సాక్షి ప్రతినిధి, ఏలూరు : నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కనుమూరి రఘురామకృష్ణంరాజు బరిలోకి దిగుతుండగా, జనసేన నుంచి పవన్‌కళ్యాణ్ సోదరుడు నాగబాబు, ప్రజాశాంతి పార్టీ తరఫున కేఏ పాల్ బరిలోకి దిగుతున్నారు. తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి దొరకకపోవడంతో ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజును రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. మరోవైపు బీజేపీ నుంచి మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, కాంగ్రెస్ నుంచి కనుమూరి బాపిరాజు పోటీకి దిగడంతో పోటీ రంజుగా మారనుంది. మరోవైపు భీమవరం అసెంబ్లీ నుంచి పవన్‌కళ్యాణ్ పోటీ చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం నాగబాబు జనసేనలో చేరి నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. మరోవైపు నాగబాబు పాలకొల్లులో పోటీ చేస్తే.. నేనూ పోటీ చేస్తా.. మనకు కావాల్సింది.. నటులు కాదు. అభివృద్ధి కావాలి అంటూ నరసాపురం నుంచి పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధినేత కెఏ పాల్ ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు బరిలో నిలిచారు. దీంతో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ రాజకీయం రంజుగా మారింది.
కాపు ఓట్ల కోసం పవన్, నాగబాబు పోటీ
నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి నాగబాబు, భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి అక్కడ కాపుల ఓట్లు ఎక్కువగా ఉండటమే కారణంగా కనపడుతోంది. కాపుల పార్టీ కాదని చెబుతున్నప్పటికీ కాపు ఓటింగ్ ఎక్కువ ఉన్న స్థానాలనే ఎంచుకోవడం చర్చనీయాంశమైంది. అనంతపురం, తిరుపతి, రాజానగరం, పిఠాపురం, భీమవరం, గాజువాక, పెందుర్తి, ఇచ్చాపురం స్థానాలను పరిశీలించి కాపు ఓటింగ్ ఎక్కువగా ఉండే భీమవరం, గాజువాక స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. ఒకచోట పోటీ చేస్తే ఫలితం తేడా కొట్టే అవకాశం ఉందన్న అనుమానంతో రెండుస్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. గతంలో పవన్ సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అధినేతగా రెండు చోట్ల పోటీ చేసిన విషయం తెలిసిందే.
2009 ఎన్నికల్లో పాలకొల్లు, తిరుపతిల నుంచి ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో తిరుపతిలో మాత్రమే చిరంజీవి గెలుపొందారు. పాలకొల్లులో ఓటమి చవిచూశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేసి గెలిచినా ఈ సీటు ఉంచుకోరని, గాజువాకపైనే దృష్టి పెడతారన్న వాదన ముందుకు వస్తోంది. అయితే పాలకొల్లు అనుభవం దృష్ణ్యా ఇద్దరు రంగంలోకి దిగితే కాపు ఓట్లను పెద్దసంఖ్యలో తమవైపునకు తిప్పుకోవచ్చనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున అంజిబాబు రంగంలో ఉన్న సంగతి తెలిసిందే. పవన్‌కళ్యాణ్ పేరును ప్రకటించిన తర్వాత అంజిబాబు పోటీకి ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం ముందుకు పెట్టారు. అంజిబాబును తప్పించి బలహీనమైన అభ్యర్థిని తెరపైకి తేవాలన్న ప్రయత్నాలు మొదలైనట్టు తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవి రెండు చోట్ల, జనసేన నుంచి పవన్‌కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేయడం వంటి సెంటిమెంట్లు మెగా అభిమానులకి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగానే పశ్చిమ గోదావరి పర్యటన సమయంలో పది రోజులకు పైగా భీమవరంలోనే మకాం వేశారు.
అందుబాటులో ఉండని వ్యక్తికి ఓట్లా
పవన్‌కళ్యాణ్ పోటీ చేయడం వల్ల తమకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని అక్కడ గ్రంధి శ్రీనివాస్ గెలిచి తీరుతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. అందుబాటులో ఉండని వ్యక్తికి ఇక్కడి ప్రజలు ఓట్లు వేసి గెలిపించే పరిస్థితి లేదన్నారు. గతంలో పాలకొల్లులో అదే జరిగిందన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేసే భీమవరం వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ అఖండ విజయం సాధించడం ఖాయమని రఘురామకృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment