ఉదయగిరి: ఇంటర్మీడియట్ పరీక్షల్లో చూచిరాతలు జోరుగా సాగుతున్నాయి. ఇన్విజిలేటర్లు, సిట్టింగ్ స్క్వాడ్‌లు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఉన్నప్పటికీ...కాపీయింగ్‌ను ఎంతమాత్రం ఆపలేకపోతున్నాయి. జిల్లాలో 94 పరీక్ష కేంద్రాలలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 57,385 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఈ కేంద్రాల్లో ఎక్కడా అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు ఆర్‌ఐఓ పరంధామయ్య చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయి లో అందుకు భిన్నంగా పరీక్షలు సాగుతున్నాయి. కార్పొరేట్ కళాశాలలు ఇన్విజిలేటర్లను, అధికారులను ప్రలోభాలకు గురిచేసి తమ విద్యార్థులకు సహకరించేలా చూస్తున్నాయి.
ఉదయగిరిలో ఏ, బీ కేంద్రాల్లో 700 మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఈ పరీక్ష కేంద్రాల్లో సీతారామపురం, ఉదయగిరి మండలాలకు సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులున్నారు. ఈ కేంద్రంలో పరీక్ష ప్రారంభం రోజు నుంచి కాపీయింగ్ జోరుగా సాగుతున్నట్లు విమర్శలున్నాయి. పైగా ఈకేంద్రంలో జిల్లాలో ఎక్కడా లేనివిధంగా అత్యధికంగా 18 మంది పైగా ఇప్పటికే విద్యార్థులు డిబార్ కావడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ముఖ్యంగా పరీక్ష ప్రారంభానికి పది నిమిషాలకు ముందే ప్రశ్నాపత్రాల్లో ఉన్న ప్రశ్నలు బయటకు చేరవేస్తున్నారు.
బయట సమాధానాలు తయారుచేసి పరీక్ష ప్రారంభమైన పదినిమిషాల్లోపే కేంద్రంలోనికి చిట్టీలు చేరుతున్నాయి. కొంతమంది యువకులు నేరుగా పరీక్ష కేంద్రం లోపలకే వెళ్లి కొన్ని గదుల్లో విద్యార్థుల చేతికే చిట్టీలు అందిస్తున్నారు. మరికొంతమంది యువకులు ప్రహరీ ఎక్కి చిట్టీలు గదుల్లోకి విసిరేస్తున్నారు. ఈ తతంగం బహిరంగంగానే జరుగుతున్నా అటు పోలీసులు కానీ, ఇటు నిర్వాహకులు గానీ పట్టించుకోకపోవడం గమనార్హం.
నిబంధనలు గాలికి..
పరీక్ష కేంద్రం చుట్టూ 144 సెక్షన్ అమలులో ఉంటుంది. దాదాపు వందమీటర్ల వరకు ఎవరూ గుంపుగా ఉండే అవకాశం ఉండదు. కానీ పరీక్ష కేంద్రం చుట్టూ ప్రహరీగోడ వెంబడి ఐదు మీటర్ల దూరంలోనే కొంతమంది ప్రశ్నాపత్రాలకు జవాబులు తయారుచేసి గదుల్లోకి పంపిస్తున్నారు. ఇది బహిరంగంగా జరుగుతున్నప్పటికీ పోలీసులు కనీసం కిమ్మనడం లేదు. సోమవారం జరిగిన సీనియర్ ఇంటర్ ఫిజిక్స్ పరీక్షలో చూచిరాతలు బ్రహ్మాండంగా సాగాయి. పరీక్ష నిర్వహణ తీరుపై ‘సాక్షి’ నిఘా పెట్టగా ఈ వ్యవహారం స్పష్టంగా కనిపించింది.
పరీక్ష అయిపోయిన వెంటనే రెండు పరీక్ష కేంద్రాల కిటికీల వద్ద ఇబ్బడిముబ్బడిగా చిట్టాలు పడివుండటం కనిపించింది. అంతేకాకుండా బి-పరీక్ష కేంద్రంలోని రూం నం.9లో 12 గంటలకు పరీక్ష సమయం అయిపోయినప్పటికీ ఇన్విజిలేటరు 12.10 గంటల వరకు విద్యార్థులను అక్కడే ఉంచి పరీక్షలు రాయించారు. ఈ పది నిమిషాల సమయంలో కూడా కొన్ని ప్రశ్నలకు జవాబులు బయటినుంచి విద్యార్థులు తెచ్చి ఇవ్వడం కనిపించింది.
అధికారుల తీరుపై అనుమానం:
ఈ కేంద్రంలో జరుగుతున్న తీరును పరిశీలిస్తే ఇన్విజిలేటర్లు, చీఫ్‌లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, సిట్టింగ్ స్క్వాడ్ అధికారులు, పోలీసులు పరస్పర సహకారంతోనే ఈ తతంగం నడిపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బయటి వ్యక్తులు పరీక్షలు జరిగే సమయంలో నేరుగా గదుల్లోకి వెళ్లి చిట్టీలు అందిస్తున్నారంటే..వీరి సహకారం లేకుండా అది జరిగేది కాదనేది ముమ్మాటికీ నిజం.
ఇంతవరకు డిబార్ అయినవారి వివరాలు:
ఉదయగిరి సెంటర్‌లో 16 మంది, దుత్తలూరులో ఒకరు, కోటలో ముగ్గురు, పొదలకూరులో ఒకరు చొప్పున డిబారయ్యారు.
చూసి రాసుకో...
Published Tue, Mar 24 2015 2:47 AM | Last Updated on Thu, Jul 11 2019 5:37 PM
Advertisement