సాక్షి, తణుకు: స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి తణుకు రాజకీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉంది. అన్ని రాజకీయ భావాలనూ ఆదరించిన చరిత్ర తణుకుది. ఇక్కడి ప్రజలకు చైతన్యం ఎక్కువ. తణుకు అసెంబ్లీ నియోజకవర్గం తొలి నుంచీ విలక్షణతను చాటుకుంటోంది. ముళ్లపూడి, చిట్టూరి వర్గాల ఆధిపత్య పోరు ఇటీవల వరకూ సాగుతూ ఉండేది. పార్టీల ప్రాబల్యం కంటే వర్గాల ప్రాబల్యమే ఎక్కువగా ఉండేది. ముళ్లపూడి, చిట్టూరి వర్గాల్లో ముళ్లపూడి వర్గం తెలుగుదేశం పార్టీలోనూ, చిట్టూరి వర్గం కాంగ్రెస్‌లోనూ ఉండేవి. టీడీపీ ఆవిర్భావానికి ముందు ముళ్లపూడి వర్గం కాంగ్రెస్‌లో ఉండేది. చిట్టూరి వర్గం మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. 1975 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీకి, 1983 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలికింది. అయితే 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన కారుమూరి వెంకటనాగేశ్వరరావు గెలుపుతో నియోజకవర్గ ముఖచిత్రం ఒక్కసారిగా మారింది. అప్పటి వరకు రెండు వర్గాలకే పరిమితమైన రాజకీయం విస్తరించింది. 1952లో నియోజకవర్గం ఆవిర్భవించింది. అప్పటి నుంచి 2014 వరకు 14 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి.
భౌగోళిక స్వరూపం
పుణ్య గోస్తనీ నది ప్రవహించే ప్రాంతంగా తణుకు ప్రసిద్ధి గాంచింది. నియోజకవర్గ కూడలిగా ఉన్న తణుకు ప్రాంతంలోనే మహాభారతాన్ని ఆంధ్రీకరించిన ఆదికవి నన్నయ్య యజ్ఞం చేసినట్లుగా చరిత్ర చెబుతోంది. దీన్ని బట్టి తణుకు ప్రాంతానికి వెయ్యేళ్ల కంటే ఎక్కువ చరిత్ర ఉన్నట్లు స్పష్టమవుతుంది. వ్యవసాయం, పారిశ్రామికంగా, విద్య, వైద్య రంగాల్లో తణుకు ఎంతో అభివృద్ధి చెందింది.
వ్యవసాయం
వ్యవసాయాధార ప్రాంతమైన ఈ ప్రాంతంలో ఎక్కువగా వరి సాగు చేస్తుంటారు. తణుకుతోపాటు ఇరగవరం, అత్తిలి మండలాల్లో మొత్తం 45 వేల ఎకరాల్లో వరి సాగవుతోంది. రాష్ట్రంలో ఆంధ్రాసుగర్స్ పేరు ప్రసిద్ధిగాంచింది. దీంతో ఈ ప్రాంతంలో చెరకు సాగు విరివిగా జరిగేది. ప్రస్తుతం ఆంధ్రాసుగర్స్‌లో ఉత్పత్తి నిలిచిపోవడంతో చెరకు సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది.
పారిశ్రామిక ప్రగతి
పారిశ్రామికీకరణ ఇక్కడి నాగరికతను పూర్తిగా మార్చివేసింది. 1947లో ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ సారథ్యంలో ఆంధ్రాసుగర్స్ ఏర్పాటుతో పారిశ్రామికీకరణకు బీజం పడింది. దీంతోపాటు టెక్స్‌టైల్స్, సుమిల్లులు ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరిగాయి. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేస్తున్న రాకెట్ ప్రయోగాలకు కావాల్సిన ద్రవరూప ఇంధనాన్ని రూపొందించడంలో ఆంధ్రాసుగర్స్ ఘన విజయాన్ని సాధించింది.
తగ్గిన ఓటర్ల సంఖ్య
తణుకు నియోజకవర్గంలో మొత్తం 2,16,183 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 1,06,804, మహిళలు 1,11,353 మంది ఉన్నారు. ఆరుగురు ఇతరులు ఉన్నారు. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో 2,19,225 మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి గత ఎన్నికలతో పోల్చితే 3,042 మంది ఓటర్లు తగ్గారు. గత ఎన్నికల్లో 222 పోలింగ్ కేంద్రాలు ఉండగా ప్రస్తుతం తణుకు నియోజకవర్గంలో పోలింగ్ స్టేషన్ల సంఖ్య 242కు పెరిగింది.
ప్రధాన సమస్యలు
తణుకు పట్టణంలోని ప్రజలకు గోదావరి జలాలు అందించేందుకు ఉద్దేశించిన పథకానికి స్థల సేకరణ ప్రక్రియ ఇప్పటికీ పూర్తికాలేదు. ఫలితంగా వేసవిలో గోదావరి జలాలు అందడం లేదు. ఇందుకు సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. దీనికి సుమారు 60 ఎకరాల స్థల సేకరణ చేపట్టాల్సి ఉండగా రైతులు కోర్టును ఆశ్రయించడంతో ప్రక్రియ నిలిచిపోయింది. తణుకు వెంకట్రాయపురంలో గోస్తనీ మళ్లింపు భూమి 7.26 ఎకరాలను ఆంధ్రాసుగర్స్‌కు పచ్చదనం కోసం కేటాయించారు. గత ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. ప్రస్తుత అధికార పార్టీ నేతలు మాత్రం ఈ స్థలాన్ని ఆంధ్రాసుగర్స్ యాజమాన్యానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ హయాంలో అభివృద్ధి తణుకు పట్టణంలో సుమారు 600 మంది పేదలకు ఇందిరమ్మ కాలనీ పేరుతో అజ్జరం రోడ్డులో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. కొన్నేళ్లుగా పేద ప్రజలు ఇళ్లులేక ఇబ్బందులు పడుతుండటంతో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తణుకులో ఇందిరమ్మ కాలనీ పేరుతో కాలనీ నిర్మించారు.
తణుకుకు గోదావరి జాలాలు అందించే క్రమంలో సుమారు రూ.120 కోట్లతో తాగునీటి ప్రాజెక్టును గత ప్రభుత్వ హయాంలో నిర్మించారు. గోదావరి జలాలను పైపులైన్ల ద్వారా మళ్లించి ఇక్కడ శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు. మరోవైపు సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మాణానికి 60 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ప్రస్తుత పాలకులు శ్రద్ధ చూపడంలేదు.వైఎస్సార్‌సీపీ దూకుడు ప్రస్తుతం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలం పుంజుకుంది. ఎన్నికల సమరంలో ముందుంది. ఆ పార్టీ నియోజవర్గ కో–ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఇరగవరం మండలం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇప్పటికే రావాలి జగన్–కావాలి జగన్, నిన్ను నమ్మంబాబూ, గడపగడపకూ వైఎస్సార్, నవరత్నాలు వంటి కార్యక్రమాలతో ప్రజల్లో మమేకమయ్యారు. అధికారపార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అవినీతి, అక్రమాలను ప్రజల్లో ఎండగడుతున్నారు. ఫలితంగా కారుమూరికి విజయావకాశాలు పెరిగాయి. ఇదిలా ఉంటే అధికారపార్టీ వైఫల్యాలు, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అవినీతిపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
మండలాలు తణుకు, ఇరగవరం, అత్తిలి
జనాభా : 2,57,314
పురుషులు 1,09,132
స్త్రీలు1,48,176
ఇతరులు 06
ఓటర్లు : 2,18,163
పురుషులు 1,06,804
స్త్రీలు1,11,353
ఇతరులు 06
పోలింగ్ కేంద్రాలు : 242
Comments
Please login to add a commentAdd a comment