ఆంధ్ర రైతులకు వివరిస్తానని కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనీ వ్యాఖ్యలు చేశారు. విజయవాడతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్రలో సమ్మర్, వింటర్ రాజధానులను ఏర్పాటుచేయాలని ఆయన అన్నారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమలో రాజధానులను ఏర్పాటుచేయాలని, అవి లేని పక్షంలో మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముక్కలవుతుందని టీజీ వెంకటేశ్ అన్నారు. తెలంగాణలో కూడా హైదరాబాద్ నగరంతో పాటు మరో రాజధాని అవసరమని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ను దేశ రెండో రాజధాని చేసేలా ఉద్యమం కొనసాగిస్తామన్నారు. రెండు ప్రాంతాల్లో రాజధానుల కోసం జనవరిలో రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల పోరాట వేదికను ఏర్పాటు చేస్తామని టీజీ వెంకటేశ్ చెప్పారు.