ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో ఈ నెల నుంచి ఏప్రిల్ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఇంటర్మీడియట్ బోర్డు సభ్యులు, విద్య, రెవెన్యూ, పోలీస్, ఆర్టీసీ, ట్రాన్స్‌కో, పోస్టల్, వైద్య శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు.
ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి, కన్వీనర్ ఎల్.జె.జయశ్రీ మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి మార్చి 4 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు 164 కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు రెండో సెషన్ జరుగుతుందని తెలిపారు. మార్చి 12 నుంచి ఏప్రిల్ 1 వరకు రాత పరీక్షలు 111 పరీక్షా కేం ద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయని వివరించారు. 34 పరీక్షా పత్రాల స్టోరేజ్ కేం ద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 20 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను గుర్తించినట్లు వెల్లడించారు.