తొలిరోజు 48,870మంది హాజరు
రెండు కేంద్రాల్లో నేలపై అవస్థలు
48 కేంద్రాల్లో తనిఖీలు.. ఒకరు డిబార్
నేటి నుంచి ఇంటర్ సెకండియర్‌కు...
పెదవాల్తేరు (విశాఖపట్నం) : ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు విద్యార్థులు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది నేలబారు పరీక్షలకు తావు లేకుండా పక్కా ఏర్పాట్లు చేసినప్పటికీ ఏజెన్సీలోని రెండు కేంద్రాల్లో విద్యార్థులు నేలపైనే పరీక్షలు రాశారు. అర్బన్‌లో ఆ పరిస్థితి లేనప్పటికీ విద్యార్థులు ఇరుకు గదులతో ఇబ్బంది పడ్డారు. తక్కువ కెపాసిటీ ఉన్న కళాశాలలకు ఎక్కువమంది విద్యార్థులను కేటాయించడంతో ఈ పరిస్థితి వచ్చింది. గదులు చాలకపోవడంతో ఆరుబయట కుర్చీలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. నగరంలోని నాలుగు కళాశాలల్లో ఈ సమస్య ఎదురైంది. మరుసటి రోజు నుంచి ఇలాంటి పరిస్థితి రాకుండా అదనపు గదులు కేటయించాలని ఇంటర్ బోర్డు అధికారులు పరీక్ష కేంద్రాల యాజమాన్యాలను ఆదేశించారు. తొలి రోజు నిర్వహించిన భాషా పరీక్షకు 48,870 మంది విద్యార్థులు హాజరయ్యారు. 2,457మంది హాజరు కాలేదు. ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ఒక విద్యార్థిని డిబార్ చేశారు. జిల్లావ్యాప్తంగా 111 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా 48 కేంద్రాలను ప్రత్యేక బృందాలు తనిఖీలు చేశాయి.
ఇంటర్‌బోర్డు 14 మందిని తనిఖీ బృందాల్లో నియమించ గా జిల్లా కలెక్టర్ ఇంజినీరింగ్ శాఖకు చెందిన 14 మందిని తనిఖీ బృందాలుగా నియమించారు. వీరంతా పరీక్షలను పర్యవేక్షించారు. అంతేకాకుండా హై పవర్ కమిటీ, డెక్ కన్వీనర్లు, డీవీఈవో, ఆర్‌ఐవో, పోలీస్ బృందాలు కూడా తనిఖీలు నిర్వహించాయి. గురువారం నుంచి ద్వితీయ సంవ త్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లావ్యాప్తంగా 111 పరీక్ష కేంద్రాల్లో వీరు పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలను కూడా ఇంటర్ బోర్డు, జిల్లా కలెక్టర్ నియమించిన ప్రత్యేక తనిఖీ బృందాలు పర్యవేక్షించనున్నాయి. ఈ పరీక్షలకు 50.567మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
ట్రాఫిక్ టెన్షన్
ఇంటర్ విద్యార్థులను ట్రాఫిక్ టెన్షన్ వెంటాడింది. సమయానికి పరీక్ష కేంద్రానికి వెళ్తామో లేదోనని ఆందోళన పడ్డారు. ఆర్టీసీ కాంప్లెక్స్, ద్వారకానగర్, డాబాగార్డెన్స్ వంటి రద్దీ ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలకు వెళ్లాల్సిన విద్యార్థులు ఉదయం ట్రాఫిక్‌లో ఇరుక్కున్నారు. కార్పొరేట్ కళాశాలల విద్యార్థులు కార్లలో, మధ్యతరగతి విద్యార్థులు ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో రావడంతో రద్దీ ఎక్కువైంది. సాధారణ సమయాల్లోనే రద్దీగా ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్, డాబాగార్డెన్స్, ద్వారకానగర్ ఏరియాలు పరీక్షల కారణంగా మరింత ర ద్దీగా మారాయి. ట్రాఫిక్‌ను తప్పించుకుని పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి విద్యార్థులు ఉరుకులు, పరుగులు తీశారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.
పరీక్షలు ప్రశాంతం
Published Thu, Mar 12 2015 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM
Advertisement
Advertisement