ఇంటర్ పరీక్షలకు రెడీ..
ఈ నెల 9 నుంచి 27 వరకు పరీక్షలు
188 కేంద్రాలు.. 1.41 లక్షల మంది విద్యార్థులు
అన్ని ప్రాంతాల్లో అదనపు బస్సులు
సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు హైదరాబాద్ జిల్లా అధికారయంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 9 నుంచి 27 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతుండటంతో... ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసేందుకు ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ నిర్మల ఆదేశాలిచ్చారు. జిల్లాలో 1,41,581 మంది పరీక్షలకు హాజరవనుండగా...188 కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగరంలోని సంజీవరెడ్డినగర్, మెహిదీపట్నం ,హిమాయత్‌నగర్, నారాయణగూడ, నల్లకుంట తదితర ప్రాంతాలలో పరీక్షా కేంద్రాలు అధికంగా ఉండటంతో.... అందుకు అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ, కేంద్రాల వద్ద నిఘా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు ఆయా కేంద్రాలకు నిర్ణీత సమయాని కంటె అరగంట ముందుగానే చేరుకునేందుకు వీలుగా తగిన సంఖ్యలో బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ కోరారు. ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. కాగా ఎండలు ముదురుతుండటంతో అన్ని పరీక్షా కేంద్రాలలో మెడికల్ కిట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఒకే చోట అధిక కేంద్రాలున్న ప్రాంతంలో అదనంగా ఏఎన్‌ఎమ్‌లను నియమించాలని భావిస్తున్నారు.