intermediate tests
-
ఏపీలో అడ్డగోలుగా ఇంటర్ పరీక్షలు
అర్ధవీడు: ఏపీలోని ప్రకాశం జిల్లాలో మండల కేంద్రమైన అర్ధవీడు ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ పరీక్షలు మూడు స్లిప్పులు.. ఆరు సమాధానాలు అన్నట్లు సాగుతున్నాయి. పరీక్ష మొదలైన 20 నిమిషాలకే అధ్యాపకులు ప్రశ్నపత్రాన్ని బయటకు తెప్పించుకుని కార్బన్ పేపరు ఉపయోగించి స్లిప్పులు రాసి విద్యార్థులకు పంపుతున్నారు. ఈ విషయమై సమాచారం అందిన ‘సాక్షి’ విలేకరి గురువారం పరీక్ష కేంద్రానికి వెళ్లగా లెక్కలు-1బి ప్రశ్నపత్రానికి ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్టాఫ్ రూంలో కాంట్రాక్టు అధ్యాపకులు డానియేలు, రాజు, జూనియర్ లెక్చరర్ వనిపాల్‌రెడ్డి కార్బన్ పేపర్లు పెట్టి జవాబులు రాస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే గదిలోనుంచి పరారయ్యారు. పరీక్షల చీఫ్ అయిన ప్రిన్సిపాల్ కుటుంబరావు, డిపార్ట్మెంటల్ అధికారి బి.శివలక్ష్మి కనుసన్నల్లో ఈ వ్యవహారం జరుగుతోందని, దీనికి ఆ ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు కూడా సహకరిస్తున్నారని ఆరోపణలున్నాయి. మరెలా పాస్ అవుతారు: ప్రిన్సిపాల్ మాస్ కాపీయింగ్ జరుగుతున్న తీరుపై ప్రిన్సిపాల్ కుటుంబరావును ‘సాక్షి’ అడగగా మారుమూల ప్రాంతంలో కాపీలు జరగకపోతే ఎలా పాస్ అవుతారు అని ప్రశ్నించారు. వెంటనే నాలుక్కరచుకొని ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం పరీక్షలు పకడ్బందీగా జరుగుతున్నాయని చెప్పారు. -
చూసి రాసుకో...
ఉదయగిరి: ఇంటర్మీడియట్ పరీక్షల్లో చూచిరాతలు జోరుగా సాగుతున్నాయి. ఇన్విజిలేటర్లు, సిట్టింగ్ స్క్వాడ్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు ఉన్నప్పటికీ...కాపీయింగ్‌ను ఎంతమాత్రం ఆపలేకపోతున్నాయి. జిల్లాలో 94 పరీక్ష కేంద్రాలలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 57,385 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఈ కేంద్రాల్లో ఎక్కడా అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు ఆర్ఐఓ పరంధామయ్య చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయి లో అందుకు భిన్నంగా పరీక్షలు సాగుతున్నాయి. కార్పొరేట్ కళాశాలలు ఇన్విజిలేటర్లను, అధికారులను ప్రలోభాలకు గురిచేసి తమ విద్యార్థులకు సహకరించేలా చూస్తున్నాయి. ఉదయగిరిలో ఏ, బీ కేంద్రాల్లో 700 మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఈ పరీక్ష కేంద్రాల్లో సీతారామపురం, ఉదయగిరి మండలాలకు సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులున్నారు. ఈ కేంద్రంలో పరీక్ష ప్రారంభం రోజు నుంచి కాపీయింగ్ జోరుగా సాగుతున్నట్లు విమర్శలున్నాయి. పైగా ఈకేంద్రంలో జిల్లాలో ఎక్కడా లేనివిధంగా అత్యధికంగా 18 మంది పైగా ఇప్పటికే విద్యార్థులు డిబార్ కావడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ముఖ్యంగా పరీక్ష ప్రారంభానికి పది నిమిషాలకు ముందే ప్రశ్నాపత్రాల్లో ఉన్న ప్రశ్నలు బయటకు చేరవేస్తున్నారు. బయట సమాధానాలు తయారుచేసి పరీక్ష ప్రారంభమైన పదినిమిషాల్లోపే కేంద్రంలోనికి చిట్టీలు చేరుతున్నాయి. కొంతమంది యువకులు నేరుగా పరీక్ష కేంద్రం లోపలకే వెళ్లి కొన్ని గదుల్లో విద్యార్థుల చేతికే చిట్టీలు అందిస్తున్నారు. మరికొంతమంది యువకులు ప్రహరీ ఎక్కి చిట్టీలు గదుల్లోకి విసిరేస్తున్నారు. ఈ తతంగం బహిరంగంగానే జరుగుతున్నా అటు పోలీసులు కానీ, ఇటు నిర్వాహకులు గానీ పట్టించుకోకపోవడం గమనార్హం. నిబంధనలు గాలికి.. పరీక్ష కేంద్రం చుట్టూ 144 సెక్షన్ అమలులో ఉంటుంది. దాదాపు వందమీటర్ల వరకు ఎవరూ గుంపుగా ఉండే అవకాశం ఉండదు. కానీ పరీక్ష కేంద్రం చుట్టూ ప్రహరీగోడ వెంబడి ఐదు మీటర్ల దూరంలోనే కొంతమంది ప్రశ్నాపత్రాలకు జవాబులు తయారుచేసి గదుల్లోకి పంపిస్తున్నారు. ఇది బహిరంగంగా జరుగుతున్నప్పటికీ పోలీసులు కనీసం కిమ్మనడం లేదు. సోమవారం జరిగిన సీనియర్ ఇంటర్ ఫిజిక్స్ పరీక్షలో చూచిరాతలు బ్రహ్మాండంగా సాగాయి. పరీక్ష నిర్వహణ తీరుపై ‘సాక్షి’ నిఘా పెట్టగా ఈ వ్యవహారం స్పష్టంగా కనిపించింది. పరీక్ష అయిపోయిన వెంటనే రెండు పరీక్ష కేంద్రాల కిటికీల వద్ద ఇబ్బడిముబ్బడిగా చిట్టాలు పడివుండటం కనిపించింది. అంతేకాకుండా బి-పరీక్ష కేంద్రంలోని రూం నం.9లో 12 గంటలకు పరీక్ష సమయం అయిపోయినప్పటికీ ఇన్విజిలేటరు 12.10 గంటల వరకు విద్యార్థులను అక్కడే ఉంచి పరీక్షలు రాయించారు. ఈ పది నిమిషాల సమయంలో కూడా కొన్ని ప్రశ్నలకు జవాబులు బయటినుంచి విద్యార్థులు తెచ్చి ఇవ్వడం కనిపించింది. అధికారుల తీరుపై అనుమానం: ఈ కేంద్రంలో జరుగుతున్న తీరును పరిశీలిస్తే ఇన్విజిలేటర్లు, చీఫ్‌లు, డిపార్ట్మెంటల్ అధికారులు, సిట్టింగ్ స్క్వాడ్ అధికారులు, పోలీసులు పరస్పర సహకారంతోనే ఈ తతంగం నడిపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బయటి వ్యక్తులు పరీక్షలు జరిగే సమయంలో నేరుగా గదుల్లోకి వెళ్లి చిట్టీలు అందిస్తున్నారంటే..వీరి సహకారం లేకుండా అది జరిగేది కాదనేది ముమ్మాటికీ నిజం. ఇంతవరకు డిబార్ అయినవారి వివరాలు: ఉదయగిరి సెంటర్లో 16 మంది, దుత్తలూరులో ఒకరు, కోటలో ముగ్గురు, పొదలకూరులో ఒకరు చొప్పున డిబారయ్యారు. -
నా చిట్టి తల్లికి ఏమయ్యింది..?
తిరుపతిక్రైం: ‘‘పరీక్షలు బాగా రాస్తున్నా ను.. నాన్నా.. అని ముందు రోజు ఫోన్ చేసింది. మరుసటి రోజు ఆత్మహత్యకు పాల్పడింది.. ఇంతలో నా చిట్టి తల్లికి ఏమయ్యింది’’ ఓ ప్రైవేట్ కాలేజీ భ వంతి పైనుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న రేవతి తల్లి దండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. తిరుపతి వెస్ట్ డీఎస్పీ శ్రీనివాసులు, ఎమ్మార్‌పల్లి సీఐ షరీఫుద్దీన్ తెలిపిన వివరాల మేరకు పులిచర్ల మండలం బాలిరెడ్డిగారిపల్లెకు చెందిన ఎ.వెంకటరెడ్డి, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె ఎ.రేవతి(17) రూరల్ మండలం తుమ్మలగుంట సమీపంలోని ఉప్పరపల్లెలో ఓ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. కొన్ని రోజులుగా ఇంటర్మీడియెట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో రేవతి స్థానిక పద్మావతి కళాశాలలో జరుగుతున్న పరీక్షలకు ప్రతిరోజూ హాజరవుతోంది. శుక్రవారం ఉదయం కూడా పరీక్షకు హాజరైంది. పరీక్ష ముగిసిన తరువాత కళాశాలకు చేరుకుని భోజనం చేసి, గదిలోని తోటి విద్యార్థులతో కలసి కొంత సేపు ఆట విడుపుగా ఉంది. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో స్టడీ అవర్స్ ఉండడంతో విద్యార్థులందరూ మొదటి అంతస్తులోని తరగతి గదికి వెళ్లారు. అయితే రేవతి మాత్రం బిల్డింగ్‌లోని మూడో అంతస్తుపైన పిట్టగోడ పైకి ఎక్కి కూర్చుని, అక్కడి నుంచి కిందకు దూకేసింది. దీన్ని గుర్తించిన కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. రేవతిని చికిత్సకోసం రుయా ఆస్పత్రిలోని అత్యవసర విభాగానికి తరలించారు. అయితే డాక్టర్లు పరీక్షించి అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు చెప్పారు. కళాశాల యాజమాన్యం పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారం అందించా రు. సంఘటనా స్థలానికి వెస్ట్ డీఎస్పీ శ్రీనివాసులు, ఎమ్మార్‌పల్లి సీఐ షరీఫుద్దీన్, సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. ఈ ఆత్మహ త్య గురించి కూడా విచారించిగా రేవతి పరీక్షలు సరిగా రాయలేదని ఆందోళనలో ఉన్నట్లు సహచర విద్యార్థినులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులకు కడుపుకోత రేవతి(16) మృతి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు వెంకటరెడ్డి, లక్ష్మీదేవి, హుటాహుటిన రుయా ఆస్పత్రి మార్చురీ వద్దకు చేరుకున్నారు. కుమా ర్తె మృతదేహం వద్ద కన్నీరు మున్నీరు గా విలపించారు. గురువారం సాయంత్రం ఫోన్ చేసి ‘పరీక్షలు బాగా రాస్తున్నాను నాన్నా’ అని చెప్పిన తన కుమార్తెకు అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి అంటూ తల్లి విలపించడం అక్కడి వారి ని కలచివేసింది. మృతురాలి తండ్రి మాట్లాడుతూ ఈ ఆత్మహత్యపై పలు అనుమానాలున్నాయని ఆరోపించారు. పెద్దిరెడ్డి పరామర్శ మెడికల్ కళాశాల మార్చురీ వద్దకు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేరుకున్నారు. మృతురాలి తల్లిదండ్రులను ఆయన ఓదార్చారు. కళాశాల యాజమాన్యంతో మాట్లాడి, ఈ సంఘటన పై ఆరా తీస్తామన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కాలేజీ సిబ్బందికి సూచించారు. విద్యార్థి సంఘాల ఆందోళన సంఘటనా స్థలానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సీపీ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కళాశాల నిర్లక్ష్యంతోనే ఇలాంటి సంఘటనలు చో టు చేసుకుంటున్నాయన్నారు. కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని ఇంటర్మీడియెట్ బోర్డును డిమాండ్ చేశారు. విచారణ జరిపి నిందితులు ఎవరైనా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కళాశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందులో వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు జాఫర్ ఉన్నారు. -
పరీక్షలు ప్రశాంతం
తొలిరోజు 48,870మంది హాజరు రెండు కేంద్రాల్లో నేలపై అవస్థలు 48 కేంద్రాల్లో తనిఖీలు.. ఒకరు డిబార్ నేటి నుంచి ఇంటర్ సెకండియర్‌కు... పెదవాల్తేరు (విశాఖపట్నం) : ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు విద్యార్థులు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది నేలబారు పరీక్షలకు తావు లేకుండా పక్కా ఏర్పాట్లు చేసినప్పటికీ ఏజెన్సీలోని రెండు కేంద్రాల్లో విద్యార్థులు నేలపైనే పరీక్షలు రాశారు. అర్బన్‌లో ఆ పరిస్థితి లేనప్పటికీ విద్యార్థులు ఇరుకు గదులతో ఇబ్బంది పడ్డారు. తక్కువ కెపాసిటీ ఉన్న కళాశాలలకు ఎక్కువమంది విద్యార్థులను కేటాయించడంతో ఈ పరిస్థితి వచ్చింది. గదులు చాలకపోవడంతో ఆరుబయట కుర్చీలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. నగరంలోని నాలుగు కళాశాలల్లో ఈ సమస్య ఎదురైంది. మరుసటి రోజు నుంచి ఇలాంటి పరిస్థితి రాకుండా అదనపు గదులు కేటయించాలని ఇంటర్ బోర్డు అధికారులు పరీక్ష కేంద్రాల యాజమాన్యాలను ఆదేశించారు. తొలి రోజు నిర్వహించిన భాషా పరీక్షకు 48,870 మంది విద్యార్థులు హాజరయ్యారు. 2,457మంది హాజరు కాలేదు. ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ఒక విద్యార్థిని డిబార్ చేశారు. జిల్లావ్యాప్తంగా 111 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా 48 కేంద్రాలను ప్రత్యేక బృందాలు తనిఖీలు చేశాయి. ఇంటర్‌బోర్డు 14 మందిని తనిఖీ బృందాల్లో నియమించ గా జిల్లా కలెక్టర్ ఇంజినీరింగ్ శాఖకు చెందిన 14 మందిని తనిఖీ బృందాలుగా నియమించారు. వీరంతా పరీక్షలను పర్యవేక్షించారు. అంతేకాకుండా హై పవర్ కమిటీ, డెక్ కన్వీనర్లు, డీవీఈవో, ఆర్ఐవో, పోలీస్ బృందాలు కూడా తనిఖీలు నిర్వహించాయి. గురువారం నుంచి ద్వితీయ సంవ త్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లావ్యాప్తంగా 111 పరీక్ష కేంద్రాల్లో వీరు పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలను కూడా ఇంటర్ బోర్డు, జిల్లా కలెక్టర్ నియమించిన ప్రత్యేక తనిఖీ బృందాలు పర్యవేక్షించనున్నాయి. ఈ పరీక్షలకు 50.567మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ట్రాఫిక్ టెన్షన్ ఇంటర్ విద్యార్థులను ట్రాఫిక్ టెన్షన్ వెంటాడింది. సమయానికి పరీక్ష కేంద్రానికి వెళ్తామో లేదోనని ఆందోళన పడ్డారు. ఆర్టీసీ కాంప్లెక్స్, ద్వారకానగర్, డాబాగార్డెన్స్ వంటి రద్దీ ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలకు వెళ్లాల్సిన విద్యార్థులు ఉదయం ట్రాఫిక్‌లో ఇరుక్కున్నారు. కార్పొరేట్ కళాశాలల విద్యార్థులు కార్లలో, మధ్యతరగతి విద్యార్థులు ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో రావడంతో రద్దీ ఎక్కువైంది. సాధారణ సమయాల్లోనే రద్దీగా ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్, డాబాగార్డెన్స్, ద్వారకానగర్ ఏరియాలు పరీక్షల కారణంగా మరింత ర ద్దీగా మారాయి. ట్రాఫిక్‌ను తప్పించుకుని పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి విద్యార్థులు ఉరుకులు, పరుగులు తీశారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. -
ఇంటర్ పరీక్షలకు రెడీ..
ఈ నెల 9 నుంచి 27 వరకు పరీక్షలు 188 కేంద్రాలు.. 1.41 లక్షల మంది విద్యార్థులు అన్ని ప్రాంతాల్లో అదనపు బస్సులు సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు హైదరాబాద్ జిల్లా అధికారయంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 9 నుంచి 27 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతుండటంతో... ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసేందుకు ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ నిర్మల ఆదేశాలిచ్చారు. జిల్లాలో 1,41,581 మంది పరీక్షలకు హాజరవనుండగా...188 కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగరంలోని సంజీవరెడ్డినగర్, మెహిదీపట్నం ,హిమాయత్‌నగర్, నారాయణగూడ, నల్లకుంట తదితర ప్రాంతాలలో పరీక్షా కేంద్రాలు అధికంగా ఉండటంతో.... అందుకు అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ, కేంద్రాల వద్ద నిఘా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు ఆయా కేంద్రాలకు నిర్ణీత సమయాని కంటె అరగంట ముందుగానే చేరుకునేందుకు వీలుగా తగిన సంఖ్యలో బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ కోరారు. ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. కాగా ఎండలు ముదురుతుండటంతో అన్ని పరీక్షా కేంద్రాలలో మెడికల్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఒకే చోట అధిక కేంద్రాలున్న ప్రాంతంలో అదనంగా ఏఎన్ఎమ్లను నియమించాలని భావిస్తున్నారు. -
ఎంసెట్ ఉమ్మడిగానే నిర్వహించాలి: ఏపీ ఏజీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఎంసెట్ పరీక్షలు ఉమ్మడిగానే నిర్వహించాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యామండలికి ఏపీ అడ్వకేట్ జనరల్ నివేదించినట్లు తెలిసింది. తెలంగాణ, ఏపీ మధ్య ఎంసెట్ వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఏజీ అభిప్రాయం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. గతంలో ఇంటర్మీడియట్ పరీక్షలను కూడా ఉమ్మడిగానే నిర్వహించాలని ఏపీ సర్కారు ప్రయత్నించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వేరుగా నిర్వహించేందుకే చర్యలు తీసుకున్నసంగతి తెలిసిందే. ఎంసెట్‌ను కూడా విడిగానే నిర్వహించాలని తెలంగాణ ఉన్నతవిద్యా మండలి ప్రభుత్వాన్ని కోరిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఎంసెట్ నిర్వహణకు ఎంతవరకు అవకాశం ఉందన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
‘ఉమ్మడి’తో విద్యార్థులకు మేలు: గంటా
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహిస్తే ఇరు రాష్ట్రాల విద్యార్థులకు మేలు కలుగుతుందని ఏపీ విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. పరీక్షను వేర్వేరుగా నిర్వహిస్తే ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలతోపాటు, జాతీయస్థాయి కాలేజీల ప్రవేశాల్లో విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటారన్నారు. ఆదివారం గవ ర్నర్‌తో గంటా భేటీ అయ్యారు. అనంతరం గంటా మాట్లాడుతూ వచ్చే నాలుగు రోజుల్లో పరీక్షలపై సానుకూల పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. -
కాస్త మెరుగు
నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఈ ఏడాది 25,320 మంది విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 13,330 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జిల్లావ్యాప్తంగా బాలికలదే పైచేయిగా నిలిచింది. 12,512 మంది బాలురు పరీక్షలు రాయగా 5,864 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత 47 శాతంగా నమోదయ్యింది. బాలికలు 12,808 మంది పరీక్షలకు హాజరుకాగా 7,466 మంది ఉత్తీర్ణత సాధించారు. 58 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ విభాగంలో జిల్లావ్యాప్తంగా 1,621 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 846 మంది పాసయ్యారు. 52 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ విభాగంలో గత ఏడాది 14 శాతమే ఉత్తీర్ణులవడం గమనార్హం. ఈ విభాగంలోనూ బాలికలదే పైచేయి. బాలురు 1,075 మంది పరీక్షలు రాయగా 479 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత 45 శాతం నమోదయ్యింది. బాలికలు 546 మంది పరీక్షలు రాయగా 366 మంది ఉత్తీర్ణులయ్యారు. 67 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం మెరుగుపడింది. గత ఏడాది 55 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ప్రస్తుతం 62.64 శాతం ఉత్తీర్ణులయ్యారు. -
డబ్బులిచ్చేయ్.. బిట్లు కొట్టేయ్..
ఇంటర్ పరీక్షల్లో యథేచ్ఛగా కాపీయింగ్ డబ్బులు తీసుకొని జవాబు బిట్లు అందిస్తున్న వైనం చిత్తూరు(టౌన్), న్యూస్‌లైన్: చిత్తూరు నగరంలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ పరీక్షల్లో కాపీయింగ్ యథేచ్ఛగా సాగుతోంది. ఈ మేరకు పరీక్షల నిర్వహణ సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల 12న ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. చిత్తూరులోని 14 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. వీటిలో 8 ప్రయివేటు పరీక్ష కేంద్రాలు. మిగిలినవి ప్రభుత్వ కళాశాలలు. రెండు, మూడు ప్రయివేటు కేంద్రాలు తప్పిస్తే మిగిలిన చోట్లంతా కాపీయింగ్ జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. పరీక్ష ప్రారంభమైన 15 నిమిషాలకే ప్రశ్నపత్రం బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. తర్వాత జవాబులను మైక్రో జెరాక్స్ చేయించి విద్యార్థులకు ఇస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.1000 నుంచి రూ.1500 వసూలు చేస్తున్నట్లు సమాచారం. పరీక్ష ప్రారంభమైన తర్వాత పరిసర ప్రాంతాల్లో విద్యార్థి తాలూకు వాళ్లు ఎవరూ ఉండకూడదనే నిబంధన ఉంది. ఇందుకు విరుద్ధంగా పలువురు పరీక్ష కేంద్రంలోకి వెళ్లి పని చక్కపెట్టుకుని వస్తున్నా పోలీసులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో పనిచేస్తున్న క్లర్క్‌లే ఈ తతంగాన్ని చేస్తున్నట్లు తెలిసింది. గిరింపేటలోని ఓ ప్రభుత్వ కళాశాలలో ప్రయివేటు వ్యక్తిని నియమించుకుని మరీ విద్యార్థులకు బిట్లు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కుమ్మక్కైన కళాశాలలు తమ విద్యార్థులను పాస్ చేయించేందుకు, అధిక మార్కులు తెప్పించుకునేందుకు నగరంలోని కొన్ని కళాశాలలు కుమ్మక్కైనట్లు తెలిసింది. మీ పరీక్ష కేంద్రంలోని మా విద్యార్థులకు సహకరించండి, మా పరీక్ష కేంద్రంలోని మీ విద్యార్థులకు సహకరిస్తాం అనే అవగాహనతో ముందుకెళుతున్నట్లు సమాచారం. క్లర్కులు విద్యార్థులకు బిట్లు ఇచ్చి వసూలు చేసిన డబ్బుల్లో ఇన్విజిలేటర్లకు భాగం ఇస్తున్నట్లు తెలిసింది. అధికారులకు తెలిసే.. ఇంటర్‌బోర్డు అధికారులకు తెలిసే ఇదంతా జరుగుతోం దని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పూతలపట్టులో కాపీయింగ్‌కు అనుమతించమని ఓ ఇన్విజిలేటర్‌ను ప్రయివేటు కళాశాల యాజమాన్యం అధికారులతో మాట్లాడి విధుల నుంచి తప్పించినట్లు తెలిసింది. డీఈసీ (జిల్లా పరీక్షల కమిటీ), హైపవర్ కమిటీలు నామమాత్రంగానే పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తున్నట్లు విమర్శలున్నాయి. -
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో ఈ నెల నుంచి ఏప్రిల్ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఇంటర్మీడియట్ బోర్డు సభ్యులు, విద్య, రెవెన్యూ, పోలీస్, ఆర్టీసీ, ట్రాన్స్‌కో, పోస్టల్, వైద్య శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి, కన్వీనర్ ఎల్.జె.జయశ్రీ మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి మార్చి 4 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు 164 కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు రెండో సెషన్ జరుగుతుందని తెలిపారు. మార్చి 12 నుంచి ఏప్రిల్ 1 వరకు రాత పరీక్షలు 111 పరీక్షా కేం ద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయని వివరించారు. 34 పరీక్షా పత్రాల స్టోరేజ్ కేం ద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 20 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను గుర్తించినట్లు వెల్లడించారు.