ముద్దనూరు : బహిరంగ మల విసర్జన సాంఘిక దురాచారం.. వ్యక్తి గత మరుగు దొడ్డి నిర్మించుకోవడం గౌరవప్రదం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ప్రభుత్వం తీరా బిల్లుల చెల్లుంపులో ఆలస్యం చేస్తోంది. ప్రభుత్వం ప్రచారంంతో మరుగు దొడ్డి సౌకర్యం లేని వేలాది మంది ఇళ్లలో మరుగు దొడ్ల నిర్మాణాలు మొదలు పెట్టారు. గత నెల చివరి వరకు మరుగు దొడ్ల మొదటి దశ నిర్మాణాలకు కొంత మందికి బిల్లులు చెల్లించారు.
సుమారు 25 రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా మరుగు దొడ్ల నిర్మాణాలకు కేటాయించిన బిల్లులు చెల్లింపునకు అనధికారికంగా బ్రేక్ పడింది. ఆ నిధులు గోదావరి పుష్కరాలకు మళ్లించడం వల్ల చెల్లింపులు ఆగాయని తెలిసింది. అయితే సాఫ్ట్‌వేర్ సమస్య వల్ల చెల్లించడం లేదని అధికారులు చెబుతున్నారు. బిల్లులు అందక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు.
మరుగు దొడ్ల నిర్మాణ లక్ష్యమిదీ..
స్వచ్ఛ భారత్ మిషన్ కింద ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగు దొడ్డి నిర్మించుకోవాలి. జిల్లాలో సుమారు 4.77 లక్షల కుటుంబాలుండగా, అందులో 2.39 లక్షల కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేవని సర్వేలో వెల్లడైంది. దీంతో మొదటి దశలో 2016 మార్చి నాటికి జిల్లాలో 1.33 లక్షల కుటుంబాలకు మరుగు దొడ్ల సౌకర్యం కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో సుమారు 50 వేల కుటుంబాలకు మరుగుదొడ్ల నిర్మాణానికి దశల వారీగా అనుమతులు మంజూరు చేస్తున్నారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిధులతో మరుగుదొడ్డి, బాత్ రూం కలిపి నిర్మిస్తే రూ.15 వేలు, కేవలం మరుగుదొడ్డి మాత్రమే నిర్మిస్తే రూ.12 వేలు మంజూరు చేస్తున్నారు. అందులో మొదటి దశలో ఒక కేటగిరీకి రూ. తొమ్మిది వేలు, మరుగుదొడ్డి మాత్రమే నిర్మించుకున్న వారికి రూ. ఆరు వేలు చెల్లించాలి. ఆ రెండు వర్గాలకు కొందరికి మాత్రమే చెల్లింపులు జరిగాయి. రెండో దశలో చెల్లింపులను గత నెల నుంచి పూర్తిగా ఆపేశారు. ఈ నిధులు గోదావరి పుష్కరాలకు మళ్లించారని తెలిసింది. దీంతో మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు పెండింగ్‌లో ఉంచారని తెలుస్తున్నది. ఈ విషయమై ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ శ్రీనివాసులును సంప్రదించగా, సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగా చెల్లింపులు ఆగిపోయాయన్నారు. త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్పారు.
పుష్కరాలకు ..ఆ నిధులు!
Published Sun, Jul 26 2015 3:37 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM
Advertisement
Advertisement